ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోకి అనుచిత లబ్ధి
టెలికం శాఖకు కాగ్ అక్షింతలు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు (ఆర్‌జియో) అనుచిత ప్రయోజనాలు కట్టబెట్టిందని టెలికం శాఖను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ఆర్‌జియోకి ఏకంగా రూ. 3,367 కోట్ల మేర లాభించేలా బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంపై వాయిస్ కాలింగ్ సేవలకు అనుమతించిందంటూ ఆక్షేపించింది. ఇందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను దక్కించుకున్న ఇన్ఫోటెల్‌ను రిలయన్స్ జియో కొనుగోలు చేసింది.
ఆ తర్వాత వాయిస్ కాలింగ్ సేవలు కల్పించేలా యూనివర్సల్ లెసైన్స్ (యూఎల్) కోసం ఎంట్రీ ఫీజు కింద రూ. 15 కోట్లు, అదనంగా మైగ్రేషన్ ఫీజు కింద రూ. 1,658 కోట్లు 2013 ఆగస్టులో కట్టింది. అయితే, ఈ ఫీజు 2011 నాటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయించినవని, 2013 నాటికి ఇది కనీసం రూ. 5,025.29 కోట్లుగా ఉండాల్సిందని కాగ్ లెక్కగట్టింది. టెలికం శాఖ మైగ్రేషన్ విధానం వల్ల ఆర్‌జియోకి రూ.3,367.29 కోట్ల మేర ప్రయోజనం లభించిందని పేర్కొంది. మరోవైపు, ఈ అంశాన్ని ఆర్‌జియో ఖండించింది. నిబంధనల మేరకే తాము ఫీజులు చెల్లించామని స్పష్టం చేసింది.
ఇక లాభనష్టాల గురించి సరైన అధ్యయనం చేయకుండానే 2005లో టెలికం శాఖ చెన్నై మెట్రో, తమిళనాడు టెలికం సర్కిల్స్‌ను విలీనం చేసిందని, ఈ తొందరపాటు నిర్ణయం వల్ల కొన్ని టెల్కోలు లాభపడ్డాయని కాగ్ పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 499 కోట్ల అనుచిత ప్రయోజనం చేకూరిందని వివరించింది.