రెండేళ్లక్రితం వెల్లడై జాతి మొత్తాన్ని దిగ్భ్రమపరిచిన బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో ఆద్యంతమూ అవకతవకలు చోటుచేసుకు న్నాయని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. రెం డేళ్లక్రితం ఆనాటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) 195 బొగ్గు క్షేత్రాల కేటాయింపులో లక్షా 86 వేల కోట్ల స్కాం జరిగిందని వెల్లడించి నప్పుడు యూపీఏ పెద్దలు ఇంతెత్తున లేచారు. ఆయన కావాలని సంచలనం కోసం పెద్ద పెద్ద అంకెలను చూపుతున్నారని కపిల్ సిబల్ వంటి నేతలు దుయ్యబట్టారు. దేశంలో నీరసించివున్న మౌలిక సదుపా యాల రంగాన్ని పట్టాలెక్కించి...అటు ఉత్పాదకతనూ, ఇటు ఉపాధిని పెంచే ఉద్దేశంతో తీసుకున్న కీలక నిర్ణయాలను అనవసరంగా తప్పుబ డుతున్నారని ఆరోపించారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో తాము అంతక్రితంనాటి ఎన్డీయే సర్కారు విధానాన్నే అనుసరించాం తప్ప కొత్తదేమీ సృష్టించలేదని దబాయించారు. కానీ ఎవరు చేసినా తప్పు తప్పే. ఈ కేటాయింపులు రెండు విధాలుగా జరిగాయి. తొలుత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుతో కేటాయిస్తే, ఆ తర్వాత కేంద్రం లోని వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ ద్వారా కొనసాగాయి. ఈ రెండు విధానాల్లోనూ పారదర్శకత లోపించడమేగాక, అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని....కనుక ఎన్డీయే, యూపీఏ పాలకులు పంచిపెట్టిన 218 బొగ్గు క్షేత్రాలూ చట్టవిరుద్ధమైనవేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
సహజ వనరుల వినియోగం విషయంలో ప్రభుత్వాలు వ్యవహరి స్తున్న తీరులో చట్టవిరుద్ధత ఉంటున్నదని, అవి ఎలాంటి మార్గదర్శకా లనూ అనుసరించడంలేదని పర్యావరణవేత్తలనుంచి, స్వచ్ఛంద సంస్థ లనుంచి చాన్నాళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వప్రయోజనా లంటూ లేకపోతే పాలకులు వీటిని పట్టించుకునేవారు. తమ విధానా లను సమీక్షించుకుని సరిదిద్దుకునేవారు. దేశంలో మౌలిక సదుపా యాల రంగం బలహీనంగా ఉందన్నది నిజమే. ముఖ్యంగా సిమెంటు, విద్యుత్తు, ఉక్కు పరిశ్రమలకు అవసరమైన బొగ్గును కోల్ ఇండియా అందించలేకపో తున్నదని, విదేశాలనుంచి దిగుమతి చేసు కుంటే ఆయా పరిశ్రమలకు తడిసిమోపెడవుతున్నదని ఆ రంగంలోని వారు మొరపెట్టుకున్నారు. మౌలిక సదుపాయాల రంగం పటిష్టం కావాలంటే ఈ పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాలు కేటాయించడం ఉత్తమ మన్న నిర్ణయానికి పాలకులు వచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకూ, సంస్థలకూ కేటాయించి నప్పుడు అత్యంత జాగురూకతతో వ్యవహరించాలన్న సంగతిని వారు విస్మరించారు. బొగ్గు క్షేత్రాలను స్వీయావసరాల కోసం వినియోగించు కోవాలి తప్ప బయటివారికి అమ్మరాదన్న షరతు పెట్టడం మినహా ఇతర నియమాలేవీ పాటించలేదు. వచ్చిన దరఖాస్తుల్లో వేటిని ఎందుకు అనుమతిస్తున్నారో, ఎందుకు నిరాకరిస్తున్నారో స్క్రీనింగ్ కమిటీ సభ్యులే చెప్పలేని స్థితి నెలకొన్నది. బొగ్గు క్షేత్రం కావాలని కోరిన సంస్థకు అందుకు అవసరమైన అర్హతలున్నాయో లేదో చూసే నాథుడు లేడు. నిజానికి యూపీఏ అధికారానికొచ్చిన కొత్తలో ఈ కేటాయింపులకు అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని తలపోసింది. నిజాయితీ అధికారిగా పేరొందిన పీసీ పరేఖ్ అందుకోసం ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. దేశంలో బొగ్గు క్షేత్రాలు తగినంతగా లేనపుడూ...వాటి కోసం విపరీతమైన పోటీ ఉన్నప్పుడూ సొమ్ముకు ఆశపడి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, కనీసం అలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తే అవకాశం ఉన్నదని పరేఖ్ గుర్తిం చారు. అందుకోసం పారదర్శకంగా ఉండేలా పోటీ వేలం విధానం అనుసరిస్తే బాగుంటుందని సూచించారు. ఇదంతా 2004నాటి మాట. స్క్రీనింగ్ కమిటీ విధానాన్ని రద్దు చేయాలని ఆనాటి ప్రధాని మన్మోహ న్‌సింగ్ కూడా భావించారు. అందుకోసం వెనువెంటనే ఆర్డినెన్స్ తీసుకురావడం మంచిదా... లేక సవివరమైన బిల్లు రూపొందించి చట్టం చేస్తే మంచిదా అన్న విచికిత్స కూడా జరిగింది. ఏమైందో ఏమో... ఈలోగా పాత విధానమే అమలవుతూ వచ్చి చివరకు అదే ఖరారైపోయింది! బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై ఆరోపణలొచ్చిన కాలంలో నాలుగేళ్లపాటు ప్రధాని మన్మోహన్‌సింగే బొగ్గు శాఖను స్వయంగా పర్యవేక్షించారు. మంచిగా ఉండటం, మౌనంగా మిగలడం సుగుణం కావచ్చేమోగానీ తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న శాఖలో భారీయెత్తున అవకతవకలు సాగుతున్నాయని తెలిసినప్పుడైనా సరిచే ద్దామని చూడకపోవడం మన్మోహన్ తప్పిదం. పైగా ఈ కుంభ కోణాన్ని కాగ్ బయటపెట్టినప్పుడు అంతా సవ్యంగానే ఉందంటూ సమర్ధించబోవడం మరింత దారుణం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగతంగా మన్మోహన్‌పై కూడా అభిశంసనే.
ఇంతకూ బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ రద్దవుతాయా? కేటాయింపుల ప్రక్రియ పరమ అవకతవకలతో నడిచిందని ధర్మాసనం చెప్పినా బొగ్గు క్షేత్రాలనూ ఆయా సంస్థలనుంచి వెనక్కి తీసుకోవాలా లేదా అన్న విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. కేటాయింపు వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండటంతో బొగ్గు క్షేత్రాల్లో పనులు గత రెండేళ్లుగా నిలిచిపోయాయి. పర్యవసానంగా పరిశ్రమలకు అవసరమైన విద్యుదుత్పాదన సాధ్యంకాలేదు. కనుక ఉత్పాదన, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. బొగ్గు క్షేత్రాల్లో పెట్టుబడులకు రుణాలిచ్చిన బ్యాంకులు సైతం బేలగా మారాయి. ఇన్నివిధాల దేశాన్ని భారీగా నష్టపరిచిన నేతలపై చర్య తీసుకోవడంతోపాటు భవిష్యత్తులో ఈ తరహా స్కాంలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించవలసిన అవసరం ఉన్నది.
ఇప్పుడేమంటారు?!
Published Tue, Aug 26 2014 12:15 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement