Reliance Jio Infocomm
-
జియో ఇన్ఫోకామ్‌తో ఐఆర్ఎం ఇండియా ఒప్పందం
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఈఆర్ఎం) విధానాలను పటిష్టం చేసే దిశగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఆర్ఎం) ఇండియా అఫీలియేట్ వెల్లడించింది. ఈ ఒప్పందం కింద ఈఆర్ఎంపై అవగాహన పెంచేందుకు ఇరు సంస్థలు వెబినార్లు, రౌండ్టేబుల్స్, సమావేశాలు మొదలైనవి నిర్వహించనున్నాయి. 140 పైచిలుకు దేశాల్లో ఈఆర్ఎంకు సంబంధించిన నిపుణుల సమాఖ్యగా ఐఆర్ఎం వ్యవహరిస్తోంది. ఐఆర్ఎం ఇటీవలే సిప్లా, అల్ట్రాటెక్ తదితర సంస్థలతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది క్యూ1లో రూ. 4,335 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఏప్రిల్–జూన్(రూ. 3,501 కోట్లు)తో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 21 శాతంపైగా ఎగసి రూ. 21,873 కోట్లను తాకింది. టారిఫ్‌ల పెంపు మెరుగైన పనితీరుకు సహకరించింది. నికరంగా 9.7 మిలియన్ యూజర్లు జత కలిశారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 41.99 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) త్రైమాసికంగా 5 శాతం బలపడి రూ. 175.7కు చేరింది. అత్యంత వేగవంత సర్వీసులందించగల 5జీ స్పెక్ట్రమ్‌కు వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో జియో వెల్లడించిన ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. టెలికం, డిజిటల్ బిజినెస్‌లతో కూడిన జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 24% పుంజుకుని రూ. 4,530 కోట్లయ్యింది. ఆదాయం 24% వృద్ధితో రూ. 27,527 కోట్లకు చేరింది. -
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికం శాఖ జరిమానా విధించింది. వొడాఫోన్ ఐడియాకు రూ.2,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌కు రూ.1,050 కోట్ల పెనాల్టీ పడింది. జరిమానా చెల్లించేందుకు మూడు వారాల గడువు ఉంది. ఇంటర్ కనెక్టివిటీ సౌకర్యం కల్పించడంలో విఫలమైనందుకు రిలయన్స్ జియో ఫిర్యాదు ఆధారంగా ఇరు సంస్థలపై అయిదేళ్ల క్రితం ట్రాయ్ చేసిన సిఫార్సు మేరకు టెలికం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఏకపక్ష, అన్యాయమైన డిమాండ్‌తో మేము తీవ్రంగా నిరాశ చెందాము. ఈ ఆరోపణలు పనికిమాలినవి, ప్రేరేపించబడినవి. అత్యున్నత ప్రమాణాలను మేం పాటిస్తాం. చట్టాన్ని అనుసరిస్తాం. టెలికం శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం’ అని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. చదవండి: టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ -
రిలయన్స్ జియో మరో ఎత్తుగడ
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో ఎత్తుగడకు సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలోనూ తన హవా చాటాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను రూపొందిస్తుందట. ఈ యాప్‌తో డివైజ్ ద్వారానే వాహన కదలికలను కంట్రోల్ చేయొచ్చట. కేవలం కారు కంట్రోలింగ్ వ్యవస్థనే కాకుండా ఇంధనం, బ్యాటరీ అయిపోతున్నప్పుడు కారు యజమానికి అలర్ట్ వచ్చేలా కూడా ఈ యాప్ దోహదం చేయనుందట. ''రిలయన్స్ జియో కారు కనెక్టెడ్ డివైజ్ రూపొందించడానికి సిద్ధమైంది. ఈ యాప్‌తో వాహనం దొంగతనానికి గురైనప్పుడు కారు కదలికలను ఓనర్ ఇట్టే కనిపెట్టేయొచ్చు. కారులో వై-ఫై వాడుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి కారు ఓనర్ తన డివైజ్‌లో జియో సిమ్ వాడాల్సి ఉంటుంది'' అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. దీనికోసం ఆటోమొబైల్ కంపెనీలతో జియో నడుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ డిజిటల్ మిషన్ ఆటో మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీని ధర జియో మైఫై డివైజ్ ధర(రూ.2000) కంటే తక్కువగాను, సమానంగాను ఉండొచ్చని సమాచారం. కారు యాప్‌నే కాక, త్వరలోనే జియో టీవీలు వినియోగదారుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలుస్తోంది. -
మొబైల్ కంపెనీలన్నింటితో జియో భాగస్వామ్యం!
న్యూఢిల్లీ : ఇప్పుడా అప్పుడా అంటూ 4జీ సర్వీసుల కమర్షియల్ లాంచింగ్ తేదీతో ఇతర టెలికాం ఆపరేటర్ల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, స్మార్ట్ ఫోన్ల తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటూ మరింత షాకిలిస్తోంది. జియో సర్వీసుల కమర్షియల్ లాంచింగ్ నాటికి స్మార్ట్ ఫోన్ తయారీదారులందరితోనూ భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రయత్నాలు ప్రారంభించేసింది. హ్యాండ్ సెట్ కంపెనీల భాగస్వామ్యంతో యూజర్లలందరికీ మూడు నెలల ఉచిత డేటా, వాయిస్ సర్వీసులను రిలయన్స్ అందించాలనుకుంటోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రారాజుగా ఉన్న శాంసంగ్ తో ఈ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఇతర టెలికాం ఆపరేటర్లకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. రిలయన్స్ జియో పోటీని తట్టుకోవడానికి ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియాలు డేటా ప్యాక్ లపై భారీగా ఆఫర్లను ప్రకటించేశాయి. మరో రెండు రోజుల్లో వొడాఫోన్ సైతం తన కస్టమర్లకు డేటా ప్యాక్ లపై శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ కంపెనీ భాగస్వామ్యంతో ఇటు జియో సర్వీసుల కార్యకలాపాలు పెరగడంతో పాటు, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పెరుగుతాయని ప్లాన్ కు సంబంధించిన టాప్ ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. ఈ ప్లాన్ తో రిలయన్స్ కంపెనీ తన కస్టమర్ బేస్ ను పెంచుకోనుంది. రిలయెన్స్ తన కంపెనీ ఉద్యోగుల కోసం గతేడాదే జియో సేవలను ప్రారంభించింది. ఈ ఆగస్టులో కమర్షియల్ గా లాంచ్ అయ్యేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలు చేసినవారికి 4జీ జియో సిమ్ ను రిలయన్స్ ఆఫర్ గా అందిస్తోంది. లైఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు, ఉద్యోగులు, బిజినెస్ పార్టనర్లు మొత్తం కలిపి ఇప్పటికే కంపెనీకి 1.5 మిలియన్ పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ సేవలను లాంచ్ చేసిన రెండేళ్లలో 90శాతం జనాభాకు తన సేవలను అందించి, తన కవరేజ్ ను విస్తరించాలని రిలయన్స్ యోచిస్తోంది. ఇప్పటికే రిలయెన్స్ జియో 70శాతం తన సేవలను విస్తరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 30 మిలియన్ సబ్ స్క్రైబర్లను రిలయెన్స్ జియో చేరుకుంటుందని, 1బిలియన్ డాలర్ల రెవెన్యూను ఆర్జిస్తుందని మోర్గాన్ స్టాన్లి రిపోర్టు పేర్కొంటోంది. -
ఆర్ కామ్, ఆర్‌జియో స్పెక్ట్రం డీల్‌కు ఆమోదం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ సోదరుల సారథ్యంలోని రెండు టెలికం సంస్థల మధ్య 9 సర్కిళ్లలో స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందానికి టెలికం విభాగం (డాట్) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జియో), అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) 9 సర్కిళ్లలో స్పెక్ట్రంను పంచుకునేందుకు వీలవుతుంది. 7 సర్కిళ్లలో తమకున్న 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను, 2 సర్కిళ్లలో ఆర్‌జియో అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికం (ఆర్టీఎల్)కు ఉన్న స్పెక్ట్రంను పరస్పరం పంచుకోనున్నట్లు ఆర్‌కామ్ తెలిపింది. ఆర్‌కామ్, ఆర్‌జియో సంస్థలు 4జీ టెలికం సర్వీసులు అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడనుంది. అలాగే మరో 13 సర్కిళ్లలో కూడా ట్రేడింగ్ ద్వారా ఆర్‌కామ్ స్పెక్ట్రంను ఆర్‌జియో కొనుగోలు చేయడానికి తాజా అనుమతులు మార్గం సుగమం చేయనున్నాయి. మే 4 నుంచి ఆర్‌కామ్ 4జీ టెలికం సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది. ఐపీ ఆధారిత ఇంటర్‌కనెక్షన్‌కు డాట్ ఓకే.. 4జీ వంటి ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత సర్వీసులకు సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఇంటర్‌కనెక్షన్‌కు అనుమతినిస్తూ డాట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనల్లో సవరణ చేసింది. దీనితో టెలికం ఆపరేటర్లు ఐపీ ఆధారిత నెట్వర్క్ ఉన్న మరో టెలికం ఆపరేటరుకు ఇంటర్‌కనెక్షన్‌ను నిరాకరించడం కుదరదు. ఇప్పటిదాకా సర్క్యూట్ స్విచ్ విధాన నెట్‌వర్క్‌లకు మాత్రమే ఇంటర్కనెక్షన్ వెసులుబాటు ఉంది. తాజా పరిమాణంపై సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య (సీవోఏఐ) హర్షం వ్యక్తం చేసింది. -
రిలయన్స్ జియోకి ఇంటెక్స్ హ్యాండ్సెట్స్
న్యూఢిల్లీ: దేశీ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఇంటెక్స్.. కొత్తగా టెలికం కార్యకలాపాలు ప్రారంభించబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కి 4జీ హ్యాండ్‌సెట్స్‌ను సరఫరా చేయనుంది. దాదాపు 1 లక్ష ఫోన్లకు రిలయన్స్ జియో నుంచి ఆర్డరు వచ్చినట్లు ఇంటెక్స్ వెల్లడించింది. వీటిలో 20,000 హ్యాండ్‌సెట్స్‌ను త్వరలో డెలివరీ చేయనున్నట్లు వివరించింది. ఇంటెక్స్ బ్రాండింగ్‌తో ఉండే ఈ మొబైల్స్ ధర రూ. 10,000 లోపు ఉంటుందని, రిలయన్స్ రిటైల్ వీటిని విక్రయిస్తుందని సంస్థ పేర్కొంది. సుమారు రూ. 5,000 ఖరీదు చేసే 4జీ హ్యాండ్సెట్స్ మరిన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఇంటెక్స్ మొబైల్ బిజినెస్ విభాగం హెడ్ సంజయ్ కలిరోనా తెలిపారు. రిలయన్స్ జియో ఈ ఏడాది ఆఖరు నాటికి 4జీ సర్వీసులు ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. -
ఎయిర్టెల్, రిలయన్స్ జియోకి అనుచిత లబ్ధి
టెలికం శాఖకు కాగ్ అక్షింతలు న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు (ఆర్‌జియో) అనుచిత ప్రయోజనాలు కట్టబెట్టిందని టెలికం శాఖను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ఆర్‌జియోకి ఏకంగా రూ. 3,367 కోట్ల మేర లాభించేలా బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంపై వాయిస్ కాలింగ్ సేవలకు అనుమతించిందంటూ ఆక్షేపించింది. ఇందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను దక్కించుకున్న ఇన్ఫోటెల్ను రిలయన్స్ జియో కొనుగోలు చేసింది. ఆ తర్వాత వాయిస్ కాలింగ్ సేవలు కల్పించేలా యూనివర్సల్ లెసైన్స్ (యూఎల్) కోసం ఎంట్రీ ఫీజు కింద రూ. 15 కోట్లు, అదనంగా మైగ్రేషన్ ఫీజు కింద రూ. 1,658 కోట్లు 2013 ఆగస్టులో కట్టింది. అయితే, ఈ ఫీజు 2011 నాటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయించినవని, 2013 నాటికి ఇది కనీసం రూ. 5,025.29 కోట్లుగా ఉండాల్సిందని కాగ్ లెక్కగట్టింది. టెలికం శాఖ మైగ్రేషన్ విధానం వల్ల ఆర్‌జియోకి రూ.3,367.29 కోట్ల మేర ప్రయోజనం లభించిందని పేర్కొంది. మరోవైపు, ఈ అంశాన్ని ఆర్‌జియో ఖండించింది. నిబంధనల మేరకే తాము ఫీజులు చెల్లించామని స్పష్టం చేసింది. ఇక లాభనష్టాల గురించి సరైన అధ్యయనం చేయకుండానే 2005లో టెలికం శాఖ చెన్నై మెట్రో, తమిళనాడు టెలికం సర్కిల్స్‌ను విలీనం చేసిందని, ఈ తొందరపాటు నిర్ణయం వల్ల కొన్ని టెల్కోలు లాభపడ్డాయని కాగ్ పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 499 కోట్ల అనుచిత ప్రయోజనం చేకూరిందని వివరించింది. -
నల్లధనంపై పోరుకు కొత్త యంత్రాంగం
పారిస్/లండన్/బాసెల్: పన్ను ఎగవేతలు, విదేశాల్లో అక్రమంగా దాచుకుంటున్న నల్లధనంపై పోరాటానికి పటిష్టమైన యంత్రాంగం ఇక అమల్లోకి రానుంది. అంతర్జాతీయ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) ఈ సరికొత్త ప్రమాణాలను గురువారం ఆవిష్కరించింది. ఈ నెల 22-23 తేదీల్లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనున్న సమావేశంలో జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల ఆమోదముద్ర కోసం అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఓఈసీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ విధానాలను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలు పాటిస్తుండటం గమనార్హం. పన్నుల విషయంలో వివిధ దేశాలు సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ఇచ్చిపుచ్చుకునే యంత్రాంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలను రూపొందించాల్సిందిగా ఓఈసీడీని జీ20 కూటమి గతేడాది ఆహ్వానించింది. అంతర్జాతీయంగా మరింత పారదర్శక పన్ను విధానాల కోసం దీన్ని ప్రతిపాదించారు. కాగా, ఆటోమేటిక్ సమాచార మార్పిడి అంశంపై భారత్ రెండేళ్ల క్రితమే సంతకాలు చేసింది. ఇందులో తాజాగా అమలు చేయనున్న కొత్త ప్రమాణాలను కూడా భారత్‌తో సహా 42 దేశాలు అనుసరించనున్నాయి. బ్యాంకులు ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి సేకరించే సమాచారాన్ని వార్షిక ప్రాతిపదికన ఆటోమేటిక్‌గా సభ్యదేశాలన్నీ ఇచ్చిపుచ్చుకునేలా ఈ కొత్త ప్రమాణాలతో వీలవుతుందని ఓఈసీడీ వెల్లడించింది. ఎలాంటి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి... విబిన్నమైన బ్యాంకు ఖాతాలు, పన్ను చెల్లింపుదార్లకు సంబంధించి ఆర్థిక సంస్థలు నివేదించాల్సిన వివరాలతో పాటు అవి అనుసరించాల్సిన ఉమ్మడి పరిశీలన(డ్యూ డెలిజెన్స్) విధివిధానాలను ఈ కొత్త యంత్రాంగంలో పొందుపరిచినట్లు వివరించింది. ఇవి కొత్త ఒరవడి సృష్టించగలిగే(గేమ్ చేంజర్) విధానాలని ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా అభివర్ణించారు. కాగా, ఈ కొత్త ప్రమాణాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని, భారీ ఖర్చుతో కూడుకున్నవని స్విట్జర్లాండ్ బ్యాంకులు వ్యాఖ్యానించాయి. అయితే, పన్నుల ఎగవేతదార్లకు చెక్చెప్పేందుకు ఉద్దేశించిన ఈ యంత్రాంగాన్ని తాము ఆహ్వానిస్తున్నామని అక్కడి బ్యాంకింగ్ అసోసియేషన్(ఎస్బీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయులు నల్లధనాన్ని దాచుకోవడానికి స్విట్జర్లాండ్ సహా కొన్ని దేశాల బ్యాంకులు స్వర్గధామంగా మారాయంటూ దేశంలో రాజకీయంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నల్ల ధనం అంశాన్ని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా చేసుకోనున్నాయి కూడా. -
స్పెక్ట్రం రేసులో 8 కంపెనీలు
న్యూఢిల్లీ: వచ్చే నెల 3 నుంచి జరగబోయే 2జీ టెలికం స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు ఎనిమిది కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఉన్నాయి. వేలంపై పెద్ద కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్న దరిమిలా.. దీని ద్వారా రూ. 11,343 కోట్ల పైగా రాగలవనేది ప్రభుత్వం అంచనా. ఎనిమిది కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు, వేలం విజయవంతం కాగలదని ఆశిస్తున్నట్లు టెలికం విభాగం కార్యదర్శి ఎంఎఫ్ ఫారుఖీ తెలిపారు. టెలికం స్పెక్ట్రం వేలం ద్వారా రూ. 11,343 కోట్లు రాబట్టాలని బడ్జెట్లో నిర్దేశించుకోగా, దాన్ని అధిగమించగలమని భావిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తుల దాఖలుకు బుధవారం ఆఖరు రోజు కాగా, ఉపసంహరణకు జనవరి 27 ఆఖరు తేది. అన్నింటికన్నా ముందు వొడాఫోన్ ఆ తర్వాత ఎయిర్టెల్, ఎయిర్‌సెల్, టాటా టెలీ, ఐడియా సెల్యులార్, ఆర్జెఐఎల్, టెలీవింగ్స్(యూనినార్), ఆర్‌కామ్ దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లూప్, వీడియోకాన్ దరఖాస్తు చేసుకోలేదు. తమ లెసైన్సు వ్యవధిని పొడిగించాలంటూ టెలికం ట్రిబ్యునల్ టీడీశాట్‌ని కోరినట్లు, సానుకూల నిర్ణయం రాగలదని ఆశిస్తున్నట్లు లూప్ మొబైల్ ఎండీ సందీప్ బసు తెలిపారు. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా దరఖాస్తు చేయలేదు. బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రం ఉన్న ఆర్జేఐఎల్ మాత్రం తాజాగా జీఎస్ఎం స్పెక్ట్రం కోసం కూడా పోటీపడుతోంది. కనీస రేటు తగ్గింపు..: కనీస రేటు అధికంగా ఉందన్న కారణంతో గతేడాది మార్చిలో నిర్వహించిన వేలంలో జీఎస్ఎం ఆపరేటర్లు పాల్గొనలేదు. దీంతో కేంద్రం ఈసారి రేటును సవరించింది. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ రేటును మెగాహెర్ట్జ్కి రూ.1,765 కోట్లుగా నిర్ణయించింది. ఇది మార్చి రేటు కన్నా 26% తక్కువ. అలాగే, 900 మెగాహెట్జ్ ధరను 53% తక్కువగా నిర్ణయించారు. దీని ప్రకారం ఢిల్లీలో మెగాహెర్ట్జ్ కనీస ధర రూ. 360 కోట్లు, ముంబైలో రూ. 328 కోట్లు, కోల్‌కతాలో రూ. 125 కోట్లుగా ఉండనుంది. ప్రస్తుతం 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 403 మెగాహెట్జ్ మేర, 900 మెగాహెట్జ్‌లో 45 మెగాహెట్జ్ పరిమాణాన్ని ప్రభుత్వం వేలం వేయనుంది. 2జీ స్కామ్‌లో 122 లెసైన్సులు రద్దయిన దరిమిలా అందుబాటులోకి వచ్చిన స్పెక్ట్రం (1800 మెగాహెట్జ్ బ్యాండ్) అంతటినీ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వేలం వేస్తోంది. మరోవైపు నవంబర్‌లో ఎయిర్టెల్, వొడాఫోన్, లూప్ సంస్థల లెసైన్సుల గడువు ముగియపోనుండటంతో వీటికి సంబంధించి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సర్కిళ్లలో 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను కూడా వేలం వేస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్లకు ఈ బ్యాండ్ స్పెక్ట్రం చాలా కీలకం. -
12 రెట్ల అధిక స్పీడ్‌తో రిలయన్స్ జియో 4జీ సేవలు!
న్యూఢిల్లీ: త్వరలో 4జీ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. భారీ ప్రణాళికల్లో ఉంది. ప్రస్తుత 3జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 10-12 రెట్ల అధిక స్పీడ్‌తో డేటా ప్రసారాన్ని అందించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో... దేశవ్యాప్త వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా తాము సెకనుకు 49 మెగాబైట్ల(ఎంబీపీఎస్) డౌన్లోడ్ స్పీడ్‌ను, 8-9 ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడ్‌ను అందుకున్నామని రిలయన్స్ జియో అధికారి చెప్పారు. ఇదే వ్యవస్థతో గరిష్టంగా 112 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్నికూడా చేరొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 3జీ నెట్‌వర్క్‌లో సగటు గరిష్ట స్పీడ్ 4 ఎంబీపీఎస్‌గా అంచనా. -
ఎయిర్టెల్, రిలయన్స్ జియో జట్టు
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లు జట్టుకట్టాయి. మౌలికసదుపాయాలను పంచుకోవడం కోసం ఒక సమగ్ర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మంగళవారం ఇరు కంపెనీలు ప్రకటించాయి. టెలికం రంగంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సన్నద్ధం చేసుకుంటున్న రిలయన్స్ జియో ఇప్పటికే దేశవ్యాప్త వైర్లెస్ బ్రాండ్ బ్యాండ్(4జీ) స్పెక్ట్రం లెసైన్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా వాయిస్ కాల్ సేవలను అందించేందుకు సైతం ఏకీకృత టెలికం లెసైన్స్‌ను ఈ కంపెనీ సొంతం చేసుకుంది. తాజా ఒప్పందం వల్ల ఇరు కంపెనీలకు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణలో వ్యయాలు తగ్గించుకునేందుకుం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. ఇంటర్, ఇంట్రా సిటీ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్, సబ్‌మెరైన్ కేబుల్ నెట్వర్క్, టెలికం టవర్లు, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పంచుకునేందుకు తమ భాగస్వామ్యం వీలుకల్పిస్తుందని సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. భవిష్యత్తులో ఇతరత్రా షేరింగ్ అవకాశాలను అన్వేషించేందుకు సైతం దీనివల్ల వీలవుతుందని తెలిపాయి. పంజాబ్‌లో 4జీ సేవల కోసం టెలికం నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు భారతీ ఎయిర్‌టెల్‌తో చేతులుకలిపేందుకు సిద్ధంగా రిలయన్స్ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ తాజాగా పేర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.