అమరావతి.. ఓ ఆర్థిక అగాధమే | CAG report: Building Amaravati immense financial burden on state exchequer | Sakshi
Sakshi News home page

అమరావతి.. ఓ ఆర్థిక అగాధమే

Published Tue, Sep 26 2023 3:25 AM | Last Updated on Tue, Sep 26 2023 4:29 PM

CAG report: Building Amaravati immense financial burden on state exchequer - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం గత సర్కారు గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని పేరుతో నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ప్రభుత్వ భూములు విస్తారంగా అందుబాటులో ఉండే ప్రదే­శా­లను వదిలేసి బయటి వ్యక్తుల నుంచి చాలా ఎక్కు­వ భూమిని పూలింగ్‌తో సేకరించడమేనని స్పష్టం చేసింది. ఈమేరకు కాగ్‌ సమర్పించిన తనిఖీ నివేది­కను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమ­ర్పించింది. ఇందులో ప్రధానంగా అమరావతి విష­యంలో టీడీపీ సర్కారు అనుసరించిన విధానా­ల­ను, భూ సమీకరణను కాగ్‌ తీవ్రంగా తప్పుబట్టింది. 

అంతా అసమగ్రం 
రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు సార్లు ఆడిట్‌ నిర్వహించినట్లు కాగ్‌ నివేది­కలో వెల్లడించింది. గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానిగా అమరా­వతి ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకున్న కీలక పరిమితులు, రాజధాని నగర అభివృద్ధికి భూమి వాస్తవ అవసరాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన సాధ్యాసాధ్యాల అధ్యయన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదని కాగ్‌ తప్పుబట్టింది. రాజధాని నగర అభివృద్ధికి సంబంధించిన మొత్తం ప్రాజెక్టు ప్రణాళిక వివరాల్లో సమ­గ్రత లేదని పేర్కొంది.

అమరావతిలో ఏకరీతిలో భూ కేటాయింపుల విధానాన్ని అమలు చేయలేదని, వివిధ ప్రైవేట్‌ సంస్థలకు ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని కాగ్‌ నివేదిక ఎండగట్టింది. చేపట్టిన పనులన్నీ 2017 నవంబర్‌ నుంచి 2019 ఫిబ్రవరి వరకు ప్రారంభించలేదని, దీంతో ఎల్‌పీఎస్‌ (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాలేదని కాగ్‌ పేర్కొంది. రహదారి పనులతో కూడిన ప్రాధాన్యత కలిగిన మౌలిక సదుపాయాలను సరైన అంచనా, ప్రాథమిక సర్వే లేకుండా చేపట్టడంతో పనుల పురోగతి దెబ్బ తిందని కాగ్‌ తెలిపింది. అమరావతి రాజధాని అభివృద్ధిలో నిపుణుల కమిటీ సిఫార్సులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని తప్పుబట్టింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు కన్సల్టెంట్లపై తగిన విధానాన్ని అనుసరించకుండా నామి­నేషన్‌ పద్ధతిలో ఎంపిక చేశారని కాగ్‌ పేర్కొంది. 

ప్రణాళిక లోపం.. వ్యయంపై ప్రభావం 
స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఏపీ సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌లు రూ.33,476.23 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్యాకేజీల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాగ్‌ నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నగర అభివృద్ధిపై విధానపరమైన మార్పు ఫలితంగా 2019 మే నుంచి కాల పరిమితి లేని ఒప్పందాల ప్యాకేజీలు అనిశ్చితిగా ఉన్నాయని తెలిపింది. గత సర్కారు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జలవనరుల పరిధిలో అనధికారికంగా గ్రీవెన్స్‌ సెల్‌ భవన నిర్మాణానికి ఏపీ సీఆర్‌డీఏ అను­మతి ఇవ్వడాన్ని కాగ్‌ తప్పుబట్టింది.

రాజధాని నగ­రానికి భూమి వాస్తవ అవసరాలను అంచనా వేసేందుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం రికార్డు­లను సీఆర్‌­డీఏ అందించలేదని కాగ్‌ పేర్కొంది. పర్య­వసానంగా ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేనం­దున ఎల్‌పీఎస్‌ ద్వారా సేకరించిన భూమి అవసరం హేతుబద్ధతను నిర్ధారించలేకపోయినట్లు కాగ్‌ వెల్లడించింది. దశలవారీ ప్రణాళిక లేకపోవడంతో ప్రాజెక్టుల వ్యయంపై ప్రభావం పడిందని, కార్యా­చరణ ప్రణాళికను సూచించడానికి సలహా కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కమిటీ సిఫార్సులను ఆడిట్‌కు అందుబాటులో ఉంచలేదని కాగ్‌ తెలిపింది. 

కేంద్రం వివరణ కోరినా..
టీడీపీ సర్కారు నిర్దిష్ట విధివిధానాలను అనుసరించకుండా కన్సల్టెన్సీ సంస్థలు, కన్సల్టెంట్లను ఎంపిక చేసినట్లు కాగ్‌ నివేదిక పేర్కొంది. రాజధాని నగర ప్రణాళిక ప్రక్రియలో ఏపీ సీఆర్‌డీఏ టెండరింగ్, కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ విధివిధానాలను అనుసరించకుండా మూడు కన్సల్టెన్సీ సంస్ధలకు రూ.28.96 కోట్ల ఒప్పంద విలువతో నామినేషన్‌ ప్రాతిపదికన ఇచ్చినట్లు కాగ్‌ తెలిపింది. రాజధాని నగరానికి సంబంధించి రూ.1,09,023 కోట్ల అంచనాతో డీపీ­ఆర్‌లు రూపొందించినప్పటికీ వీటిలో రూ.46,400 కోట్ల మేర డీపీఆర్‌లను నీతి ఆయోగ్‌కు సమర్పించలేదని వెలుగులోకి తెచ్చింది. డీపీఆర్‌లు లోపభూయిష్టంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ కోరినా గత సర్కారు సమర్పించలేదని కాగ్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement