The Delhi High Court
-
పొగాకు ఉత్పత్తుల నిషేధంపై సంజాయిషీ ఇవ్వండి
- పభుత్వాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు - మే 20 తదుపరి విచారణ - అంతవరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై - చర్యలు చేపట్టొద్దని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: నమిలే పొగాకు ఉత్పత్తులపై మార్చి 30 నుంచి విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ పొగాకు ఉత్పత్తుల తయారీదారులు దాఖలుచేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తి రాజీవ్ శక్దర్ ఢిల్లీ ఆహార భద్రతా కమిషనర్‌కు నోటీసు జారీ చేశారు. మే20న పిటిషన్‌పై తదుపరి విచారణ జరిపేంతవరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై ఎలాంటి చర్య చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాజధానిలో గుట్కా, ఖైనీ, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తుల అమ్మకం, నిల్వ, కొనుగోలుపై కేజ్రీవాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టివేయాలని కోరుతూ ఎస్కే టొబాకో ఇండస్ట్రీస్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ ఆదేశాన్ని ఇచ్చింది. ఆహారభద్రత, ప్రమాణాలు చట్టం కింద పొగాకు ఉత్పత్తులను నిషేధించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కనుక నిషేధాన్ని కొట్టివేయాలని పిటిషనర్ తరపున వాదించిన ప్రార్థనా సంపత్ పేర్కొన్నారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం వాటిని నిషేధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని పిటిషనర్ వాదించారు. కంపెనీ తయారుచేసిన లక్షల రూపాయల విలువైన ఉత్పత్తులు గోదాముల్లో, రిటైలర్ల వద్ద ఉన్నాయని, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిల్వలను విక్రయించే అవకాశాన్ని ఇవ్వకుండా నిషేధాన్ని అమల్లోకి తెచ్చిందని మరో న్యాయవాది కేవల్ సింగ్ అహూజా కోర్టుకు తెలిపారు. పొగవచ్చే ఉత్పత్తులను నిషేధించకుండా కేవలం పొగరాని ఉత్పత్తులనే నిషేధించడం వివక్ష పూరితమన్నారు. ప్రభుత్వం ప్రతీకారేచ్చతో, నిరంకుశంగా నమిలే పొగాకు ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని కొట్టివేయాలని ఆహూజా వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, మే20న తదుపరి విచారణ జరిగేంత వరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై ఎలాంటి చర్య చేపట్టరాదని తెలిపింది. -
ఆ 13 మంది సాక్షుల్ని మళ్లీ విచారించండి
ఉబర్ కేసులో హైకోర్టు న్యూఢిల్లీ: ఉబర్ కేసుకి సంబంధించి 13 మంది సాక్షులను పునర్విచారణ చేయాలని ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివ్‌కుమార్ యాదవ్ చేసుకున్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సునీతా గుప్తా ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా, పునర్విచారణ చేయాల్సిన వారి జాబితాలో నిందితుడు శివ్‌కుమార్‌తో సహా 13 మంది ఉన్నారని కోర్టు తెలిపింది. అలాగే ఈ కేసును పరిశీలించిన దర్యాప్తు అధికారులను, వైద్యులను కూడా మళ్లీ విచారించడానికి అనుమతినిచ్చింది. తద్వారా పారదర్శక విచారణ చేసినట్టు అవుతుందని వివరించింది. సీఆర్పీసీ 309 ప్రకారం రోజువారీ పద్ధతిలో సాక్షుల్ని విచారించాలని చెప్పింది. దీంతో ఈ కేసులో సాక్షులుగా ఉన్న 2, 3, 4, 9, 12, 13, 14, 16, 20, 22, 24, 26, 27 నంబర్ల వారిని కోర్టు ఆదేశంతో తదుపరి విచారణ చేయనున్నారు. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా సాక్షులు కోర్టుకి అందుబాటులో లేకుంటే వారి వాంగ్మూలాన్ని ఉన్నదిఉన్నట్టుగా చదివి దానిని సాక్ష్యంగా పరిగణించాలని తెలిపింది. విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిండం వల్ల చేకూరేది ఏమీ ఉండదని నిందితునికి చెప్పింది. దాని వల్ల ఇంకా ఎక్కువ కాలం కస్టడీలో మగ్గాల్సి వస్తుందని పేర్కొంది. సాక్షుల పునర్విచారణ కోసం నిందితుడు చేసుకున్న అప్పీలుని ట్రయిల్ కోర్టు ఫిబ్రవరి 18న తిరస్కరించింది. దీంతో నిందితుడు హైకోర్టుని ఆశ్రయించాడు. నిందితుడి అప్పీలుని విచారించి, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు తీర్పు వెలువరించొద్దని ట్రయిల్ కోర్టుని ఫిబ్రవరి 25న హైకోర్టు ఆదేశించింది. 28 మంది సాక్షుల్ని మళ్లీ విచారించాలని కోరుతూ తన న్యాయవాది మిశ్రా ద్వారా నిందితుడు హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ, వెంటనే మిశ్రా కొంత దిగివచ్చి 28 మంది సాక్షులు కాకుండా, నిందితునితో కలిపి 13 మందిని విచారించేలా ఆదేశాలివ్వాలని కోరారు. డీఎన్ఏ రిపోర్టుతో సహా కొన్ని సాక్ష్యాలు పూర్తిగా నిరాధారమైనవని నిందితుడు కోర్టుకి విన్నవించాడు. వాటిని కావాలని సృష్టించారని తెలిపాడు. సాక్షుల నుంచి మరోసారి వాంగ్మూలం సేకరించేంత వరకు జరుగుతున్న విచారణను ఆపాల్సిందిగా మిశ్రా కోరారు. నిందితుడి ఆరోపణలను ఢిల్లీ పోలీసు తరఫు న్యాయవాది రాజేశ్ మహాజన్ వ్యతిరేకించాడు. విచారణ వేగంగా జరుగుతోందని, ఒకవేళ నిందితుడి అప్పీలుని పరిగణలోకి తీసుకుని పునర్విచారణకి ఆదేశిస్తే విచారణ మందగిస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహాజన్ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. డిసెంబర్ 5న ఉబర్ సంస్థకి చెందిన క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. సంచలనం రేపిన ఈ సంఘటనలో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు అతనిపై జనవరి 13న రేప్, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసులతో చార్జిషీట్ నమోదు చేశారు. విచారణను 15న ప్రారంభించి, 28 మంది సాక్ష్యుల నుంచి 17 రోజుల్లో వాంగ్మూలాన్ని ట్రయిల్ కోర్టు సేకరించింది. -
షియోమీ ఫోన్ల అమ్మకాల నిలిపివేత
న్యూఢిల్లీ: చైనాకి చెందిన షియోమీ మొబైల్స్ విక్రయాలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్ వేసింది. భారత్‌లో వీటి విక్రయాలను నిలిపివేయాలంటూ షియోమీతో పాటు ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశిస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎరిక్సన్ సంస్థకి చెందిన టెక్నాలజీ పేటెంట్ హక్కులను షియోమీ ఉల్లంఘిస్తోందన్న అభియోగాలు ఇందుకు కారణం. దీంతో, షియోమీ ఫోన్ల దిగుమతులను నిరోధించాలని కస్టమ్స్ అధికారులను కూడా హైకోర్టు ఆదేశించింది. ఇప్పటిదాకా భారత్‌లో విక్రయించిన ఫోన్ల సంఖ్య తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా షియోమీ, ఫ్లిప్‌కార్ట్‌లను ఆదేశించింది. షియోమీ, ఫ్లిప్‌కార్ట్ కార్యాలయాలను పరిశీలించేందుకు ముగ్గురు స్థానిక కమిషనర్లను సైతం కోర్టు నియమించింది. వీరి ఖర్చులకయ్యే దాదాపు రూ. 3.5 లక్షల మొత్తాన్ని ఎరిక్సన్ భరించాలి. నాలుగు వారాల్లోగా కమిషనర్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. -
యూపీఎస్సీపై పిల్కూ తిరస్కృతి
రేపే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రెండో పేపర్లో ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగం ప్రశ్నలను అభ్యర్థులు వదిలివేయవచ్చన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్ణయంపై దాఖలైన పిల్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సివిల్స్ పరీక్షకు హాజరవుతున్న నగ్వాన్ అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చే శారు. అయితే వ్యక్తిగత కారణంపై కోర్టుకు వచ్చారని, ఇది ప్రజాప్రయోజనవ్యాజ్యం ఎలా అవుతుందం టూ కోర్టు ప్రశ్నించింది. ఇంతకుముందు ఇలాంటి పిటిషన్నే వేరే ధర్మాసనం ముందు దాఖలు చేశారని పేర్కొంటూ అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వ్యతిరేకించటంతో ఈ అంశంపై క్యాట్‌ను ఆశ్రయించాలని కోర్టు సూచించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. కొత్త విధానం ప్రకారం ప్రిలిమ్స్ రెండో పేపర్(సీశాట్-2)లో ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి సంబంధించిన మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోరని కేంద్రం తెలిపింది. దృష్టిలోపం ఉన్నవారికి అదనపు సమయం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న దృష్టిలోపం గల అభ్యర్థులకు ప్రతి పేపర్‌కు 40 నిమిషాల చొప్పున అదనపు సమయం ఇవ్వనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సివిల్స్-2011 అభ్యర్థులకు మరో చాన్స్... 2011లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అదనపు అవకాశం ఇవ్వనున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. -
నిషేధం ఎత్తివేయలేం..
ఈ రిక్షాలపై కేసులో న్యాయస్థానం స్పష్టీకరణ అఫిడవిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం విధివిధానాల ఖరారుకు రెండు నెలల గడువు కోరిన సర్కార్ కుదరదన్న కోర్టు..తాత్కాలిక పద్ధతిలోనైనా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని హితవు మోటారు వాహన చట్టం కిందకు తేనున్నట్లు పేర్కొన్న కేంద్రం తదుపరి విచారణ 11 వ తేదీన న్యూఢిల్లీ: ఈ రిక్షాలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు వాటిపై గతంలో తాను విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించింది. బ్యాటరీతో నడిచే ఈ రిక్షాల నియంత్రణకు మార్గదర్శకాలను ఖరారు చేయడానికి రెండు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ రిక్షాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్, బీమాకు సంబంధించిన అంశాలు స్పష్టమయ్యేంతవరకు వాటిని నగర రోడ్లపై తిరగడానికి అనుమతించబోనని స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణను న్యాయస్థానం సోమవారం కొనసాగించనుంది. ఈ రిక్షాచోదకుల జీవనోపాధి గురించి అంత ఆందోళన చెందుతున్నట్లుయితే వాటికి సంబంధించిన మార్గదర్శకాలను తొందరగా ఎందుకు రూపొందించడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ రిక్షాలపై నిషేధాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు బి.డి. అహ్మద్, సిద్ధార్థ మదుల్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను ధర్మాసనం పరిశీలించింది. ఈ రిక్షాలను మోటారు వాహన చట్టం కిందకు తెస్తామని ప్రభుత్వం అందులో పేర్కొంది. వాటికి మోటారు వాహన చట్టం ప్రకారం నష్టపరిహారం నిబంధనను వర్తింపచేస్తామని, ఈ రిక్షాలకు రిజిస్టేషన్,్ర చోదకులకు లెసైన్స్ తప్పనిసరి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. బ్యాటరీతో నడిచే ఈ రిక్షాల నియంత్రణకు రవాణా మంత్రిత్వశాఖ రూపొందించిన మార్గరదర్శకాల ముసాయిదాను ప్రభుత్వం న్యాయస్థానం ముందుంచింది. మార్గదర్శకాలను ఖరారు చేయడానికి రెండు నెలల వ్యవధి కావాలని, అంతవరకు ఈ రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. విధివిధానాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించవలసి ఉన్నందున, వాటి రూపకల్పనకు చర్చలు జరపవలసి ఉన్నందున రెండు నెలల సమయం అవసరమని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ రిక్షాలు గంటకు 25 కిమీల గరిష్ట వేగంతో నడుస్తాయని వాటిలో నలుగురు ప్రయాణికులు, 50 కిలోల బరువును మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ మున్సిపల్ ప్రాంతాలు, గ్రామ పంచాయతీల పరిధిలోనే ఈ రిక్షాలను అనుమతిస్తామని, అవి ఏయే రూట్లలో నడవాలనేది డీఎం, మున్సిపల్సంస్థలు , ఢిల్లీ పోలీసులు ఖరారు చేస్తారని అఫిడవిట్ తెలిపింది. ఈ రిక్షాలకు నామమాత్రంగానే రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేస్తామని, సులువుగా అర్థమయ్యేలా రిజిస్ట్రేషన్ ఫారం రూపొందిస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. 650 నుంచి 1000 వాట్లున్న ఈ రిక్షాలను అనుమతిస్తామని, డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన చోదకుల పేరు మీద మాత్రమే ఈ రిక్షాలను రిజిష్టర్ చేస్తామని, డ్రెవిైంగ్ లెసైన్స్‌ను మూడేళ్ల కోసారి రెన్యూవల్ చేస్తామని పేర్కొంది. మొదట్లో ఈ రిక్షాల రిజిస్ట్రేషన్ల కోసం శిబిరాలను ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం వివరించింది. ఈ రిక్షా ప్రమాద బాధితులకు మోటారు వాహనచట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుందని ప్రభుత్వం తెలి పింది. ఈ రిక్షాలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, అందువల్ల విధివిధానాల రూపకల్పనకు రెండునెల సమయం అవసరమవుతుందని ఆ అఫిడవిట్ పేర్కొంది. కానీ ప్రభుత్వం కోరినట్లుగా రెండునెలల గడువు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ రిక్షా చోదకుల జీవనోపాధి గురించి అంత ఆందోళన ఉన్నట్లయితే వెంటనే మార్గదర్శకాలను ఖరారు చేయాలని పేర్కొంది. దానికి వీలుకాకపోతే తాత్కాలిక రిజిస్ట్రేషన్, తాత్కాలిక లెసైన్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. కోర్టు సూచనలకు వెంటనే సమాధానమివ్వలేనని తనకు సమయం కావాలని ప్రభుత్వం తరపున హాజ రైన అదనపు సోలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కోరడంతో ఈ కేసుపై ఆగస్టు 11న విచారణ జరుపుతానని న్యాయస్థానం ప్రకటించింది. ఈ రిక్షాలను ఆదుకుంటాం: గడ్కరీ న్యూఢిల్లీ: హైకోర్టు ఆదేశాలనుసారం నగరంలో ఈ రిక్షాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రిక్షాల విషయం కోర్టులో ఉందని, ప్రభుత్వం తరఫున తమ సూచనలను కోర్టుకు నివేదించామని ఆయన తెలిపారు. -
‘రేప్ బాధితులకు 24 గంటల్లోగా పరిహారం’
న్యూఢిల్లీ: అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపులో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానంపట్ల ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితులకు 24 గంటల్లోగా పరిహారం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాలపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణలో భాగంగా హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. -
ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి ప్రమాణం
మహిళలకు న్యాయవ్యవస్థ అండ: జస్టిస్ రోహిణి మహిళా సాధికారతకు నిదర్శనం: నజీబ్ జంగ్ న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రానికి చెందిన జస్టిస్ జి.రోహిణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమె చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ జి.రోహిణిని ఢి ల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ రోహిణికి ముందు ఢిల్లీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ కూడా రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. జస్టిస్ రమణ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లారు. ప్రమాణ స్వీకారానంతరం జస్టిస్ రోహిణి మాట్లాడుతూ ఢిల్లీ హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు న్యాయవ్యవస్థ అండగా ఉంటుందని, ఢిల్లీ మహిళలకు తనవంతు సాయం చేయడంతో పాటు సహకారం అందిస్తాన ని చెప్పారు. లింగ వివక్ష ఉన్నప్పటికీ మహిళలు కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా తమ సత్తా చాటుతున్నారన్నారు. జస్టిస్ రోహిణి నియూమకం మహిళా సాధికారతకు నిదర్శనమని నజీబ్ జంగ్ పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రోహిణి నియామకంపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. జస్టిస్ రోహిణి 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యూరు. 2001లో అదనపు జడ్జిగా, 2002లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యూరు. -
జీఎంఆర్ ఏవియేషన్: డీజీసీఏ నిషేధంపై హైకోర్టు స్టే...
న్యూఢిల్లీ: ప్రైవేటు జెట్ సర్వీసు సేవలను అందించే జీఎంఆర్ ఏవియేషన్‌పై డీజీసీఏ విధించిన నిషేధంపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టేను మంజూరు చేసింది. ప్రస్తుత ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేను ఇస్తున్నట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. పౌర విమానయాన నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పదిమంది పెలైట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. పెలైట్లు శ్వాస సంబంధిత పరీక్షలు, ముందస్తు వైద్య పరీక్షలు చేసుకోనందుకు డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. -
కాగ్ మాట వినాల్సిందే!
న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిటింగ్ సహకరించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఢిల్లీ హైకోర్టు డిస్కమ్‌లకు స్పష్టం చేసింది. ఈ మేరకు టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్), రిలయన్స్ అడాగ్‌కు చెందిన బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి ఎస్ మృదుల్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది. కాగ్ ఆడిటింగ్ నిలిపివేతపై స్టే మంజూరు చేయాలన్న మూడు డిస్కమ్‌ల విజ్ఞప్తి తోసిపుచ్చింది. ఈ కంపెనీల అభ్యర్థనలు, వీటికి కాగ్ ఆడిటింగ్ కోరుతూ ఒక స్వచ్ఛందసంస్థ దాఖలు చేసిన పిటిషన్లంటిపై మే ఒకటిన విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, వాదనలను అప్పటి వరకు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కాగ్ ఆడిటింగ్‌ను నిలిపివేయడానికి తిరస్కరిస్తూ జనవరి 24న ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ మూడు డిస్కమ్‌లు పిటిషన్ దాఖలు చేశాయి. కాగ్ అడిగిన పత్రాలన్నింటినీ తప్పకుండా అందజేయాలని కూడా దిగువకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా నివేదికను విడుదల చేయవద్దని న్యాయమూర్తి కాగ్‌ను ఆదేశించారు. తమ ఖాతాలకు కాగ్ అడిటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి స్వచ్ఛంద సంస్థ, నివాసుల సంక్షేమ సంఘా సంయుక్త కార్యాచరణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని డిస్కమ్‌లు కోరాయి. దీనికి కమిటీ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ డిస్కమ్‌లు ఆడిటింగ్ రద్దు కోరుతున్నాయని కాబట్టి తమ పిటిషన్‌ను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఖాతాల్లో అవకతవకలు ఉన్నట్టు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) స్వయంగా ప్రకటించిందని, బాధ్యులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కాగ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆడిటింగ్ ప్రక్రియకు డిస్కమ్‌లు సహకరించడం లేదని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ వాదనతో విభేదించిన డిస్కమ్‌లు, తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని స్పష్టీకరించాయి. ఆడిటింగ్ కోసం కాగ్‌కు ఇప్పటికే 10 వేల పత్రాలు సమర్పించామని తెలిపాయి. వీటి ఖాతాల్లో పలు అవకతవకలు ఉన్నందున సీబీఐ దర్యాప్తు లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానానికి విన్నవించారు. నష్టాలు వచ్చాయంటూ డిస్కమ్‌లు చూపించిన కాకిలెక్కలను నమ్మిన షీలా దీక్షిత్ ప్రభుత్వం, కరెంటు టారిఫ్ పెంపునకు అనుమతించిందని నివాసుల సంక్షేమ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆరోపించింది. రాజధానిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించాలని షీలా దీక్షిత్ ప్రభుత్వం నిర్ణయించడంతో 2002 నుంచి ఈ మూడు డిస్కమ్‌లు కరెంటు పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ఇవి ఖాతాలను తారుమారు చేసి దొంగ లెక్కలు చూపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. డీఈఆర్సీ సైతం ఈ వాదనను సమర్థిస్తూ టారిఫ్ తగ్గించవచ్చని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే డిస్కమ్‌ల ఖాతాలకు ఆడిటింగ్ జరిపిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం తెలిసిందే. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం డిస్కమ్‌ల ఖాతాలపై కాగ్ ఆడిటింగ్‌కు ఆదేశాలు జారీ చేయడంతోపాటు, విద్యుత్ బిల్లులపై 50 శాతం ప్రకటించింది. ఇదిలా ఉంటే..డిస్కమ్‌లు ఇటీవల ఇంధన సర్దుబాటు చార్జీలను కూడా భారీగా పెంచడంతో నగరవాసిపై భారం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే తాము ఆడిటింగ్‌కు సహకరించడంతో లేదంటూ కాగ్ మరోసారి సోమవారం హైకోర్టుకు ఫిర్యాదు చేయడంపై బీఎస్ఈఎస్ రాజధాని విస్మయం వ్యక్తం చేసింది. కాగ్ ఆడిటర్లకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, ఇందుకోసం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపింది.