వారానికి 5 రోజుల పని కల్పించాలన్న బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. జూన్ 2024లో బ్యాంకు ఉద్యోగులకు జీతం పెంపుతో పాటు వారానికి 5 పని దినాలు కల్పించేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ఇవ్వనుందని సమాచారం.
ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల కూటమి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాయి. బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పనివారాన్ని అనుమతించాలని కోరాయి. అదే సమయంలో ఖాతాదారుల కోసం బ్యాంకింగ్ పనిగంటల్లో కానీ, ఉద్యోగులు, అధికారుల పనివేళల్లో పని గంటలలో గానీ ఎలాంటి తగ్గింపు ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘం హామీ ఇచ్చింది.
ఈ అంశంపై సానుకూలంగా సమీక్ష జరిపి, తదనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)ని ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు ఈటీ నివేదిక హైలెట్ చేసింది.
ప్రస్తుతం, బ్యాంకు శాఖలు రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే, 2015 నుంచి అన్ని శని, ఆదివారాల్లో ఆఫ్‌లు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్‌మెంట్ ప్రకారం,ఆర్‌బీఐ, ప్రభుత్వం ఐబీఏతో ఏకీభవించాయి. రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాయి.
జీతంపై, ఐబీఏ, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు గత సంవత్సరం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)లో 17శాతం జీతాల పెంపునకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటీ నివేదిక ప్రకారం.. కేంద్రం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల్ని కల్పించడంతో పాటు జీతాల పెంపు జరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా.
జీతాల పెంపును కేంద్రం ఆమోదించినట్లయితే, అన్ని పీఎస్‌బీఐ, ఎంపిక చేసిన పలు ప్రైవేట్ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment