న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసే అసెట్ వేల్యుయర్ ఎంపికకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను కేంద్రం రద్దు చేసింది. బిడ్డింగ్‌కు అంతగా స్పందన లభించకపోవడమే ఇందుకు కారణం. బిడ్డర్లను ఆకర్షించే విధంగా బిడ్డింగ్ నిబంధనలను మెరుగుపర్చి, త్వరలోనే కొత్త ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ని జారీ చేయనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) పేర్కొంది.
ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీకి 94.72 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా, రెండు కలిసి సుమారు 61 శాతం వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసేందుకు అసెట్ వేల్యుయర్‌ను నియమించడానికి సెప్టెంబర్ 1న దీపమ్ .. బిడ్లను ఆహ్వానించింది.
బిడ్ల సమర్పణకు అక్టోబర్ 9 గడువు అయినప్పటికీ అక్టోబర్ 30 వరకు పొడిగించారు. అయినప్పటికీ ఒకే ఒక్క బిడ్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఆర్‌ఎఫ్‌పీని జారీ చేయాలని దీపమ్ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. వాటాల విక్రయం తర్వాత బ్యాంకులో ప్రభుత్వానికి 15 శాతం, ఎల్‌ఐసీకి 19 శాతం వాటాలు ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment