స్పెక్ట్రం రేసులో 8 కంపెనీలు
న్యూఢిల్లీ: వచ్చే నెల 3 నుంచి జరగబోయే 2జీ టెలికం స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు ఎనిమిది కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఉన్నాయి. వేలంపై పెద్ద కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్న దరిమిలా.. దీని ద్వారా రూ. 11,343 కోట్ల పైగా రాగలవనేది ప్రభుత్వం అంచనా. ఎనిమిది కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు, వేలం విజయవంతం కాగలదని ఆశిస్తున్నట్లు టెలికం విభాగం కార్యదర్శి ఎంఎఫ్ ఫారుఖీ తెలిపారు. టెలికం స్పెక్ట్రం వేలం ద్వారా రూ. 11,343 కోట్లు రాబట్టాలని బడ్జెట్‌లో నిర్దేశించుకోగా, దాన్ని అధిగమించగలమని భావిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తుల దాఖలుకు బుధవారం ఆఖరు రోజు కాగా, ఉపసంహరణకు జనవరి 27 ఆఖరు తేది.
అన్నింటికన్నా ముందు వొడాఫోన్ ఆ తర్వాత ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, టాటా టెలీ, ఐడియా సెల్యులార్, ఆర్‌జెఐఎల్, టెలీవింగ్స్(యూనినార్), ఆర్‌కామ్ దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లూప్, వీడియోకాన్ దరఖాస్తు చేసుకోలేదు. తమ లెసైన్సు వ్యవధిని పొడిగించాలంటూ టెలికం ట్రిబ్యునల్ టీడీశాట్‌ని కోరినట్లు, సానుకూల నిర్ణయం రాగలదని ఆశిస్తున్నట్లు లూప్ మొబైల్ ఎండీ సందీప్ బసు తెలిపారు. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ కూడా దరఖాస్తు చేయలేదు. బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రం ఉన్న ఆర్‌జేఐఎల్ మాత్రం తాజాగా జీఎస్‌ఎం స్పెక్ట్రం కోసం కూడా పోటీపడుతోంది.
కనీస రేటు తగ్గింపు..: కనీస రేటు అధికంగా ఉందన్న కారణంతో గతేడాది మార్చిలో నిర్వహించిన వేలంలో జీఎస్‌ఎం ఆపరేటర్లు పాల్గొనలేదు. దీంతో కేంద్రం ఈసారి రేటును సవరించింది. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ రేటును మెగాహెర్ట్జ్‌కి రూ.1,765 కోట్లుగా నిర్ణయించింది. ఇది మార్చి రేటు కన్నా 26% తక్కువ. అలాగే, 900 మెగాహెట్జ్ ధరను 53% తక్కువగా నిర్ణయించారు. దీని ప్రకారం ఢిల్లీలో మెగాహెర్ట్జ్ కనీస ధర రూ. 360 కోట్లు, ముంబైలో రూ. 328 కోట్లు, కోల్‌కతాలో రూ. 125 కోట్లుగా ఉండనుంది. ప్రస్తుతం 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 403 మెగాహెట్జ్ మేర, 900 మెగాహెట్జ్‌లో 45 మెగాహెట్జ్ పరిమాణాన్ని ప్రభుత్వం వేలం వేయనుంది. 2జీ స్కామ్‌లో 122 లెసైన్సులు రద్దయిన దరిమిలా అందుబాటులోకి వచ్చిన స్పెక్ట్రం (1800 మెగాహెట్జ్ బ్యాండ్) అంతటినీ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వేలం వేస్తోంది. మరోవైపు నవంబర్‌లో ఎయిర్‌టెల్, వొడాఫోన్, లూప్ సంస్థల లెసైన్సుల గడువు ముగియపోనుండటంతో వీటికి సంబంధించి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సర్కిళ్లలో 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను కూడా వేలం వేస్తోంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు ఈ బ్యాండ్ స్పెక్ట్రం చాలా కీలకం.