అంచనాలకు మించి.. | Sakshi
Sakshi News home page

అంచనాలకు మించి..

Published Fri, May 17 2024 4:25 AM

Growth in tax revenue at Telangana

వరుసగా మూడో ఏడాది పన్ను ఆదాయంలో వృద్ధి 

2023–24లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు మించి వచ్చిన రాబడులు 

బడ్జెట్‌ ప్రతిపాదన రూ.1.31 లక్షల కోట్లు..వాస్తవిక రాబడి రూ.1.35 లక్షల కోట్లు కాగ్‌ గణాంకాల వెల్లడి 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.48 వేల కోట్ల పన్ను ఆదాయం 

అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.2 వేల కోట్లు ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పన్ను ఆదాయం ఏటేటా పెరుగుతోంది. వరుసగా మూడో ఏడాది పన్ను రాబడుల్లో వృద్ధి నమోదు అయ్యింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) లెక్కల ప్రకారం మార్చి 2024 నాటికి రూ.1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం కింద సమకూరాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నుల రూపేణా ఈ మొత్తం సమకూరిందని కాగ్‌ తెలిపింది.

బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్లు ఎక్కువగా, సవరించిన అంచనాల కంటే రూ.17 వేల కోట్లు ఎక్కువగా ఈ ఏడాది పన్ను రాబడులు రావడం గమనార్హం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను రాబడుల వ్యవస్థ సజావుగానే ముందుకెళుతోందని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో రూ.48 వేల కోట్ల పన్ను ఆదాయం వచ్చింది.  

గత మూడేళ్లుగా.. 
పన్ను రాబడులు తొలిసారిగా 2021–22లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు మించి వచ్చాయి. ఆ ఏడాదిలో రూ.1.06 లక్షల కోట్లు పన్ను రాబడుల కింద వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, రూ.1.09 లక్షల కోట్ల వాస్తవిక రాబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆ ఏడాది పన్ను వసూళ్లలో ఏకంగా రూ.30 వేల కోట్ల పెరుగుదల చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకుని, సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదాయంలో మంచి వృద్ధి కనిపించింది.

ఆ తర్వాతి ఏడాది కూడా బడ్జెట్‌ ప్రతిపాదనలతో పోల్చితే స్వల్ప పెరుగుదలే నమోదయ్యింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రూ.1.31 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల్లో చూపెట్టారు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ పన్ను రాబడులు రూ.1.18 లక్షల కోట్లు వచ్చే అవకాశముందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్లు అదనంగా రూ.1.35 లక్షల కోట్ల పన్ను ఆదాయం సమకూరింది.  

శాఖల వారీగా ఇలా...! 
శాఖల వారీగా పరిశీలిస్తే.. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జీఎస్టీ రాబడులు రూ.5 వేల కోట్ల వరకు పెరిగాయి. 2022–23లో రూ.41,888 కోట్లు జీఎస్టీ కింద రాగా, 2023–24లో రూ.46,500 కోట్లు వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో అంతకుముందు ఏడాది రూ.14,228 కోట్లు రాగా, గత ఏడాదిలో రూ.14,295 కోట్లు వచ్చాయి. ఇక అమ్మకపు పన్ను ద్వారా 2022–23లో రూ.29,604 కోట్లు రాగా, గత ఏడాది కొంచెం ఎక్కువగా రూ.29,989 కోట్లు సమకూరాయి.

ఇక ఎక్సైజ్‌ ద్వారా అంతకు ముందు సంవత్సరం రూ.18740 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 20,298.89 కోట్లు వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2022–23లో రూ.13,394 కోట్లు రాగా, 2023–24లో రూ.16,536.65 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల రూపంలో అంతకుముందు ఏడాది రూ. 8,430 కోట్లు రాగా, ఈసారి రూ.7,918.74 కోట్లు మాత్రమే వచ్చాయి. 

గత ఐదు నెలల్లో 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పన్ను ఆదాయ రాబడులు పెరిగాయని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నెల నాటికి రూ. 80,853 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి నాలుగు నెలల్లో మరో రూ.46 వేల కోట్లు రాగా, మొత్తం ఆ ఏడాది పన్ను ఆదాయం రూ. 1.26 లక్షల కోట్లకు చేరింది. 2023–24లో నవంబర్‌ నెల నాటికి రూ.87,083 కోట్లుగా నమోదైన పన్ను ఆదాయం ఏడాది చివరి నాటికి (మార్చి 2024 ) రూ. 1.35 లక్షల కోట్లకు చేరింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి 4 నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం రూ. 48 వేల కోట్లన్నమాట. గత ఏడాది చివరి నాలుగు నెలలతో పోలిస్తే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో పన్ను ఆదాయం రూ.2వేల కోట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement