ఇటీవల తాత్కాలిక సచివాలయ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మహిళా ఉద్యోగులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తన తప్పిదాలతో పీకల్లోతు కూరుకుపోయిన సీఎం చంద్రబాబునాయుడు వాటి నుంచి తప్పించుకునే క్రమంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిరు ఉద్యోగులు మొదలు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల వరకు ఆవేదన చెందుతున్నారు. తన స్వార్థ రాజకీయాలు తప్ప ప్రజాప్రయోజనాలు, ఉద్యోగుల సాధక బాధకాలు రాష్ట్ర ప్రభుత్వాధినేతకు ఏమాత్రం పట్టట్లేదన్న విమర్శిస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం నూతన రాజధాని నిర్మాణం తప్పనిసరైనా.. అక్కడకు వెళ్లాల్సిన అవసరమున్నా... కనీస వసతులు కూడా కల్పించకుండా తరలింపుపై ఈ హడావుడి ఎందుకని ఉద్యోగులు ప్రశిస్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలంగాణ ప్రభుత్వం నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతోనే హైదరాబాద్ నుంచి తమనందర్నీ అమరావతికి ఇంత హడావుడిగా తరలిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
‘ఓటుకు కోట్లు’ కేసువల్లే తెలంగాణ ప్రభుత్వాన్ని మాటవరుసకైనా చంద్రబాబు పల్లెత్తుమాట అనలేకపోతున్నారని ఐఏఎస్, ఐపీఎస్, సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండానే అక్రమంగా నీటిప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నా, ఏపీ భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలగనుందని తెలిసినా చంద్రబాబు నుంచి ఉలుకుపలుకు లేకపోవడానికి ‘ఓటుకు కోట్లు’ కేసే ప్రధాన కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.
‘‘ఓటుకు కోట్లు కేసు నమోదు తర్వాత చంద్రబాబు మా తెలంగాణ సర్కారు గురించి ఒక్క మాటయినా వ్యతిరేకంగా మాట్లాడారా? విమర్శలైనా చేశారా? వారి పార్టీ నేతల్ని తీసుకెళుతున్నా... పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నా మాట్లాడుతున్నారా? మీరు క్షుణ్ణంగా పరిశీలించండి’’ అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఇప్పుడేకాదు, భవిష్యత్తులోనూ మా ప్రభుత్వం గురించి, మా సీఎం గురించి ఆయన(చంద్రబాబు) ఒక్క అంశంలోనూ నిలదీయలేరు, ప్రశ్నించలేరు’ అని మరో అధికారి చెప్పారు.
ఉద్యోగుల్లో ఆందోళన..
రాజధాని అమరావతికి ఆగస్టులోగా హైదరాబాద్ నుంచి ఉద్యోగులందరూ తరలిరావాలని ముఖ్యమంత్రి, మంత్రులు చెపుతున్నారు. ఇందులోనూ స్పష్టత లేదు. ఎవరికివారు భిన్న ప్రకటనలు చేస్తూ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కొందరు సీఎం, మంత్రులకు వత్తాసు పలుకుతున్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సచివాలయ ఉద్యోగులు సమావేశమైన సందర్భంగా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించే విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఇప్పటికే పిల్లల్ని విద్యాసంస్థల్లో చేర్పించడానికి సమయం మించిపోయిందని, ప్రస్తుతం చదువుకుంటున్న స్కూళ్లలో ఫీజులు చెల్లించామని గుర్తుచేశారు.
అమరావతిలో అద్దెఇళ్లు అందుబాటులో లేవని, ఉన్నవాటిలోనూ అద్దెలెక్కువని, అంతేగాక సరైన వసతులు, సదుపాయాలూ లేవని పేర్కొంటున్నారు. రెండు రోజులక్రితం నూతన రాజధాని ప్రాంతాన్ని సందర్శించిన మహిళా ఉద్యోగినులు సైతం అక్కడి వసతులపై పెదవి విరుస్తున్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది మార్చివరకు తరలింపు ఆలోచనను మానుకోవాలని పలువురు కోరుతున్నారు.
‘మాకు సాధకబాధకాలుంటాయి. చాలామంది షుగర్, బీపీలాంటి దీర్ఘకాలిక రోగాలతో బాధలు పడుతున్నారు. సరైన తిండి లేకపోతే తిప్పలు. కుటుంబం ఇక్కడుంటే మేమక్కడ ఉండాలి’ అని ఓ సీనియర్ ఉద్యోగి వాపోయారు. ‘అమరావతిలో ఏం జరుగుతోందో మాకన్నీ తెలుసు. వారి స్వప్రయోజనాలకోసం అందర్నీ ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ‘రాజధానికి పోవడం అందరి బాధ్యత. కానీ అక్కడ కనీస వసతులు, సౌకర్యాలు ఉండాలి కదా. ఏమీ ఏర్పాటవకుండా ఇంత తొందరెందుకనేదే మా ప్రశ్న’ అని మరో మహిళా ఉద్యోగిని వాపోయారు.