తొలి రోజు రూ. 60వేల కోట్ల బిడ్లు
- టెలికం స్పెక్ట్రం వేలం ప్రారంభం
- ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ
- ఏపీలో 1800 మెగాహెట్జ్‌బ్యాండ్‌కి డిమాండ్
న్యూఢిల్లీ: ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీతో టెలికం స్పెక్ట్రం వేలం బుధవారం ప్రారంభమైంది. తొలి రోజున ఆరు రౌండ్లు జరగ్గా రూ. 60,000 కోట్ల మేర బిడ్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2జీ, 3జీ టెలికం సేవలకు ఉపయోగపడేలా నాలుగు బ్యాండ్‌లలో స్పెక్ట్రం వేలం వేస్తుండగా, 8 కంపెనీలు బరిలో ఉన్నాయి. ప్రస్తుత ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ తమ స్పెక్ట్రంను కాపాడుకునేందుకు కొత్త ఆపరేటరు రిలయన్స్ జియోతో పోటీపడుతున్నాయి. 2,100 మెగాహెట్జ్ బ్యాండ్ (3జీ సేవలకు ఉపయోగపడేది), 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంనకు మెరుగైన స్పందన కనిపించగా, 800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి కూడా అనూహ్య స్థాయిలో ఆపరేటర్ల నుంచి ఆసక్తి వ్యక్తమైంది. అయితే, ముంబై, ఢిల్లీ, కర్ణాటక సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రంనకు పెద్దగా బిడ్లు దాఖలు కాలేదు.
ఆరో రౌండు ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్‌లో 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, పంజాబ్ తదితర సర్కిళ్లలో 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంకి మంచి స్పందన లభించింది. వేలం వేసిన స్పెక్ట్రం రిజర్వ్ ధర రూ. 49,000 కోట్లు అయినప్పటికీ.. మొత్తం రూ. 60,000 కోట్ల పైచిలుకు బిడ్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.
నేడు (గురువారం) కూడా వేలం కొనసాగనుంది. ఈ వేలం ద్వారా కనీసం రూ. 82,000 కోట్లు - రూ. 1లక్ష కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఖజానాకు రాగలవని అంచనా. 2జీ టెలికం సేవలకు సంబంధించి 3 బ్యాండ్‌విడ్త్‌లలో మొత్తం 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో పాటు, 3జీకి ఉపయోగపడే బ్యాండ్‌విడ్త్‌లో మరో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్ర టెలికం విభాగం వేలం వేస్తోంది.