bandwidth
-
స్పెక్ట్రం వేలానికి సన్నాహాలు..
► 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంకు రూ.11,485 కోట్లు! ► బేస్ ప్రైస్‌ను సిఫార్సు చేసిన ట్రాయ్ ► మరో 6 బ్యాండ్విడ్త్లకు కూడా... ► మే నెలలో వేలం ఉండొచ్చని అంచనా న్యూఢిల్లీ: హైఎండ్ మొబైల్ సర్వీసులకు అత్యంత అనువైన ప్రీమియం బ్యాండ్‌విడ్త్ 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వేలానికి సంబంధించి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బేస్ ధరను సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.11,485 కోట్ల రేటును సూచించింది. తదుపరి విడత స్పెక్ట్రం వేలంలో ఈ ప్రీమియం బ్యాండ్‌ను కూడా వేలానికి పెట్టనుండగా... దిగ్గజ మొబైల్ ఆపరేటర్లు దీన్ని ఎలాగైనా వాయిదా వేయించాలనే సన్నాహాల్లో ఉన్నారు. కాగా, ఈ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రంకు బేస్ ప్రైస్‌ను ట్రాయ్ సిఫార్సు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో అందుబాటులో ఉన్న ఏ సెక్ట్రం బ్యాండ్విడ్త్లోనైనా ఇదే అత్యధిక ధరగా నిలవనుంది. గత వేలంలో (2015 మార్చి) 900 మెగాహెర్ట్జ్లో అత్యధికంగా కేంద్రం రూ.3,980 కోట్లను బేస్ ధరగా నిర్ణయించింది. మొత్తం 7 బ్యాండ్స్‌కు... 700 మెగాహెర్ట్జ్తోపాటు మొత్తం ఏడు బ్యాండ్ విడ్త్లకు సంబంధించి బేస్ ధరలకు ట్రాయ్ సూచించింది. 2జీ సేవలకు పేరొందిన 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో దేశవ్యాప్తంగా ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రేటు రూ. 2,873 కోట్లుగా నిర్ణయించింది. 2015లో జరిగిన వేలంలో ప్రభుత్వం ఖరారు చేసిన ధర కంటే ఇది 31 శాతం అధికం. ఈ ఏడాది మే-జూన్లలో తాజాగా స్పెక్ట్రం వేలం ఉండొచ్చని భావిస్తున్నారు. మరోపక్క, ప్రభుత్వం వద్ద మిగిలిఉన్న 3జీ స్పెక్ట్రంకు కూడా దేశవ్యాప్తంగా ఒక్కో మెగామెర్ట్జ్కు రూ.3,746 కోట్ల బేస్ ధరను ట్రాయ్ సిఫార్సు చేసింది. 2015 మార్చి వేలం రేటుతో పోలిస్తే ఇది స్పల్పంగా ఎక్కువ. 4జీ సేవలకు విరివిగా వాడే 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం రేటును రూ.5,829 కోట్లను ట్రాయ్ సూచించింది. 2015 మార్చి వేలం ధరతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. మొత్తం 22 సర్కిళ్లకుగాను 19 సర్కిళ్లలో వేలానికి ట్రాయ్ సూచించింది. 2,300; 2,500 మెగాహెర్ట్జ్ బ్యాండ్లలో రూ.817 కోట్ల చొప్పున రేటును నిర్ణయించింది. ఇది 2010లో జరిగిన వేలం బేస్ ధరతో పోలిస్తే 33 శాతం ఎక్కువ. ప్రస్తుతం రిలయన్జ్ జియోకు మాత్రమే దేశవ్యాప్తంగా 2,300 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం ఉంది. ఆ వేలం వద్దు: టెల్కోలు... 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్(ఎక్కువగా 3జీ సేవలకు వినియోగిస్తున్నారు)తో పోలిస్తే 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో మొబైల్ సేవలను అందించేందుకు 70 శాతం మేర తక్కువ వ్యయం అవుతుందని ట్రాయ్ విడుదల చేసిన సిఫార్సుల చర్చా పత్రంలో తెలిపింది. అయితే, మన దేశంలో ఈ స్పెక్ట్రం బ్యాండ్‌లో సేవలందించేందుకు తగిన వ్యవస్థ లేదని.. ఒకవేళ కంపెనీలు వేలంలో దీన్ని కొనుగోలు చేసినప్పటికీ వృథాగా పక్కనబెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని టెలికం కంపెనీలు వాదిస్తున్నాయి. అంతిమంగా స్పెక్ట్రం కోసం అనవసరంగా నిధులను ఖర్చుచేయాల్సి వస్తుందని, ఈ బ్యాండ్‌విడ్త్‌లో వేలాన్ని వాయిదా వేయాలని దిగ్గజ టెల్కోలు ట్రాయ్‌కు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. -
తొలి రోజు రూ. 60వేల కోట్ల బిడ్లు
- టెలికం స్పెక్ట్రం వేలం ప్రారంభం - ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ - ఏపీలో 1800 మెగాహెట్జ్బ్యాండ్కి డిమాండ్ న్యూఢిల్లీ: ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీతో టెలికం స్పెక్ట్రం వేలం బుధవారం ప్రారంభమైంది. తొలి రోజున ఆరు రౌండ్లు జరగ్గా రూ. 60,000 కోట్ల మేర బిడ్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2జీ, 3జీ టెలికం సేవలకు ఉపయోగపడేలా నాలుగు బ్యాండ్లలో స్పెక్ట్రం వేలం వేస్తుండగా, 8 కంపెనీలు బరిలో ఉన్నాయి. ప్రస్తుత ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ తమ స్పెక్ట్రంను కాపాడుకునేందుకు కొత్త ఆపరేటరు రిలయన్స్ జియోతో పోటీపడుతున్నాయి. 2,100 మెగాహెట్జ్ బ్యాండ్ (3జీ సేవలకు ఉపయోగపడేది), 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంనకు మెరుగైన స్పందన కనిపించగా, 800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి కూడా అనూహ్య స్థాయిలో ఆపరేటర్ల నుంచి ఆసక్తి వ్యక్తమైంది. అయితే, ముంబై, ఢిల్లీ, కర్ణాటక సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రంనకు పెద్దగా బిడ్లు దాఖలు కాలేదు. ఆరో రౌండు ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్‌లో 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, పంజాబ్ తదితర సర్కిళ్లలో 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంకి మంచి స్పందన లభించింది. వేలం వేసిన స్పెక్ట్రం రిజర్వ్ ధర రూ. 49,000 కోట్లు అయినప్పటికీ.. మొత్తం రూ. 60,000 కోట్ల పైచిలుకు బిడ్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. నేడు (గురువారం) కూడా వేలం కొనసాగనుంది. ఈ వేలం ద్వారా కనీసం రూ. 82,000 కోట్లు - రూ. 1లక్ష కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఖజానాకు రాగలవని అంచనా. 2జీ టెలికం సేవలకు సంబంధించి 3 బ్యాండ్‌విడ్త్‌లలో మొత్తం 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో పాటు, 3జీకి ఉపయోగపడే బ్యాండ్‌విడ్త్‌లో మరో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్ర టెలికం విభాగం వేలం వేస్తోంది. -
నేటి నుంచి స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ ఎత్తున నిధులు సమకూర్చిపెట్టగలదని భావిస్తున్న 2జీ, 3జీ టెలికం స్పెక్ట్రం వేలం నేటి నుంచి (బుధవారం) ప్రారంభం కానుంది. 2జీ టెలికం సేవలకు సంబంధించి 3 బ్యాండ్‌విడ్త్‌లలో మొత్తం 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో పాటు, 3జీకి ఉపయోగపడే బ్యాండ్‌విడ్త్‌లో మరో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్ర టెలికం విభాగం వేలం వేయనుంది. మొత్తం 8 సంస్థలు స్పెక్ట్రం కోసం పోటీపడుతున్నాయి. ఈ వేలం ద్వారా కనీసం రూ. 82,000 కోట్లు కేంద్రానికి సమకూరగలవని అంచనా. అయితే, డిమాండ్‌ను బట్టి రూ. 1 లక్ష కోట్ల దాకా రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 3జీ స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 17,555 కోట్లు, 2జీ స్పెక్ట్రం ద్వారా రూ. 64,840 కోట్లు రాగలవని అంచనా. పలు టెలికం సర్కిళ్లలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ టెలికంకిచ్చిన లెసైన్సులు 2015-16తో ముగిసిపోనున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా స్పెక్ట్రం వేలం నిర్వహిస్తోంది. ఇవి టెలికం సేవలు కొనసాగించాలంటే స్పెక్ట్రం వేలంలో పాల్గొనక తప్పని పరిస్థితి నెలకొంది. వేలంలో పాల్గొంటున్న 8 సంస్థలు రూ. 20,435 కోట్లు ముందస్తు డిపాజిట్‌గా చెల్లించాయి. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అత్యధికంగా రూ. 4,500 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ. 4,336 కోట్లు కట్టాయి. మొబైల్ టారిఫ్‌లు పెరగాలి: ఎయిర్టెల్ మొబైల్ కాల్ చార్జీలు, డేటా టారిఫ్‌లు కొంతైనా పెరగాల్సిన అవసరం ఉందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ చెప్పారు. గడి చిన మూడేళ్లలో చార్జీలు కేవలం మూడు పైసల మేర మాత్రమే పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో కాల్చార్జీలు నిమిషానికి మరో 5-7 పైసలు, డేటా చార్జీలు ఎంబీకి 2-3 పైసల మేర పెరగాల్సిన అవసరం ఉందని మిట్టల్ చెప్పారు. ఈ పెరుగుదల వినియోగదారులకు పెద్ద భారంగా ఉండబోదని బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. స్పెక్ట్రం వేలంలో ఎయిర్టెల్ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
2జీ స్పెక్ట్రం వేలం నేటి నుంచే
బిడ్డింగ్ బరిలో 8 టెలికం కంపెనీలు న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం వేలం నేటి నుంచి (సోమవారం) షురూ కానుంది. 1,800; 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రం వేలాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది టెలికం కంపెనీలు... భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో, ఐడియా, టెలీవింగ్స్ (యూనినార్), ఆర్‌కామ్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్‌లు బిడ్డింగ్‌లో పోటీపడనున్నాయి. వేలం ద్వారా ఖజానాకు కనీసం 11,300 కోట్లు లభించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో మొత్తం 10 సర్కిళ్లలో తొలుత 403 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించగా.. దీన్ని ప్రస్తుతం 385 మెగాహెర్ట్జ్‌కు తగ్గించారు. కాగా, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 46 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలానికి పెట్టనున్నారు. 2జీ స్కామ్ కారణంగా 2012 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు మొత్తం 122 స్పెక్ట్రం లెసైన్స్‌లను రద్దు చేసి మళ్లీ వేలం నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి 2 సార్లు 2జీ వేలం జరిగింది. తాజా వేలం మూడోది. 2012 నవంబర్‌లో రూ.28,000 కోట్ల విలువైన స్పెక్ట్రంను వేలానికి పెట్టగా.. కేవలం 9,407 కోట్లే ప్రభుత్వానికి లభించాయి. ఇక గతేడాది మార్చిలో జీఎస్ఎం టెల్కోలు వేలంలోనే పాల్గొనలేదు. సీడీఎంఏ ఆపరేటర్ సిస్టెమా శ్యామ్ 8 సర్కిళ్లలో రూ.3,800 కోట్లకు స్పెక్ట్రంను దక్కించుకుంది. వేలం ఆరంభ ధరలు ఇలా... 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో దేశవ్యాప్త లెసైన్స్‌కు ఒక్కో మెగాహెర్ట్జ్‌కు ఆరంభ(బేస్) ధరను ప్రభుత్వం 1,765 కోట్లుగా నిర్దేశించింది. ఇది మార్చిలో జరిగిన వేలం బేస్ ప్రైస్‌తో పోలిస్తే 26% తక్కువ. ఇక 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో కూడా 53% తక్కువగా రేట్లను ఖరారు చేశారు. ఢిల్లీలో ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.360 కోట్లు, ముంబైలో రూ.328 కోట్లు, కోల్‌కతాలో రూ.125 కోట్ల చొప్పున బేస్ రేట్లను నిర్ణయించారు. రానున్న వేలంలో దక్కించుకునే స్పెక్ట్రంకు వార్షిక వాడకం చార్జీని టెల్కోల స్థూల ఆదాయంలో 5%గా ప్రభుత్వం ఖాయం చేయడం తెలిసిందే. ట స్టే ఇచ్చేందుకు సుప్రీం నో ప్రభుత్వం చేపట్టనున్న స్పెక్ట్రం వేలాన్ని నిలిపేసేలా స్టే ఇవ్వాలన్న టెల్కోల వాదనలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. వేలంపై స్టేతోపాటు మరో పదేళ్లు తమ లెసైన్స్‌లను పొడిగించాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, లూప్, ఐడియాలు దాఖలు చేసిన పిటిషన్లను టెలికం ట్రిబ్యునల్(టీడీశాట్) గత నెల 31న కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వొడాఫోన్, ఎయిర్‌టెల్‌లు సుప్రీంను ఆశ్రయించాయి. ఆదివారం అత్యవసరంగా దీన్ని విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, ఎస్ఏ బాబ్డేల ధర్మాసనం టీడీశాట్ తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.