ఆర్ కామ్, ఆర్జియో స్పెక్ట్రం డీల్కు ఆమోదం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ సోదరుల సారథ్యంలోని రెండు టెలికం సంస్థల మధ్య 9 సర్కిళ్లలో స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందానికి టెలికం విభాగం (డాట్) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జియో), అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) 9 సర్కిళ్లలో స్పెక్ట్రంను పంచుకునేందుకు వీలవుతుంది. 7 సర్కిళ్లలో తమకున్న 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను, 2 సర్కిళ్లలో ఆర్‌జియో అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికం (ఆర్‌టీఎల్)కు ఉన్న స్పెక్ట్రంను పరస్పరం పంచుకోనున్నట్లు ఆర్‌కామ్ తెలిపింది.
ఆర్‌కామ్, ఆర్‌జియో సంస్థలు 4జీ టెలికం సర్వీసులు అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడనుంది. అలాగే మరో 13 సర్కిళ్లలో కూడా ట్రేడింగ్ ద్వారా ఆర్‌కామ్ స్పెక్ట్రంను ఆర్‌జియో కొనుగోలు చేయడానికి తాజా అనుమతులు మార్గం సుగమం చేయనున్నాయి. మే 4 నుంచి ఆర్‌కామ్ 4జీ టెలికం సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది.
ఐపీ ఆధారిత ఇంటర్‌కనెక్షన్‌కు డాట్ ఓకే..
4జీ వంటి ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత సర్వీసులకు సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఇంటర్‌కనెక్షన్‌కు అనుమతినిస్తూ డాట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనల్లో సవరణ చేసింది. దీనితో టెలికం ఆపరేటర్లు ఐపీ ఆధారిత నెట్‌వర్క్ ఉన్న మరో టెలికం ఆపరేటరుకు ఇంటర్‌కనెక్షన్‌ను నిరాకరించడం కుదరదు. ఇప్పటిదాకా సర్క్యూట్ స్విచ్ విధాన నెట్‌వర్క్‌లకు మాత్రమే ఇంటర్‌కనెక్షన్ వెసులుబాటు ఉంది. తాజా పరిమాణంపై సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య (సీవోఏఐ) హర్షం వ్యక్తం చేసింది.