ఎల్పీజీ సబ్సిడీపై కేంద్రం ప్రకటనను తప్పుబట్టిన కాగ్
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్) విధానాన్ని అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ. 1,764 కోట్లేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) స్పష్టం చేసింది. డీబీటీఎల్ అమలుతో ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని, వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో పేర్కొంది. 2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ. 35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది.
తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ వల్ల జరిగిన మిగులుగా ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టింది. తగ్గిన మొత్తంలో కేవలం రూ.1,764 కోట్లే(15 శాతం) డీబీటీఎల్ వల్ల మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనంగా వచ్చిందేనని పేర్కొంది. ఇక సబ్సిడీ మొత్తం, 67.27 లక్షల మంది వినియోగదారులు సబ్సిడీని వదులుకోవడం వల్ల మిగిలిన మొత్తానికి సంబంధించి చమురు సంస్థలు, పెట్రోలియం శాఖల లెక్కలకు పొంతన లేదని పేర్కొంది.
తప్పుడు విధానంలో ‘ఏఆర్‌సీఐ’
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లో స్వతంత్ర ప్రతిపత్తి గల ‘ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ(ఏఆర్‌సీఐ)’ని ఏర్పాటు చేసిందని కాగ్ పేర్కొంది. కేబినెట్ ఆమోదం లేకుండా ఇలాంటి సంస్థ ఏర్పాటు.. జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధమని, ఇప్పటికైనా ఆ అనుమతి తీసుకోవాలని సూచించింది.
ప్రత్యక్ష నగదు బదిలీతో ప్రయోజనం తక్కువే!
Published Sat, Aug 13 2016 3:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
Advertisement