కాంట్రాక్టర్లతో డిస్కంల దోస్తీ! | CAG reports showed on government department working Performance | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లతో డిస్కంల దోస్తీ!

Published Sat, Nov 29 2014 2:32 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

కాంట్రాక్టర్లతో డిస్కంల దోస్తీ! - Sakshi

కాంట్రాక్టర్లతో డిస్కంల దోస్తీ!

జెన్‌కో ప్రాజెక్టుల జాప్యంతో సర్‌చార్జీల భారం
 ప్రభుత్వ శాఖల పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుబట్టింది. సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఖాజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. వివిధ శాఖలు అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని తలంటుపోసింది. అధికారుల హస్తలాఘవం, నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోందని చీవాట్లు పెట్టింది. పౌర సరఫరాలు, విద్యుత్, పింఛన్లు, పారిశుద్ధ్యం, ఆర్టీసీ, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ వంటి అన్ని విషయాల్లోనూ ఇదే తంతుగా ఉందని లోపాలను ఎత్తిచూపింది. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని పేర్కొంది.  
 
 సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో మితిమీరిన జాప్యం కారణంగా వినియోగదారులపై ఇంధన సర్‌చార్జీల మోత మోగుతోందని కాగ్ ఎత్తిచూపింది. దీంతో అంచనా వ్యయం పెరిగిపోవడంతో పాటు కొరతను అధిగమించేందుకు బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని వెల్లడించింది. ‘2008-12 మధ్య డిస్కంలు మార్కెట్లో 23,709.72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. ఒక్కో యూనిట్‌కు రూ. 4.49 నుంచి రూ. 6.95 వరకు చెల్లించాయి. 2012-13లో యూనిట్‌కు రూ. 5.17 చొప్పున కొనుగోలు చేశాయి. అదే వ్యవధిలో జెన్‌కో ఉత్పత్తి చేసిన విద్యుత్ ఖరీదు యూనిట్‌కు కేవలం రూ. 2.23 నుంచి రూ. 3.54 మాత్రమే.
 
 మార్కెట్లో చెల్లించిన అదనపు వ్యయాన్ని డిస్కంలు వినియోగదారులపై ఇంధన సర్‌చార్జీలుగా భారం మోపాయి..’ అని కాగ్ విశ్లేషించింది. ఉమ్మడి రాష్ట్రంలో హైవోల్టేజీ డిస్ట్రిబ్యూషన్ పథకం (హెచ్‌వీడీఎస్) అంచనాల్లోనే లోటుపాట్లు ఉన్నాయని.. డీపీఆర్‌ల అంచనా వ్యయం పెంచి రూ. 51.52 కోట్లు అదనంగా ఖర్చు చేసినట్లు ధ్రువీకరించింది. కాంట్రాక్టర్లకు ఇష్టమొచ్చినట్లుగా గడువు పెంచటంతో పాటు ఎక్సైజ్, వ్యాట్ రూపంలో అధికంగా చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. పనుల్లో తీవ్ర జాప్యంతో ఆర్‌ఈసీ నుంచి తీసుకున్న రుణాలకు ఎన్‌పీడీసీఎల్ రూ. 8.24 కోట్ల వడ్డీ భారం భరించాల్సి వచ్చిందని, హెచ్‌వీడీఎస్ మూడో దశ బిడ్లలో నిబంధనలు పాటించకపోవటంతో సీపీడీసీఎల్ రూ. 6.17 కోట్లు అదనంగా ఖర్చు చేసిందని తప్పుబట్టింది.
 
 విద్యుదీకరణ పథకంలో లోటుపాట్లు..
 కేంద్రం అమలు చేసిన రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకంలో లోటుపాట్లను కాగ్ ఎత్తి చేపింది. నాలుగేళ్లు జాప్యం కావటం, లబ్ధిదారులను గుర్తించేందుకు ముందస్తు సర్వే చేయకపోవటంతో డీపీఆర్‌లలో తప్పులు జరిగినట్లు నివేదించింది. ఒప్పందాలకు విరుద్ధంగా డిస్కంలు రూ. 6.04 కోట్లు చెల్లించాయని, ఎన్‌డీపీసీఎల్  కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన రూ. 1.16 కోట్ల లేబర్ సెస్ వసూలు చేయలేదని తెలిపింది. ఖర్చు కాకుండా మిగిలిన ఆర్‌జీజీవివై నిధులపై వచ్చిన వడ్డీని ప్రాజెక్టు వ్యయంపై సర్దుబాటు చేయకుండా సొంత ఆదాయంగా చూపించాయని తెలిపింది.
 
 రైతులు వాడని గిడ్డంగులు
 సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఎరువులు, నోటిఫై చేసిన వస్తువులు నిల్వ చేసేందుకు నిర్దేశించిన ప్రభుత్వ గిడ్డంగులు నష్టాల్లో ఉన్నాయని కాగ్ వెల్లడించింది. 2008-13 మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 159 గోదాముల్లో 56 గోదాములు రూ. 1.69 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. 2009 ఏప్రిల్ నుంచి ఎఫ్‌సీఐ సవరించిన నిల్వ చార్జీలను ఏపీఎస్‌డబ్ల్యుసీ క్లెయిమ్ చేయకపోవటంతో రూ. 40.96 కోట్ల రాబడి నష్టం వాటిల్లింది. ఇప్పటికీ గిడ్డంగులు నిల్వల నాణ్యతా ప్రమాణాలను పాటించటం లేదు. రైతులు వాటిని వినియోగించడం లేదు. గోదాముల సామర్థ్య వినియోగం 2008-09లో 58 శాతం ఉండగా.. 2012-13 నాటికి 89 శాతానికి పెరిగింది. కానీ అద్దె గోదాములు, పెట్టుబడిదారుల గోదాముల సామర్థ్య వినియోగమే ఇప్పటికీ ఎక్కువగా ఉంది.
 
 సొంతది ఖాళీ.. ‘అద్దె’తో లూటీ  
 సొంత భవనం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏపీఎండీసీ) అద్దె భవనంలో ఉంటూ ఆదాయాన్ని కోల్పోయిందని కాగ్ అక్షింతలు వేసింది. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతంలో 15,920 చదరపు అడుగుల సొంత భవనముంది. అది ఖాళీ చేసి హెచ్‌ఎండబ్ల్యు ఎస్‌ఎస్‌బీ అద్దె భవనంలోకి కార్యాలయాన్ని మార్చింది. రూ. 5.25 లక్షల నెలసరి అద్దెతో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి తోడు అద్దె భవనంలో అంతర్గత మార్పులకు రూ. 2.78 కోట్లు ఖర్చు చేసింది. మూడేళ్లుగా సొంత భవనం ఖాళీగా ఉండడంతో ఆదాయం కోల్పోయింది.
 
 దేవుడిపైనే భారం..
 దేవాదాయ శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కాగ్ తేల్చింది. ఆ శాఖకు ప్రధాన దేవాలయాల నుంచి రావాల్సిన దేవాదాయ పరిపాలన నిధి, ఆడిట్ ఫీజు, సర్వ శ్రేయోనిధి, అర్చక సంక్షేమ నిధిలాంటి విరాళాలు అందడం లేదని వెల్లడించింది. 2003-2012 మధ్య దేవాదాయ పరిపాలన నిధికి రూ. 83 కోట్లు, ఆడిట్ ఫీజు కింద రూ. 24 కోట్లు, సర్వశ్రేయోనిధికి రూ. 27 కోట్లు, అర్చక సంక్షేమ నిధికి రూ. 43 కోట్లు.. వెరసి దాదాపు రూ. 178 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్టు తేల్చింది. 2013 మార్చి నాటికి దేవాలయాల స్థలాలకు లీజులు, సేవా హక్కుల లెసై న్సు ద్వారా రావాల్సిన మొత్తంలో రూ. 7.61 కోట్లు బకాయిలున్నట్లు తెలిపింది.
 
 ప్రణాళికలు లేకుండానే..
 ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో రహదారుల నిర్మాణానికి  ప్రాజెక్టు నివేదికలు రూపొందించకుండా.. అవాస్తవికమైన సమాచారంతోనే పనులు చేపడుతున్నారని ‘కాగ్’ తుర్పారబట్టింది. బీటీ రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 1,104 కోట్లు కావాలని ఆ శాఖ ప్రతిపాదనలు ఇస్తే.. ప్రభుత్వం రూ. 99 కోట్లు మాత్రమే విడుదల చేసిందని... దీనివల్ల 3,817 కోట్లతో చేపట్టిన రహదారులు శిథిలావస్థకు చేరుకున్నాయని కాగ్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement