- పభుత్వాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
- మే 20 తదుపరి విచారణ
- అంతవరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై
- చర్యలు చేపట్టొద్దని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: నమిలే పొగాకు ఉత్పత్తులపై మార్చి 30 నుంచి విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ పొగాకు ఉత్పత్తుల తయారీదారులు దాఖలుచేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తి రాజీవ్ శక్దర్ ఢిల్లీ ఆహార భద్రతా కమిషనర్‌కు నోటీసు జారీ చేశారు.
మే20న పిటిషన్‌పై తదుపరి విచారణ జరిపేంతవరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై ఎలాంటి చర్య చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాజధానిలో గుట్కా, ఖైనీ, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తుల అమ్మకం, నిల్వ, కొనుగోలుపై కేజ్రీవాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టివేయాలని కోరుతూ ఎస్‌కే టొబాకో ఇండస్ట్రీస్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ ఆదేశాన్ని ఇచ్చింది.
ఆహారభద్రత, ప్రమాణాలు చట్టం కింద పొగాకు ఉత్పత్తులను నిషేధించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కనుక నిషేధాన్ని కొట్టివేయాలని పిటిషనర్ తరపున వాదించిన ప్రార్థనా సంపత్ పేర్కొన్నారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం వాటిని నిషేధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని పిటిషనర్ వాదించారు. కంపెనీ తయారుచేసిన లక్షల రూపాయల విలువైన ఉత్పత్తులు గోదాముల్లో, రిటైలర్ల వద్ద ఉన్నాయని, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిల్వలను విక్రయించే అవకాశాన్ని ఇవ్వకుండా నిషేధాన్ని అమల్లోకి తెచ్చిందని మరో న్యాయవాది కేవల్ సింగ్ అహూజా కోర్టుకు తెలిపారు.
పొగవచ్చే ఉత్పత్తులను నిషేధించకుండా కేవలం పొగరాని ఉత్పత్తులనే నిషేధించడం వివక్ష పూరితమన్నారు. ప్రభుత్వం ప్రతీకారేచ్చతో, నిరంకుశంగా నమిలే పొగాకు ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని కొట్టివేయాలని ఆహూజా వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, మే20న తదుపరి విచారణ జరిగేంత వరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై ఎలాంటి చర్య చేపట్టరాదని తెలిపింది.
పొగాకు ఉత్పత్తుల నిషేధంపై సంజాయిషీ ఇవ్వండి
Published Sat, Apr 18 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement
Advertisement