పన్ను ఎగవేసిన 70 మంది బిల్డర్లు
ప్రభుత్వ శాఖల పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుబట్టింది. సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఖాజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. వివిధ శాఖలు అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని తలంటుపోసింది. అధికారుల హస్తలాఘవం, నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోందని చీవాట్లు పెట్టింది. పౌర సరఫరాలు, విద్యుత్, పింఛన్లు, పారిశుద్ధ్యం, ఆర్టీసీ, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ వంటి అన్ని విషయాల్లోనూ ఇదే తంతుగా ఉందని లోపాలను ఎత్తిచూపింది. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని పేర్కొంది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్మించిన భవనాలకు సంబంధించి 2013 మార్చి నుంచి మే మధ్యలో 70 మంది బిల్డర్లు వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూ. 30.78 కోట్ల మేర ఎగవేసినట్లు కాగ్ తేల్చింది. బిల్డర్లు తాము నిర్మించే కట్టడాల వల్ల పొందిన ప్రతిఫలంలో 25 శాతం మీదగాని, స్టాంపు డ్యూటీ చెల్లింపునకు నిర్ణయించిన మార్కెట్ విలువలో గానీ 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎస్‌ఆర్ నగర్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసిన 70 మంది బిల్డర్లను ఇంటర్నెట్ ద్వారా గుర్తించిన కాగ్ తనిఖీలు చేయగా భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ 70 మంది బిల్డర్లు తక్కువ స్టాంపు డ్యూటీతో ఏడు రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్టర్ చేసి ఆ విలువ ఆధారంగా వ్యాట్ చెల్లింపులు జరిపినట్లు గుర్తించింది. ఈ క్రమంలో రూ. 30.78 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు గుర్తించి వాణిజ్య పన్నుల శాఖకు, ప్రభుత్వానికి 2013 ఆగస్టులోనే తెలియజేసినట్లు కాగ్ స్పష్టం చేసింది.
కాగ్ పరిశీలనలో తేలిన అంశాలు
- వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వే బిల్లులను పరిశీలించడం లేదు, అడ్వాన్స్ వే బిల్లులు పంపడం లేదు
- వ్యాట్ డీలర్లు సమర్పించిన టర్నోవర్ వివరాలకు, చెక్‌పోస్టుల వద్ద ఉన్న జీఐఎస్ సమాచారంతో సరిపోలిస్తే 2012 నవంబర్ నుంచి 2013 మే మధ్య వేల కోట్ల రూపాయల తేడా ఉన్నట్లు తేలింది.
- తప్పుడు డిక్లరేషన్లపై పన్ను తక్కువ విధింపు, జరిమానాలు విధించకపోవడం
- అంతర్రాష్ట్ర కొనుగోళ్లలో సీ ఫారాల దుర్వినియోగంపై జరిమానాలు విధించకపోవడం
- చెల్లని సీ-ఫారాలను అనుమతించడం ద్వారా పన్ను రాయితీ ఇవ్వడం
ఆర్టీసీకి టోల్ నష్టం
క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండానే ఆర్టీసీ డీపీఆర్ తయారు చేసిందని, కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లు రాకముందే రుణంగా తెచ్చిన నిధులతో బస్‌స్టాండ్‌లు, టెర్మినల్స్ నిర్మించడంతో నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సిన యూజర్ ఫీజును టోల్‌టాక్స్‌కు అనుగుణంగా సవరించకపోవటంతో 2010 ఏప్రిల్ నుంచి 2013 మే వరకు రూ. 50.69 కోట్లను ఆర్టీసీ నష్టపోయిందని తెలిపింది. 2012 నుంచి జిల్లాల్లో రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాల మీద టోల్ చార్జీలపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఆర్టీసీ తమ బస్సులన్నింటినీ హైదరాబాద్‌లో రిజిస్టర్ చేయించటంతో ఈ రాయితీని కోల్పోయినట్లయింది. 2011లో పూర్తయిన కోఠి బస్సు టెర్మినల్స్‌లో వాణిజ్య సముదాయాన్ని లీజుకు ఇవ్వటం ఆలస్యం కావటంతో ఆర్టీసీ రూ. 29.02 కోట్లను కోల్పోయింది.
వాహనాల పన్ను హుష్‌కాకి
ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మోటారు వాహనాల పన్ను వసూళ్లలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నట్లు కాగ్ తేల్చింది. 2012 ఏప్రిల్-2013 మార్చి మధ్య రవాణాశాఖ కార్యాలయాల్లో పలు రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఇది వెల్లడైందని తెలిపింది. ‘‘వీటి పరిధిలో 6,447 మంది వాహనదారులు రూ. 10.32 కోట్ల త్రైమాసిక పన్ను ఎగ్గొట్టినట్టు తేలింది. కనీసం వారికి నోటీసులు కూడా పంపలేదు. జరిమానాగా వసూలు చేయాల్సిన రూ. 20.65 కోట్లనూ పట్టించుకోలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బకాయిలు రూ. 36.76 కోట్ల వరకు ఉన్నట్టు తేలింది’’ అని వెల్లడించింది.
వ్యాట్ నష్టం 30 కోట్లు
Published Sat, Nov 29 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement