లక్ష్యంలో 31.1 శాతానికి ద్రవ్యలోటు | India Fiscal Deficit For April-August Period At Rs 4.68 Lakh Crore | Sakshi
Sakshi News home page

లక్ష్యంలో 31.1 శాతానికి ద్రవ్యలోటు

Published Fri, Oct 1 2021 6:19 AM | Last Updated on Fri, Oct 1 2021 6:19 AM

India Fiscal Deficit For April-August Period At Rs 4.68 Lakh Crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో 31.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.4,68,009 కోట్లు. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) గురువారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే, 2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోలి్చతే ఇది 6.8 శాతం. అంచనాలతో పోలి్చతే ఇప్పటికి ద్రవ్యలోటు రూ.4,69,009 కోట్లకు (31.1 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం. కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్‌ అంచనాలను దాటి ఏకంగా 109.3 శాతానికి ఎగసింది. 2020–21లో  3.5 శాతం తొలి (బడ్జెట్‌) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే...

2020–21తో పోలి్చతే మెరుగైన స్థితి
► 2021 ఆగస్టు నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.8.08 లక్షల కోట్లు. బడ్జెట్‌ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 40.9 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్‌ మొత్తం ఆదాయ అంచనాల్లో ఆగస్టు నాటికి ఒనగూరింది కేవలం 16.8 శాతమే కావడం గమనార్హం.  మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 ఆగస్టు నాటికి) వచి్చంది రూ.6.44 లక్షల కోట్లు. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 41.7 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్‌ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో ఆగస్టు నాటికి ఒనగూరింది కేవలం 17.4 శాతమే కావడం గమనార్హం.

► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.12.76 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్‌ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 36.7 శాతం.  

► వెరసి ఆదాయ–వ్యయాల మధ్య వ్యత్యాసం (ద్రవ్యలోటు) ఆగస్టు నాటికి రూ.4.68 లక్షల కోట్లకు చేరిందన్నమాట.  

►  ద్రవ్యలోటు కట్టడికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్, రేటింగ్‌ సంస్థలు ఇతర ఆర్థికవేత్తలు  ఉద్ఘాటిస్తున్నారు. ఆర్థిక ఉద్దీపనల ప్రకటనల విషయంలో జాగరూకత పాటించాలన్నది వారి అభిప్రాయం, కాగా,  కేవీ కామత్‌ లాంటి ప్రముఖ బ్యాంకర్లు ఈ విషయంలో కొంత సాహస వైఖరిని ప్రదర్శించాలని కేంద్రానికి సూచిస్తున్నారు.  

► 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి.

► ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.  కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెపె్టంబర్‌) బాండ్ల జారీ ద్వారా 7.02 కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా  అక్టోబర్‌ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది.
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement