నిషేధం ఎత్తివేయలేం..
ఈ రిక్షాలపై కేసులో న్యాయస్థానం స్పష్టీకరణ
అఫిడవిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం
విధివిధానాల ఖరారుకు రెండు నెలల గడువు కోరిన సర్కార్
కుదరదన్న కోర్టు..తాత్కాలిక పద్ధతిలోనైనా
రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని హితవు
మోటారు వాహన చట్టం కిందకు తేనున్నట్లు పేర్కొన్న కేంద్రం
తదుపరి విచారణ 11 వ తేదీన
న్యూఢిల్లీ: ఈ రిక్షాలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు వాటిపై గతంలో తాను విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించింది. బ్యాటరీతో నడిచే ఈ రిక్షాల నియంత్రణకు మార్గదర్శకాలను ఖరారు చేయడానికి రెండు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ రిక్షాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్, బీమాకు సంబంధించిన అంశాలు స్పష్టమయ్యేంతవరకు వాటిని నగర రోడ్లపై తిరగడానికి అనుమతించబోనని స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణను న్యాయస్థానం సోమవారం కొనసాగించనుంది. ఈ రిక్షాచోదకుల జీవనోపాధి గురించి అంత ఆందోళన చెందుతున్నట్లుయితే వాటికి సంబంధించిన మార్గదర్శకాలను తొందరగా ఎందుకు రూపొందించడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ రిక్షాలపై నిషేధాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు బి.డి. అహ్మద్, సిద్ధార్థ మదుల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను ధర్మాసనం పరిశీలించింది. ఈ రిక్షాలను మోటారు వాహన చట్టం కిందకు తెస్తామని ప్రభుత్వం అందులో పేర్కొంది. వాటికి మోటారు వాహన చట్టం ప్రకారం నష్టపరిహారం నిబంధనను వర్తింపచేస్తామని, ఈ రిక్షాలకు రిజిస్టేషన్,్ర చోదకులకు లెసైన్స్ తప్పనిసరి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. బ్యాటరీతో నడిచే ఈ రిక్షాల నియంత్రణకు రవాణా మంత్రిత్వశాఖ రూపొందించిన మార్గరదర్శకాల ముసాయిదాను ప్రభుత్వం న్యాయస్థానం ముందుంచింది. మార్గదర్శకాలను ఖరారు చేయడానికి రెండు నెలల వ్యవధి కావాలని, అంతవరకు ఈ రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. విధివిధానాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించవలసి ఉన్నందున, వాటి రూపకల్పనకు చర్చలు జరపవలసి ఉన్నందున రెండు నెలల సమయం అవసరమని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ రిక్షాలు గంటకు 25 కిమీల గరిష్ట వేగంతో నడుస్తాయని వాటిలో నలుగురు ప్రయాణికులు, 50 కిలోల బరువును మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ మున్సిపల్ ప్రాంతాలు, గ్రామ పంచాయతీల పరిధిలోనే ఈ రిక్షాలను అనుమతిస్తామని, అవి ఏయే రూట్లలో నడవాలనేది డీఎం, మున్సిపల్‌సంస్థలు , ఢిల్లీ పోలీసులు ఖరారు చేస్తారని అఫిడవిట్ తెలిపింది. ఈ రిక్షాలకు నామమాత్రంగానే రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేస్తామని, సులువుగా అర్థమయ్యేలా రిజిస్ట్రేషన్ ఫారం రూపొందిస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. 650 నుంచి 1000 వాట్లున్న ఈ రిక్షాలను అనుమతిస్తామని, డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన చోదకుల పేరు మీద మాత్రమే ఈ రిక్షాలను రిజిష్టర్ చేస్తామని, డ్రెవిైంగ్ లెసైన్స్‌ను మూడేళ్ల కోసారి రెన్యూవల్ చేస్తామని పేర్కొంది. మొదట్లో ఈ రిక్షాల రిజిస్ట్రేషన్ల కోసం శిబిరాలను ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం వివరించింది. ఈ రిక్షా ప్రమాద బాధితులకు మోటారు వాహనచట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుందని ప్రభుత్వం తెలి పింది. ఈ రిక్షాలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, అందువల్ల విధివిధానాల రూపకల్పనకు రెండునెల సమయం అవసరమవుతుందని ఆ అఫిడవిట్ పేర్కొంది. కానీ ప్రభుత్వం కోరినట్లుగా రెండునెలల గడువు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ రిక్షా చోదకుల జీవనోపాధి గురించి అంత ఆందోళన ఉన్నట్లయితే వెంటనే మార్గదర్శకాలను ఖరారు చేయాలని పేర్కొంది. దానికి వీలుకాకపోతే తాత్కాలిక రిజిస్ట్రేషన్, తాత్కాలిక లెసైన్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. కోర్టు సూచనలకు వెంటనే సమాధానమివ్వలేనని తనకు సమయం కావాలని ప్రభుత్వం తరపున హాజ రైన అదనపు సోలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కోరడంతో ఈ కేసుపై ఆగస్టు 11న విచారణ జరుపుతానని న్యాయస్థానం ప్రకటించింది.
ఈ రిక్షాలను ఆదుకుంటాం: గడ్కరీ
న్యూఢిల్లీ: హైకోర్టు ఆదేశాలనుసారం నగరంలో ఈ రిక్షాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రిక్షాల విషయం కోర్టులో ఉందని, ప్రభుత్వం తరఫున తమ సూచనలను కోర్టుకు నివేదించామని ఆయన తెలిపారు.