వేలంలో దుమ్మురేపిన బాండ్ వస్తువులు
అత్యంత భారీ బడ్జెత్ తో నిర్మించే జేమ్స్ బాండ్ చిత్రాలంటే ప్రపంచ వాప్తంగా ఎంతగానే క్రేజ్ ఉంది. జేమ్స్‌బాండ్.. ఈ పేరే ఒక బ్రాండ్. సుమారు అయిదు దశాబ్దాల క్రితం నాటి సినిమా నుంచి ఇప్పటి స్పెక్టర్ దాకా తన స్టయిల్‌తో బాండ్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. జేమ్స్ బాండ్ 007 సిరీస్ నుంచి విడుదలైన 24వ చిత్రం 'స్పెక్టర్'. ఈ చిత్రంలో ఉపయోగించిన కారు, చేతి గడియారం, క్లాప్‌బోర్టు, బాండ్ ధరించిన మాస్క్...తదితర 24 వస్తువులను గురువారం లండన్‌లోని క్రిస్టీస్ ఆక్షన్ హౌస్‌లో వేలం వేశారు. దీని ద్వారా వచ్చిన డబ్బును సమాజ సేవ కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నారు.
ఆస్టన్ మార్టిన్ కారు..
వేలంలో స్పెక్టర్ కథానాయకుడు డానియేల్ ఉపయోగించిన ఆస్టన్ మార్టిన్ డీబీ10 కారుకు అత్యధిక ధర పలికింది. వేలం నిర్వాహకులు ఈ కారు ధర 1.4 మిలియన్ డాలర్ల నుంచి 2.1 మిలియన్ డాలర్లు పలకవచ్చని అంచనా వేశారు. కాని వారి అంచనాలను మించి ఈ కారు ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు(2,434,500 యూరోలు) పలికింది. చిత్రం కోసం ఆస్టన్ మార్టిన్ డీబీ10 మోడల్ కార్లు పదింటిని ప్రత్యేకంగా తయారుచేయించగా మిగిలినవాటిలో రెండు డిస్ప్లే కోసం ఉంచారు. మిగతావి షూటింగ్ సమయంలో పాడైపోయాయి. ఇక ఆఖరికి మిగిలిన ఓకే ఒక్క కారును ఇప్పుడు వేలం వేశారు. ఈ కారును రోడ్లపై నడిపేందుకు అనుమతి లేదు. అయినా సరే... బాండ్ కారుకి ఉన్న క్రేజ్ అంత మొత్తం వెచ్చించేలా చేసింది.
జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్ క్యారెక్టర్ ఉపయోగించే కార్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలతో, ఆటోమేటిక్ కంట్రోల్స్‌తో జేమ్స్ బాండ్ కోసం ఈ కార్లను ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. చిన్న బటన్ నొక్కితే బయటకు వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించే మెషీన్ గన్‌లు, చిన్నపాటి మిసైళ్లు, పొగలు కక్కే స్మోక్ స్క్రీన్, బుల్లెట్ ప్రూఫ్ బాడీ, తొలగించేందుకు వీలుగా ఉండే రూఫ్, జిపిఎస్ నావిగేషన్, టెలిఫోన్ కనెక్షన్, సీక్రెట్ స్విచ్‌లు వంటి ఎన్నో వింతలు ఈ కారు సొంతం. మొట్టమొదటిసారిగా 1964లో జేమ్స్ బాండ్ గోల్డ్‌ఫింగర్ సినిమాలో ఇది కనిపించింది. ఇది అప్పట్లో అఫీషియల్ బాండ్ కారుగా చెలామణీలోకి వచ్చింది. అప్పట్నుంచి 11 బాండ్ సినిమాల్లో ఈ కార్లు దర్శనమిచ్చాయి.
ఒమేగా వాచ్..
బాండ్ చేతికి ప్రారంభంలో రోలెక్స్ వాచీలు కనిపించేవి. అయితే, 1995 తర్వాత నుంచి ఆ స్థానాన్ని ఒమేగా బ్రాండ్ ఆక్రమించింది. కెసినో రాయల్ సినిమాలో ఇందుకు సంబంధించి సంభాషణ కూడా ఉంటుంది. లేటెస్ట్‌గా స్పెక్టర్ సినిమాలో బాండ్ వాడిన ఒమేగా వాచ్ వేలంలో 92,500 యూరోలు పలికింది.
టామ్ ఫోర్డ్ సూటు..
క్వాంటమ్ ఆఫ్ సొలేస్ సినిమా నుంచి జేమ్స్ బాండ్ అధికారిక టైలర్‌గా బ్రియోనీ స్థానాన్ని టామ్ ఫోర్డ్ దక్కించుకుంది. అప్పట్నుంచీ టామ్ ఫోర్డ్ సూట్లకు బాండ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. వేలంలో ఈ సూటు కు 27,500 యూరోలు దక్కాయి. ఇంకా మిగిలి ఉన్న వాటిని ఆన్లైన్ లో ఈ నెల 23 వరకు వేలంలో ఉంచారు. మీరు కూడా ప్రయత్నించాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
బాండ్ వాడిన వస్తువులకు వేలంలో పలికిన ధరలు
ఆస్టన్ మార్టిన్ డీబీ10- 2,434,500 యూరోలు
ఒమేగా వాచ్ -92,500 యూరోలు
టామ్ ఫోర్డ్ డిన్నర్ సూట్- 27,500 యూరోలు
ఒబెర్హా యూజర్స్ స్పెక్టర్ రింగ్ - 32,500యూరోలు
డెడ్ కాస్ట్యూమ్స్ -98,500 యూరోలు