నేటి నుంచి స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ ఎత్తున నిధులు సమకూర్చిపెట్టగలదని భావిస్తున్న 2జీ, 3జీ టెలికం స్పెక్ట్రం వేలం నేటి నుంచి (బుధవారం) ప్రారంభం కానుంది. 2జీ టెలికం సేవలకు సంబంధించి 3 బ్యాండ్‌విడ్త్‌లలో మొత్తం 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో పాటు, 3జీకి ఉపయోగపడే బ్యాండ్‌విడ్త్‌లో మరో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్ర టెలికం విభాగం వేలం వేయనుంది. మొత్తం 8 సంస్థలు స్పెక్ట్రం కోసం పోటీపడుతున్నాయి. ఈ వేలం ద్వారా కనీసం రూ. 82,000 కోట్లు కేంద్రానికి సమకూరగలవని అంచనా. అయితే, డిమాండ్‌ను బట్టి రూ. 1 లక్ష కోట్ల దాకా రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
3జీ స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 17,555 కోట్లు, 2జీ స్పెక్ట్రం ద్వారా రూ. 64,840 కోట్లు రాగలవని అంచనా. పలు టెలికం సర్కిళ్లలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ టెలికంకిచ్చిన లెసైన్సులు 2015-16తో ముగిసిపోనున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా స్పెక్ట్రం వేలం నిర్వహిస్తోంది. ఇవి టెలికం సేవలు కొనసాగించాలంటే స్పెక్ట్రం వేలంలో పాల్గొనక తప్పని పరిస్థితి నెలకొంది. వేలంలో పాల్గొంటున్న 8 సంస్థలు రూ. 20,435 కోట్లు ముందస్తు డిపాజిట్‌గా చెల్లించాయి. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అత్యధికంగా రూ. 4,500 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ. 4,336 కోట్లు కట్టాయి.
మొబైల్ టారిఫ్‌లు పెరగాలి: ఎయిర్‌టెల్
మొబైల్ కాల్ చార్జీలు, డేటా టారిఫ్‌లు కొంతైనా పెరగాల్సిన అవసరం ఉందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ చెప్పారు. గడి చిన మూడేళ్లలో చార్జీలు కేవలం మూడు పైసల మేర మాత్రమే పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో కాల్‌చార్జీలు నిమిషానికి మరో 5-7 పైసలు, డేటా చార్జీలు ఎంబీకి 2-3 పైసల మేర పెరగాల్సిన అవసరం ఉందని మిట్టల్ చెప్పారు. ఈ పెరుగుదల వినియోగదారులకు పెద్ద భారంగా ఉండబోదని బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. స్పెక్ట్రం వేలంలో ఎయిర్‌టెల్ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.