కాగ్ మాట వినాల్సిందే! | Court directs Delhi discoms to cooperate with CAG | Sakshi
Sakshi News home page

కాగ్ మాట వినాల్సిందే!

Published Mon, Mar 24 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

Court directs Delhi discoms to cooperate with CAG

న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిటింగ్ సహకరించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఢిల్లీ హైకోర్టు డిస్కమ్‌లకు స్పష్టం చేసింది. ఈ మేరకు టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్), రిలయన్స్ అడాగ్‌కు చెందిన బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి ఎస్ మృదుల్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది.
 
కాగ్ ఆడిటింగ్ నిలిపివేతపై స్టే మంజూరు చేయాలన్న మూడు డిస్కమ్‌ల విజ్ఞప్తి తోసిపుచ్చింది. ఈ కంపెనీల అభ్యర్థనలు, వీటికి కాగ్ ఆడిటింగ్ కోరుతూ ఒక స్వచ్ఛందసంస్థ దాఖలు చేసిన పిటిషన్లంటిపై మే ఒకటిన విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, వాదనలను అప్పటి వరకు సిద్ధం చేసుకోవాలని సూచించింది.
 
కాగ్ ఆడిటింగ్‌ను నిలిపివేయడానికి తిరస్కరిస్తూ జనవరి 24న ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ మూడు డిస్కమ్‌లు పిటిషన్ దాఖలు చేశాయి. కాగ్ అడిగిన పత్రాలన్నింటినీ తప్పకుండా అందజేయాలని కూడా దిగువకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా నివేదికను విడుదల చేయవద్దని న్యాయమూర్తి కాగ్‌ను ఆదేశించారు.
 
తమ ఖాతాలకు కాగ్ అడిటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి స్వచ్ఛంద సంస్థ, నివాసుల సంక్షేమ సంఘా సంయుక్త కార్యాచరణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని డిస్కమ్‌లు కోరాయి. దీనికి కమిటీ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ డిస్కమ్‌లు ఆడిటింగ్ రద్దు కోరుతున్నాయని కాబట్టి తమ పిటిషన్‌ను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
 
విద్యుత్ పంపిణీ సంస్థల ఖాతాల్లో అవకతవకలు ఉన్నట్టు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) స్వయంగా ప్రకటించిందని, బాధ్యులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
 
ఈ సందర్భంగా కాగ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆడిటింగ్ ప్రక్రియకు డిస్కమ్‌లు సహకరించడం లేదని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ వాదనతో విభేదించిన డిస్కమ్‌లు, తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని స్పష్టీకరించాయి. ఆడిటింగ్ కోసం కాగ్‌కు ఇప్పటికే 10 వేల పత్రాలు సమర్పించామని తెలిపాయి.
 
వీటి ఖాతాల్లో పలు అవకతవకలు ఉన్నందున సీబీఐ దర్యాప్తు లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానానికి విన్నవించారు. నష్టాలు వచ్చాయంటూ డిస్కమ్‌లు చూపించిన కాకిలెక్కలను నమ్మిన షీలా దీక్షిత్ ప్రభుత్వం, కరెంటు టారిఫ్ పెంపునకు అనుమతించిందని నివాసుల సంక్షేమ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆరోపించింది.
 
రాజధానిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించాలని షీలా దీక్షిత్ ప్రభుత్వం నిర్ణయించడంతో 2002 నుంచి ఈ మూడు డిస్కమ్‌లు కరెంటు పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ఇవి ఖాతాలను తారుమారు చేసి దొంగ లెక్కలు చూపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.
 
డీఈఆర్సీ సైతం ఈ వాదనను సమర్థిస్తూ టారిఫ్ తగ్గించవచ్చని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే డిస్కమ్‌ల ఖాతాలకు ఆడిటింగ్ జరిపిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం తెలిసిందే. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం డిస్కమ్‌ల ఖాతాలపై కాగ్ ఆడిటింగ్‌కు ఆదేశాలు జారీ చేయడంతోపాటు, విద్యుత్ బిల్లులపై 50 శాతం ప్రకటించింది.
 
ఇదిలా ఉంటే..డిస్కమ్‌లు ఇటీవల ఇంధన సర్దుబాటు చార్జీలను కూడా భారీగా పెంచడంతో నగరవాసిపై భారం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే తాము ఆడిటింగ్‌కు సహకరించడంతో లేదంటూ కాగ్ మరోసారి సోమవారం హైకోర్టుకు ఫిర్యాదు చేయడంపై బీఎస్‌ఈఎస్ రాజధాని విస్మయం వ్యక్తం చేసింది. కాగ్ ఆడిటర్లకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, ఇందుకోసం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement