2జీ స్పెక్ట్రం వేలం నేటి నుంచే
బిడ్డింగ్ బరిలో 8 టెలికం కంపెనీలు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం వేలం నేటి నుంచి (సోమవారం) షురూ కానుంది. 1,800; 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రం వేలాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది టెలికం కంపెనీలు... భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో, ఐడియా, టెలీవింగ్స్ (యూనినార్), ఆర్‌కామ్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్‌లు బిడ్డింగ్‌లో పోటీపడనున్నాయి. వేలం ద్వారా ఖజానాకు కనీసం 11,300 కోట్లు లభించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో మొత్తం 10 సర్కిళ్లలో తొలుత 403 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించగా.. దీన్ని ప్రస్తుతం 385 మెగాహెర్ట్జ్‌కు తగ్గించారు. కాగా, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 46 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలానికి పెట్టనున్నారు.
2జీ స్కామ్ కారణంగా 2012 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు మొత్తం 122 స్పెక్ట్రం లెసైన్స్‌లను రద్దు చేసి మళ్లీ వేలం నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి 2 సార్లు 2జీ వేలం జరిగింది. తాజా వేలం మూడోది. 2012 నవంబర్‌లో రూ.28,000 కోట్ల విలువైన స్పెక్ట్రంను వేలానికి పెట్టగా.. కేవలం 9,407 కోట్లే ప్రభుత్వానికి లభించాయి. ఇక గతేడాది మార్చిలో జీఎస్‌ఎం టెల్కోలు వేలంలోనే పాల్గొనలేదు. సీడీఎంఏ ఆపరేటర్ సిస్టెమా శ్యామ్ 8 సర్కిళ్లలో రూ.3,800 కోట్లకు స్పెక్ట్రంను దక్కించుకుంది.
వేలం ఆరంభ ధరలు ఇలా...
1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో దేశవ్యాప్త లెసైన్స్‌కు ఒక్కో మెగాహెర్ట్జ్‌కు ఆరంభ(బేస్) ధరను ప్రభుత్వం 1,765 కోట్లుగా నిర్దేశించింది. ఇది మార్చిలో జరిగిన వేలం బేస్ ప్రైస్‌తో పోలిస్తే 26% తక్కువ. ఇక 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో కూడా 53% తక్కువగా రేట్లను ఖరారు చేశారు. ఢిల్లీలో ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.360 కోట్లు, ముంబైలో రూ.328 కోట్లు, కోల్‌కతాలో రూ.125 కోట్ల చొప్పున బేస్ రేట్లను నిర్ణయించారు. రానున్న వేలంలో దక్కించుకునే స్పెక్ట్రంకు వార్షిక వాడకం చార్జీని టెల్కోల స్థూల ఆదాయంలో 5%గా ప్రభుత్వం ఖాయం చేయడం తెలిసిందే.
ట స్టే ఇచ్చేందుకు సుప్రీం నో
ప్రభుత్వం చేపట్టనున్న స్పెక్ట్రం వేలాన్ని నిలిపేసేలా స్టే ఇవ్వాలన్న టెల్కోల వాదనలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. వేలంపై స్టేతోపాటు మరో పదేళ్లు తమ లెసైన్స్‌లను పొడిగించాలంటూ భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, లూప్, ఐడియాలు దాఖలు చేసిన పిటిషన్‌లను టెలికం ట్రిబ్యునల్(టీడీశాట్) గత నెల 31న కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వొడాఫోన్, ఎయిర్‌టెల్‌లు సుప్రీంను ఆశ్రయించాయి. ఆదివారం అత్యవసరంగా దీన్ని విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, ఎస్‌ఏ బాబ్డేల ధర్మాసనం టీడీశాట్ తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.