వృద్ధిలో మనమే నంబర్‌వన్
ఆదాయ వృద్ధిలో దేశంలో తెలంగాణే టాప్
► రాష్ట్ర ఆదాయ వృద్ధి 17.81 శాతం: కాగ్
► రెండో స్థానంలో బెంగాల్, ఏపీకి 7వ స్థానం
సాక్షి, హైదరాబాద్: ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ మరోసారి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ 17.81% ఆదా య వృద్ధిని నమోదు చేసింది. 17.16% వృద్ధితో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం కేసీఆర్ ఇటీవల పలుమార్లు ప్రకటించడం తెలిసిందే. ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది.
కాగ్ లెక్కల ప్రకారం పన్నుల ఆదాయంలో దేశంలో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. ఏపీ ఏడో స్థానంలో ఉంది. ప్రధానంగా వ్యాట్, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం 17.82% పెరిగింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయమూ కలిపితే 17.81% వృద్ధి నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 2016 ఫిబ్రవరి వరకు రూ.33,257 కోట్ల ఆదాయం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.39,183 కోట్ల ఆదాయం సమకూరింది.
ప్రధాన పన్నులతో కలిపి రవాణా రంగం, నాలా, అటవీ, వృత్తి పన్ను తదితరాలనూ కలుపుకుంటే 2015–16లో రూ.36,130 కోట్ల ఆదాయం రాగా 2016–17లో రూ.42,564 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు విభాగాల్లోనూ దేశంలోని తెలంగాణ తొలి స్థానంలో ఉంది. పన్ను ఆదాయంలో జార్ఖండ్ రెండో స్థానం (16.86%), ఛత్తీస్‌గఢ్ మూడో స్థానం (11.41%)లో ఉన్నాయి. రాష్ట్ర సొంత పన్ను ఆదాయాన్నీ కలిపితే పశ్చిమబెంగాల్ రెండో స్థానం (17.16%), జార్ఖండ్ మూడో స్థానం (16.42%)లో ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఏపీ ఏడో స్థానంలో ఉంది.
తెలంగాణ సత్తా రుజువైంది: సీఎం
పన్ను ఆదాయం, రాష్ట్ర సొంత పన్ను ఆదాయం విభాగాలు రెండింట్లోనూ తెలంగాణ 17 శాతానికి పైగా వృద్ధి సాధించటం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వెలిబుచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని ఉద్యమ సమయంలోనే తాను వాదించానని ఆయన గుర్తు చేశారు. ఈ మూడేళ్ల సమయంలో అది పలుమార్లు రుజువైందన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి పన్నుల ఆదాయం తగ్గకపోగా పెరుగుదల సాధించడం గొప్ప విశేషమని అభిప్రాయపడ్డారు. ఈ విజయంలో పాలుపంచుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు. ఆదాయ వృద్ధిలో ఆశించిన పెరుగుదల నమోదవడంతో రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళతామని ప్రకటించారు.
ఆశించిన ఫలితం
ఇటీవలి గణాంకాల ప్రకారం తెలంగాణ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.1 శాతంగా నమోదైంది. సగటున 4 శాతం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా ఆదాయ వృద్ధి కనీసం 15 శాతానికి చేరడం ఖాయమని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ముందునుంచీ ధీమాతో ఉన్నారు. ఆ మేరకే ఈసారి భారీ బడ్జెట్‌ను రూపొందించారు. అన్ని రంగాల్లో వృద్ధితో పాటు ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, పన్ను వసూలు విధానాలను పటిష్టం చేయడం, అధికారులు సమర్థంగా వ్యవహరించడం ఈ వృద్ధికి కారణమని ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది.