telecom spectrum auction
-
స్పెక్ట్రం వేలం షురూ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే టెలికం స్పెక్ట్రం వేలం సోమవారం ప్రారంభమైంది. తొలి రోజున రూ. 77,146 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయని టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బిడ్డింగ్‌కు స్పందన ప్రభుత్వం ఊహించిన దానికంటే మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం బ్యాండ్స్ అయిన 700, 2500 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసం ఏ కంపెనీ బిడ్ చేయలేదని చెప్పారు. మంగళవారం కూడా వేలం కొనసాగించి, ముగించనున్నామని వివరించారు. ‘సోమవారం సాయంత్రం 6 గం.ల దాకా రూ. 77,146 కోట్ల బిడ్లు వచ్చాయి. కేవలం మూడు సంస్థలే పోటీపడుతున్నాయి.. అది కూడా గత స్పెక్ట్రంనే రెన్యూ చేసుకోనున్నాయి కాబట్టి బిడ్లు మహా అయితే రూ. 45,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మేం అంచనా వేశాం. అయితే దానికి మించి బిడ్లు వచ్చాయి’ అని ప్రసాద్ తెలిపారు. బిడ్డర్ల వారీగా వివరాలు వెల్లడి కానప్పటికీ దాదాపు 849.20 మెగాహెట్జ్ పరిమాణానికి బిడ్లు వచ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొదటి రోజున నాలుగు రౌండ్లు జరిగాయి. 700 మెగాహెట్జ్‌కు దూరం.. ‘మొత్తం వేలానికి ఉంచిన స్పెక్ట్రం విలువ దాదాపు రూ. 4 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 700 మెగాహెట్జ్ బ్యాండ్.. అత్యంత ఖరీదైనది. దీని విలువే ఏకంగా రూ. 1.97 లక్షల కోట్లు ఉంటుంది’ అని ప్రసాద్ తెలిపారు. 5జీ సేవలకు ఉపయోగపడే 700 మెగాహెట్జ్ బ్యాండ్‌కు 2016లో నిర్వహించిన వేలంలో కూడా స్పందన లభించలేదు. ఒకవేళ రేటు కారణంగా ప్రస్తుత వేలంలోనూ అమ్ముడు కాకపోయిన పక్షంలో దీనిపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ పరిణామాలతో ఎకానమీ ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వేలం జరుగుతున్నప్పటికీ.. ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తుండటం సానుకూలాంశమని ప్రసాద్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5జీ స్పెక్ట్రం వేలం జరిగే అవకాశం ఉందని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. దూకుడుగా జియో.. వేలంలో పాల్గొంటున్న మూడు ప్రైవేట్ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కలిపి రూ.13,475 కోట్లు ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) చేశాయి. దాదాపు రూ. 1.79 లక్షల కోట్ల విలువ చేసే జియో సంస్థ అత్యధికంగా రూ. 10,000 కోట్లు బయానాగా చెల్లించింది. ఇక రూ. 71,703 కోట్ల విలువ గల భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, రూ. 43,474 కోట్ల నెగటివ్ విలువ గల వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ చెల్లించాయి. జియో చెల్లించిన బయానా బట్టి చూస్తే .. సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గణనీయంగా స్పెక్ట్రం తీసుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖజానాకు రూ. 13,000 కోట్లు స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.12,000–13,000 కోట్లు రావచ్చని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా దాదాపు ఇదే స్థాయిలో అందవచ్చు. ప్రస్తుత వేలంలో .. ఏడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో (700 మెగాహెట్జ్, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్) మొత్తం 2,308.80 మెగాహెట్జ్ (ఎంహెచ్‌జెడ్) స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. ఇందులో 5జీ కోసం ఉద్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్ బ్యాండ్లను చేర్చలేదని, వీటిని తర్వాత వేలం వేయవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ, సాక్షి: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన కేంద్ర కేబినెట్ తాజాగా పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయం, టెలికం, విద్యుత్ రంగాలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించింది. కొద్ది రోజులుగా రైతుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల సబ్సిడీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఐదు కోట్లమంది రైతులు, ఐదు లక్షల కార్మికులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. సొమ్మును రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లు తెలియజేశారు. గత రెండు, మూడేళ్లుగా చక్కెర ఉత్పత్తి మిగులుకు చేరుకున్నందున ధరలు దిగివచ్చినట్లు తెలియజేశారు. ఈ సీజన్(2020-21 అక్టోబర్- సెప్టెంబర్)లో రూ. 3,600 కోట్ల సబ్సిడీలను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. (4 నెలల్లో 4 బిలియన్ డాలర్ల దానం) స్పెక్ట్రమ్ వేలం 2016 తదుపరి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 700 ఎంహెచ్‌జెడ్ మొదలు, 800, 900, 2100, 2300, 2500 ఎంహెజెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల స్పెక్ట్రమ్ వేలానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేశారు. 20ఏళ్ల గడువుతో వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 2,251కుపైగా ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలను విక్రయానికి ఉంచనున్నట్లు తెలియజేశారు. తద్వారా రూ. 3.92 లక్షల కోట్లకుపైగా లభించవచ్చని అంచనా వేశారు. 2021 మార్చిలో వేలాన్ని చేపట్టే వీలున్నట్లు వెల్లడించారు. వేలం విజేతలు ఒకేసారి లేదా విడతల వారీగా చెల్లింపులు చేపట్టవచ్చని తెలియజేశారు. 5జీ ఇలా టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) 5జీ సర్వీసులకు 300 ఎంహెచ్‌జెడ్‌ను ఎంపిక చేసింది. అయితే రక్షణ శాఖ 125 ఎంహెచ్‌జెడ్‌ను వినియోగించుకోనుంది. దీంతో 175 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ మాత్రమే అందుబాటులో ఉండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశవ్యాప్త ప్రాతిపదికన ట్రాయ్ 3300-3600 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఒక్కో ఎంహెచ్‌జెడ్‌కుగాను రూ. 492 కోట్లను బేస్ ధరగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 100 ఎంహెచ్‌జెడ్ 5జీ వేవ్స్‌కుగాను రూ. 50,000 కోట్లు లభించవచ్చని అంచనా. -
రూ. 1.02 లక్షల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రం వేలం పదో రోజున బిడ్లు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ముగింపు స్థాయి రూ. 1,01,432 కోట్ల నుంచి శనివారం రూ. 1,02,215 కోట్లకు చేరాయి. ఇప్పటిదాకా 61 రౌండ్లు జరగ్గా, అమ్మకానికి ఉంచిన స్పెక్ట్రంలో సుమారు 87 శాతాన్ని టెల్కోలు దక్కించుకున్నాయి. ఇంకా కొంత స్పెక్ట్రం మిగిలిపోయి ఉన్నందున సోమవారం కూడా వేలం కొనసాగనుంది. 2జీ, 3జీ సర్వీసులకు ఉపయోగపడే నాలుగు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలోనూ స్పెక్ట్రంను దక్కించుకునేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, 3జీ సేవలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సహా ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో బిడ్లు రాలేదని వివరించాయి. 800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌కి ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర సర్కిళ్లలో డిమాండ్ నెలకొంది. -
రూ. 3 లక్షల కోట్లు!
అంచనాలు మించుతున్న బొగ్గు, స్పెక్ట్రం వేలం ఆదాయం - 32 బొగ్గు బ్లాకులతో రూ. 2 లక్షల కోట్లు - స్పెక్ట్రం వేలంతో మరో రూ. 1 లక్ష కోట్లు న్యూఢిల్లీ: ఒకవైపు బొగ్గు బ్లాకులు వేలం, మరోవైపు టెలికం స్పెక్ట్రం వేలం అంచనాలను మించే స్థాయిలో సాగుతున్నాయి. వీటితో ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఏకంగా రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు మొత్తం సమకూరినట్లయింది. బొగ్గు, స్పెక్ట్రం కుంభకోణాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలో వేసిన లెక్కలకు మించి ఇది ఉండటం గమనార్హం. ఈ రెండింటి వేలం ఇంకా కొనసాగుతోంది. టెలికం స్పెక్ట్రం వేలానికి సంబంధించి బిడ్లు సోమవారం నాటికి రూ. 94,000 కోట్లకు చేరుకున్నాయి. అటు రెండో విడత బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి అయిదో రోజున మరో రెండు బ్లాకులు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 11,000 కోట్లు రానున్నాయి. దీంతో బొగ్గు బ్లాకుల వేలం ద్వారా రాయల్టీలు, చెల్లింపులు మొదలైన వాటి రూపంలో రూ. 2.07 లక్షల కోట్లు వచ్చినట్లవుతుంది. యూపీఏ హయాంలో బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల ప్రభుత్వానికి రూ. 1.86 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలో అంచనా వేసిన దానికంటే తాజా వేలంలో ఖజానాకు మరింత అధికంగా ఆదాయం రానుండటం గమనార్హం. కుంభకోణానికి కేంద్ర బిందువులైన 204 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు కొన్నాళ్ల క్రితం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేవలం 32 బ్లాకులను విక్రయిస్తేనే ఏకంగా రూ. 2.07 లక్షల కోట్లు వ స్తున్నాయని బొగ్గు శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. దీని వల్ల విద్యుత్ చార్జీలు తగ్గడంతో పాటు ఒడిషా తదితర రాష్ట్రాలకు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం రాగలదన్నారు. ఇక స్పెక్ట్రం వేలానికి సంబంధించి సోమవారం నాడు ఏడు రౌండ్లు జరిగాయి. దీంతో మొత్తం 31 రౌండ్లు పూర్తయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రం వేలానికి ఇప్పటిదాకా బిడ్డింగ్ రాలేదు. -
రూ. 65 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు
ముంబై: టెలికం స్పెక్ట్రం వేలం రెండో రోజున బిడ్ల విలువ రూ. 65,000 కోట్లకు చేరింది. గురువారం 5 రౌండ్లు జరిగాయి. దీంతో మొత్తం 11 రౌండ్లు జరిగినట్లయింది. హోలీ సందర్భంగా సెలవుదినం అయినప్పటికీ నేడు (శుక్రవారం) కూడా వేలం కొనసాగనుంది. 2జీ, 3జీ సేవలకు ఉపయోగపడే నాలుగు బ్యాండ్‌విడ్త్‌లలో సుమారు 386 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను టెలికం శాఖ వేలం వేస్తోంది. తొలి రోజున రూ. 60,000 కోట్ల మేర బిడ్లు వచ్చాయి. ఈ వేలం ద్వారా రూ. 82,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకు రాగలవని అంచనా. మరోవైపు, టెలికం కంపెనీలు తీవ్రంగా పోటీపడుతుండటం వల్ల స్పెక్ట్రం ధర గణనీయంగా పెరగొచ్చని, దీని వల్ల టారిఫ్‌లు కూడా భారీగానే పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) తెలిపింది. అలాగే పెద్ద ఆపరేటర్లు, చిన్న ఆపరేటర్ల మధ్య వ్యత్యాసం కూడా గణనీయం గా పెరుగుతుందని పేర్కొంది. మరోవైపు, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రేట్లు తగ్గిస్తుండటం, టెలికం మార్కెట్లోకి కొత్తగా రిలయన్స్ జియో ప్రవేశం మొదలైన కారణాలతో డేటా విభాగంలో పోటీ తీవ్రతరమవుతుందని పేర్కొంది. -
తొలి రోజు రూ. 60వేల కోట్ల బిడ్లు
- టెలికం స్పెక్ట్రం వేలం ప్రారంభం - ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ - ఏపీలో 1800 మెగాహెట్జ్బ్యాండ్కి డిమాండ్ న్యూఢిల్లీ: ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీతో టెలికం స్పెక్ట్రం వేలం బుధవారం ప్రారంభమైంది. తొలి రోజున ఆరు రౌండ్లు జరగ్గా రూ. 60,000 కోట్ల మేర బిడ్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2జీ, 3జీ టెలికం సేవలకు ఉపయోగపడేలా నాలుగు బ్యాండ్లలో స్పెక్ట్రం వేలం వేస్తుండగా, 8 కంపెనీలు బరిలో ఉన్నాయి. ప్రస్తుత ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ తమ స్పెక్ట్రంను కాపాడుకునేందుకు కొత్త ఆపరేటరు రిలయన్స్ జియోతో పోటీపడుతున్నాయి. 2,100 మెగాహెట్జ్ బ్యాండ్ (3జీ సేవలకు ఉపయోగపడేది), 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంనకు మెరుగైన స్పందన కనిపించగా, 800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి కూడా అనూహ్య స్థాయిలో ఆపరేటర్ల నుంచి ఆసక్తి వ్యక్తమైంది. అయితే, ముంబై, ఢిల్లీ, కర్ణాటక సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రంనకు పెద్దగా బిడ్లు దాఖలు కాలేదు. ఆరో రౌండు ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్‌లో 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, పంజాబ్ తదితర సర్కిళ్లలో 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంకి మంచి స్పందన లభించింది. వేలం వేసిన స్పెక్ట్రం రిజర్వ్ ధర రూ. 49,000 కోట్లు అయినప్పటికీ.. మొత్తం రూ. 60,000 కోట్ల పైచిలుకు బిడ్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. నేడు (గురువారం) కూడా వేలం కొనసాగనుంది. ఈ వేలం ద్వారా కనీసం రూ. 82,000 కోట్లు - రూ. 1లక్ష కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఖజానాకు రాగలవని అంచనా. 2జీ టెలికం సేవలకు సంబంధించి 3 బ్యాండ్‌విడ్త్‌లలో మొత్తం 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో పాటు, 3జీకి ఉపయోగపడే బ్యాండ్‌విడ్త్‌లో మరో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్ర టెలికం విభాగం వేలం వేస్తోంది. -
స్పెక్ట్రం బరిలో 8 కంపెనీలు
- రేసులో ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో - మార్చి 4న వేలం న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగబోయే టెలికం స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు 8 టెలికం కంపెనీలు బరిలో నిల్చాయి. బిడ్డింగ్‌ల దాఖలుకు ఆఖరు రోజైన సోమవారం నాడు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్, రిలయన్స్ జియో, యూనినార్ సంస్థలు దరఖాస్తులు అందజేశాయి. ఎయిర్‌సెల్, టాటా టెలీసర్వీసెస్ కూడా బిడ్డింగ్‌లో పాల్గొంటున్నాయి. అయితే, సీడీఎంఏ స్పెక్ట్రంనకు సంబంధించి సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ మాత్రం వైదొలిగింది. రిజర్వ్ ధర అధికంగా ఉండటంతో పాటు టెలికం విభాగంతో న్యాయవివాదం ఇందుకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్తో పాటు వీడియోకాన్ కూడా వేలంలో పాల్గొనడం లేదు. ఆఖరు రోజు నాటికి ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు టెలికం విభాగం అధికారి ఒకరు చెప్పారు. రిలయన్స్ జియో, యూనినార్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్ కూడా పోటీపడుతుండటంతో స్పెక్ట్రంనకు అధిక ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మార్చి 4న స్పెక్ట్రం వేలం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేలం వేయబోతున్న స్పెక్ట్రంలో సింహభాగం.. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ టెలికం వద్ద ఉంది. ఈ కంపెనీల లెసైన్సుల గడువు 2015-16తో ముగిసిపోనుంది. దీంతో ఇవి మొబైల్, ఇతర టెలికం సర్వీసులు అందించడం కొనసాగించాలంటే స్పెక్ట్రం కోసం బిడ్ చేయకతప్పని పరిస్థితి నెలకొంది. 2జీ, 3జీ టెలికం సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 80,000 కోట్లు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రిజర్వ్ ధర బట్టి చూసినా 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌లో (3జీ సేవలకు ఉపయోగపడేది) కనిష్టంగా రూ. 17,555 కోట్లు, 800.. 900 .. 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో (2జీ సేవలకు ఉపయోగపడేవి) రూ. 64,840 కోట్లు రాగలవని అంచనా. ఈ మూడు బ్యాండ్లలో 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంను, 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేస్తోంది. 2014 ఫిబ్రవరిలో వేలం నిర్వహించినప్పుడు కేంద్రం రూ. 62,162 కోట్లు సమీకరించింది. రూ. 90 వేల కోట్ల అంచనా: క్రిసిల్ స్పెక్ట్రం వేలంతో ప్రభుత్వానికి రూ. 90,000 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. కీలకమైన 900 మెగాహెట్జ్ స్పెక్ట్రంనకు భారీ డిమాండ్ ఉండగలదని తెలిపింది. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది. -
స్పెక్ట్రం వేలంతో వచ్చే ఏడాది రూ. 39వేల కోట్ల లక్ష్యం
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం వేలంతో పాటు సంబంధిత ఫీజులు మొదలైన వాటి రూపంలో రూ. 38,954 కోట్లు సమీకరించాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేంద్రం నిర్దేశించుకుంది. ఇటీవలే ముగిసిన 2జీ స్పెక్ట్రం వేలం అంచనాలను మించి విజయవంతం కావడం... రూ. 61,162 కోట్ల మేర బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 18,296 కోట్లు రాగలవని అంచనా.