స్పెక్ట్రం వేలానికి సన్నాహాలు.. | No plausible reason to revise spectrum cap: Trai | Sakshi
Sakshi News home page

స్పెక్ట్రం వేలానికి సన్నాహాలు..

Published Thu, Jan 28 2016 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

స్పెక్ట్రం వేలానికి సన్నాహాలు..

స్పెక్ట్రం వేలానికి సన్నాహాలు..

700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంకు రూ.11,485 కోట్లు!
బేస్ ప్రైస్‌ను సిఫార్సు చేసిన ట్రాయ్
మరో 6 బ్యాండ్‌విడ్త్‌లకు కూడా...
మే నెలలో వేలం ఉండొచ్చని అంచనా

 న్యూఢిల్లీ: హైఎండ్ మొబైల్ సర్వీసులకు అత్యంత అనువైన ప్రీమియం బ్యాండ్‌విడ్త్ 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వేలానికి సంబంధించి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బేస్ ధరను సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.11,485 కోట్ల రేటును సూచించింది. తదుపరి విడత స్పెక్ట్రం వేలంలో ఈ ప్రీమియం బ్యాండ్‌ను కూడా వేలానికి పెట్టనుండగా... దిగ్గజ మొబైల్ ఆపరేటర్లు దీన్ని ఎలాగైనా వాయిదా వేయించాలనే సన్నాహాల్లో ఉన్నారు.

కాగా, ఈ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రంకు బేస్ ప్రైస్‌ను ట్రాయ్ సిఫార్సు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో అందుబాటులో ఉన్న ఏ సెక్ట్రం బ్యాండ్‌విడ్త్‌లోనైనా ఇదే అత్యధిక ధరగా నిలవనుంది. గత వేలంలో (2015 మార్చి) 900 మెగాహెర్ట్జ్‌లో అత్యధికంగా కేంద్రం రూ.3,980 కోట్లను బేస్ ధరగా నిర్ణయించింది.

మొత్తం 7 బ్యాండ్స్‌కు...
700 మెగాహెర్ట్జ్‌తోపాటు మొత్తం ఏడు బ్యాండ్ విడ్త్‌లకు సంబంధించి బేస్ ధరలకు ట్రాయ్ సూచించింది. 2జీ సేవలకు పేరొందిన 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో దేశవ్యాప్తంగా ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రేటు రూ. 2,873 కోట్లుగా నిర్ణయించింది. 2015లో జరిగిన వేలంలో ప్రభుత్వం ఖరారు చేసిన ధర కంటే ఇది 31 శాతం అధికం. ఈ ఏడాది మే-జూన్‌లలో తాజాగా స్పెక్ట్రం వేలం ఉండొచ్చని భావిస్తున్నారు.

మరోపక్క, ప్రభుత్వం వద్ద మిగిలిఉన్న 3జీ స్పెక్ట్రంకు కూడా దేశవ్యాప్తంగా ఒక్కో మెగామెర్ట్జ్‌కు రూ.3,746 కోట్ల బేస్ ధరను ట్రాయ్ సిఫార్సు చేసింది. 2015 మార్చి వేలం రేటుతో పోలిస్తే ఇది స్పల్పంగా ఎక్కువ. 4జీ సేవలకు విరివిగా వాడే 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం రేటును రూ.5,829 కోట్లను ట్రాయ్ సూచించింది. 2015 మార్చి వేలం ధరతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. మొత్తం 22 సర్కిళ్లకుగాను 19 సర్కిళ్లలో వేలానికి ట్రాయ్ సూచించింది. 2,300; 2,500 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లలో రూ.817 కోట్ల చొప్పున రేటును నిర్ణయించింది. ఇది 2010లో జరిగిన వేలం బేస్ ధరతో పోలిస్తే 33 శాతం ఎక్కువ. ప్రస్తుతం రిలయన్జ్ జియోకు మాత్రమే దేశవ్యాప్తంగా 2,300 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం ఉంది.

ఆ వేలం వద్దు: టెల్కోలు...
2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్(ఎక్కువగా 3జీ సేవలకు వినియోగిస్తున్నారు)తో పోలిస్తే 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో మొబైల్ సేవలను అందించేందుకు 70 శాతం మేర తక్కువ వ్యయం అవుతుందని ట్రాయ్ విడుదల చేసిన సిఫార్సుల చర్చా పత్రంలో తెలిపింది. అయితే, మన దేశంలో ఈ స్పెక్ట్రం బ్యాండ్‌లో సేవలందించేందుకు తగిన వ్యవస్థ లేదని.. ఒకవేళ కంపెనీలు వేలంలో దీన్ని కొనుగోలు చేసినప్పటికీ వృథాగా పక్కనబెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని టెలికం కంపెనీలు వాదిస్తున్నాయి. అంతిమంగా స్పెక్ట్రం కోసం అనవసరంగా నిధులను ఖర్చుచేయాల్సి వస్తుందని, ఈ బ్యాండ్‌విడ్త్‌లో వేలాన్ని వాయిదా వేయాలని దిగ్గజ టెల్కోలు ట్రాయ్‌కు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement