రూ. 3 లక్షల కోట్లు!
అంచనాలు మించుతున్న బొగ్గు, స్పెక్ట్రం వేలం ఆదాయం
- 32 బొగ్గు బ్లాకులతో రూ. 2 లక్షల కోట్లు
- స్పెక్ట్రం వేలంతో మరో రూ. 1 లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ఒకవైపు బొగ్గు బ్లాకులు వేలం, మరోవైపు టెలికం స్పెక్ట్రం వేలం అంచనాలను మించే స్థాయిలో సాగుతున్నాయి. వీటితో ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఏకంగా రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు మొత్తం సమకూరినట్లయింది. బొగ్గు, స్పెక్ట్రం కుంభకోణాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలో వేసిన లెక్కలకు మించి ఇది ఉండటం గమనార్హం.
ఈ రెండింటి వేలం ఇంకా కొనసాగుతోంది. టెలికం స్పెక్ట్రం వేలానికి సంబంధించి బిడ్లు సోమవారం నాటికి రూ. 94,000 కోట్లకు చేరుకున్నాయి. అటు రెండో విడత బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి అయిదో రోజున మరో రెండు బ్లాకులు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 11,000 కోట్లు రానున్నాయి. దీంతో బొగ్గు బ్లాకుల వేలం ద్వారా రాయల్టీలు, చెల్లింపులు మొదలైన వాటి రూపంలో రూ. 2.07 లక్షల కోట్లు వచ్చినట్లవుతుంది. యూపీఏ హయాంలో బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల ప్రభుత్వానికి రూ. 1.86 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలో అంచనా వేసిన దానికంటే తాజా వేలంలో ఖజానాకు మరింత అధికంగా ఆదాయం రానుండటం గమనార్హం.
కుంభకోణానికి కేంద్ర బిందువులైన 204 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు కొన్నాళ్ల క్రితం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేవలం 32 బ్లాకులను విక్రయిస్తేనే ఏకంగా రూ. 2.07 లక్షల కోట్లు వ స్తున్నాయని బొగ్గు శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. దీని వల్ల విద్యుత్ చార్జీలు తగ్గడంతో పాటు ఒడిషా తదితర రాష్ట్రాలకు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం రాగలదన్నారు. ఇక స్పెక్ట్రం వేలానికి సంబంధించి సోమవారం నాడు ఏడు రౌండ్లు జరిగాయి. దీంతో మొత్తం 31 రౌండ్లు పూర్తయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రం వేలానికి ఇప్పటిదాకా బిడ్డింగ్ రాలేదు.