
ముంబై: సైరస్ పూనావాలా గ్రూప్ ప్రమోట్ చేస్తున్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్‌ఎల్) కొత్తగా పసిడి రుణాల వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. వ్యాపార విస్తరణ, వ్యవసాయ ఖర్చులు, వ్యక్తిగత అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలపై వేగవంతంగా రుణాలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
“మా సెక్యూర్డ్ రుణాల పోర్ట్‌ఫోలియోకు కొనసాగింపుగా పసిడి రుణాలు ఉంటాయి. బంగారానికి గల భావోద్వేగ, ఆర్థికపరమైన విలువను గౌరవిస్తూ, మా కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తిని రూపొందించాం” అని పూనావాలా ఫిన్‌కార్ప్ ఎండీ, సీఈవో అరవింద్ కపిల్ తెలిపారు. సెక్యూర్డ్ ఉత్పత్తితో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తన కార్యకలాపాలను పటిష్టం చేసుకునే దిశగా వచ్చే నాలుగు త్రైమాసికాల్లో దశలవారీగా 400 కొత్త శాఖలను ప్రారంభించే యోచనలో పీఎఫ్ఎల్ ఉంది.
సంపద, భద్రతకు విశ్వసనీయమైన వనరుగా భారతీయుల్లో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సత్వరం నిధులు అవసరమైన వారికి ఒక వ్యూహాత్మక ఆస్తిగా ఇది ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో ఇటు పట్టణ అటు గ్రామీణ మార్కెట్లలో భారీ వృద్ధి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో గోల్డ్ లోన్ మార్కెట్లో గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక అనిశ్చితుల్లో రుణాలకు తక్కువ రిస్కులతో కూడుకున్న సురక్షితమైన వ్యాపారంగా కూడా పసిడి రుణాల విభాగం కొనసాగుతోంది.