రిలయన్స్ జియో మరో ఎత్తుగడ
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో ఎత్తుగడకు సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలోనూ తన హవా చాటాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ను రూపొందిస్తుందట. ఈ యాప్తో డివైజ్ ద్వారానే వాహన కదలికలను కంట్రోల్ చేయొచ్చట. కేవలం కారు కంట్రోలింగ్ వ్యవస్థనే కాకుండా ఇంధనం, బ్యాటరీ అయిపోతున్నప్పుడు కారు యజమానికి అలర్ట్ వచ్చేలా కూడా ఈ యాప్ దోహదం చేయనుందట.
''రిలయన్స్ జియో కారు కనెక్టెడ్ డివైజ్ రూపొందించడానికి సిద్ధమైంది. ఈ యాప్తో వాహనం దొంగతనానికి గురైనప్పుడు కారు కదలికలను ఓనర్ ఇట్టే కనిపెట్టేయొచ్చు. కారులో వై-ఫై వాడుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి కారు ఓనర్ తన డివైజ్లో జియో సిమ్ వాడాల్సి ఉంటుంది'' అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. దీనికోసం ఆటోమొబైల్ కంపెనీలతో జియో నడుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ డిజిటల్ మిషన్ ఆటో మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీని ధర జియో మైఫై డివైజ్ ధర(రూ.2000) కంటే తక్కువగాను, సమానంగాను ఉండొచ్చని సమాచారం. కారు యాప్నే కాక, త్వరలోనే జియో టీవీలు వినియోగదారుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలుస్తోంది.