ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో జట్టు
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లు జట్టుకట్టాయి. మౌలికసదుపాయాలను పంచుకోవడం కోసం ఒక సమగ్ర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మంగళవారం ఇరు కంపెనీలు ప్రకటించాయి.
టెలికం రంగంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సన్నద్ధం చేసుకుంటున్న రిలయన్స్ జియో ఇప్పటికే దేశవ్యాప్త వైర్‌లెస్ బ్రాండ్ బ్యాండ్(4జీ) స్పెక్ట్రం లెసైన్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా వాయిస్ కాల్ సేవలను అందించేందుకు సైతం ఏకీకృత టెలికం లెసైన్స్‌ను ఈ కంపెనీ సొంతం చేసుకుంది. తాజా ఒప్పందం వల్ల ఇరు కంపెనీలకు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణలో వ్యయాలు తగ్గించుకునేందుకుం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. ఇంటర్, ఇంట్రా సిటీ ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్, సబ్‌మెరైన్ కేబుల్ నెట్‌వర్క్, టెలికం టవర్లు, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పంచుకునేందుకు తమ భాగస్వామ్యం వీలుకల్పిస్తుందని సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. భవిష్యత్తులో ఇతరత్రా షేరింగ్ అవకాశాలను అన్వేషించేందుకు సైతం దీనివల్ల వీలవుతుందని తెలిపాయి.
పంజాబ్‌లో 4జీ సేవల కోసం టెలికం నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు భారతీ ఎయిర్‌టెల్‌తో చేతులుకలిపేందుకు సిద్ధంగా రిలయన్స్ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ తాజాగా పేర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.