Kejriwal government
-
తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో తరహాలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణలో బయటకువచ్చిన మధ్యవర్తుల ఆడియో టేపుల ద్వారా ఈ కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని తేలితే అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్‌చేశారు. శనివారం సిసోడియా ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ దళారిగా చెబుతున్న ఒక వ్యక్తి మాట్లాడిన ఆడియో టేప్‌ను మీడియాకు వినిపించారు. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు నేరుగా బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి’ అని సిసోడియా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రాజ్నా«థ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలతో నిందితుల్లో కొందరు దిగిన ఫొటోలను మీడియాకు సిసోడియా చూపించారు. రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ అనే మధ్యవర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎలా కుట్ర పన్నారో ఆడియో టేప్‌లో స్పష్టంగా వెల్లడైందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తూ ఢిల్లీలోనూ ఎమ్మెల్యేలను కొనే వ్యవహారాన్ని నడిపిస్తున్నామని ఆడియో టేప్‌లో వినిపించిన అంశాన్ని సిసోడియా ప్రస్తావించారు. ‘ఇంకో ఆడియోలో ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేల కొనుగోలు తతంగం కొనసాగుతోందన్నారు. అంటే అంతటి భారీమొత్తంలో బీజేపీ నగదు సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది’ అని అన్నారు. ‘ టేపుల్లో దళారులు అమిత్ షా పేరును పరోక్షంగా ప్రస్తావించడం తీవ్ర ఆందోళనకరం. షా ప్రమేయం ఉంటే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి. హోంశాఖ మంత్రి పదవి నుంచి తప్పించాలి. ఈడీ విచారణ చేపట్టాలి’ అని అన్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనే అలవాటున్న బీజేపీకి ఉన్న రాజకీయపార్టీ గుర్తింపును ఈసీ రద్దుచేయాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ డిమాండ్‌చేశారు. -
ఆ రోడ్డు ఖర్చు భరించలేం : ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి, ఢిల్లీ : నగరానికి తూర్పు, పశ్చిమ దిశలలో నిర్మిస్తున్న ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ రహదారికి అయ్యే భూసేకరణ ఖర్చును భరించలేమని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఖర్చును ప్రాజెక్టు వల్ల లబ్ది పొందే ఆయా రాష్ట్రాలే భరించాలని వాదించింది. వివరాలు.. ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా సిగ్నల్ ఫ్రీ రోడ్లను అభివృద్ధి చేయాలని 2005లో నిర్ణయించారు. ఈ రోడ్డు నగరానికి తూర్పు దిక్కున ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ పిరిధిలోకి వచ్చే ఘజియాబాద్, పరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (గ్రేటర్ నోయిడా), పాల్వాల్ల గుండా వెళ్తుంది. పశ్చిమ దిక్కున కుండ్లి, మానేసర్ల గుండా వెళ్తూ పాల్వాల్‌ను కలుపుతుంది. తూర్పు దిక్కున రహదారి ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, పశ్చిమ దిక్కున రహదారి హర్యానాలో ఉంది. 2005లో ఈ ప్రాజెక్టు భూసేకరణ వ్యయాన్ని 844కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం, ఉత్తర ప్రదేశ్, హర్యానాలు చెరో పాతిక శాతం భరించాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే అనూహ్య జాప్యం కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవగా, ఇప్పుడు అంచనా వ్యయం 8462 కోట్లకు చేరింది. 2005 నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 700 కోట్లు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, హర్యానాలు తమ వాటా సొమ్మును కొంచెం ఆలస్యంగా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పెరిగిన వ్యయం కారణంగా మిగిలిన రూ. 3500 కోట్లను ఢిల్లీ ప్రభుత్వం భరించాల్సిందేనని కేంద్రం గత నెలలో అపెక్స్ కోర్టుకు విన్నవించింది. కేంద్రంతో ఏకీభవించిన అపెక్స్ కోర్టు తక్షణం రూ. వెయ్యికోట్లను వాటా ప్రకారం చెల్లించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆప్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ విషయంపై శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ.. వ్యయాన్ని భరించే స్థోమత ప్రభుత్వానికి లేదని, అంతేకాక ఆలస్యానికి కారణమైన హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే ఈ వ్యయాన్ని భరించాలని తెలిపారు. రహదారి వెంబడి ఆయా రాష్ట్రాలు టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపడుతున్నాయి కనుక లబ్దిపొందుతుంది వారేనంటూ ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి లబ్ది కలగడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు తమ ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజల మీద వేసిన పర్యావరణ పన్ను ద్వారా వచ్చిన డబ్బు రూ. 900 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఈ నిధులను ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రాజెక్టు నుంచి మినహాయింపును కోరుతూ నెలరోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. -
కేజ్రీవాల్‌కు ఆదరణ పెరుగుతోంది: సర్వే∙
న్యూఢిల్లీ: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై ప్రజాదరణ పెరుగుతున్నట్లు ‘ఇండియా టుడే’ చేపట్టిన పొలిటికల్ స్టాక్ ఎక్ఛ్సేంజి సర్వేలో వెల్లడైంది. గత అక్టోబర్‌లో చేపట్టినప్పటి కంటే తాజా సర్వేలో 2 శాతం వరకు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగిందని తేలింది. సుమారు 49% మంది ప్రజలు కేజ్రీవాల్ పాలన సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించారు. తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు కేజ్రీవాల్ వైపే అత్యధికులు మొగ్గు చూపగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, మాజీ సీఎం షీలా దీక్షిత్ ఉన్నారు. ప్రధాని పదవికి మోదీకి 49% మంది, రాహుల్ 40% మంది అనుకూలంగా సమాధానమిచ్చారు. ఈ సర్వేను యాక్సిస్ మై ఇండియా సంస్థ 2018 డిసెంబర్ 27– 2019 జనవరి 3 మధ్య చేసింది. -
‘ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం’
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో...కాలుష్య నియంత్రణపై అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సరి, బేసి విధానం అమలు కాలంలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి అయిదు రోజుల పాటు అనగా నవంబర్ 17 వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది. ఉచిత ప్రయాణం విషయాన్ని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ధ్రువీకరించారు. ఈ విధానం వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందని ట్విట్ చేశారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు అదనంగా మరో 600 బస్సులను అద్దెకు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో సరి-బేసి విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది. To encourage use of public transport during Odd- Even, Delhi govt to allow free travel for commuters in all DTC and Cluster buses from 13-17 November. — Kailash Gahlot (@kgahlot) November 10, 2017 మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ...కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. సరి-బేసి విధానాన్ని పిక్నిక్లా వాడుకుంటున్నారని మండిపడింది. ఈ విధానం అమలు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నివారణ మండళ్లు నివేదిక ఇచ్చిందని, అయినా ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఎన్టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ప్రభుత్వమంటే నేనే..!
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు * ఎల్జీ, సీఎం కేజ్రీవాల్ మధ్య మరో నియామక వివాదం న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య నియామకాల విషయంలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో నియామకం వీరి మధ్య వివాదాన్ని రేపింది. ఢిల్లీ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా స్వాతి మలివాల్‌ను నియమిస్తూ కేజ్రీవాల్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని ప్రకటించడంతోపాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయం చేసిన వ్యాఖ్యలు ప్రకంపనాలు సృష్టించాయి. ‘ఢిల్లీలో ప్రభుత్వం అంటే నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్ గవర్నరే. ఉన్నతస్థాయి అధికారుల నియామకాలతోపాటు ముఖ్యమైన విషయాలను నిర్ణయించేది ఎల్జీనే’ అని జంగ్ కార్యాలయం ఒక లేఖను సీఎం కార్యాలయానికి పంపింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 239లో పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం నేషనల్ కేపిటల్ టెరిటరీకి ప్రభుత్వమంటే లెఫ్ట్‌నెంట్ గవర్నరే అని స్పష్టంచేసింది. ఆర్టికల్ 239ఏఏ ప్రకారమే ఎల్జీ నియామకం జరిగిందని వివరించింది. స్వాతి నియామకం నిబంధనలకు విఘాతం కలిగిస్తుందని, అందువల్ల దానికి చట్టబద్ధత లేదని స్పష్టంచేసింది. 30 ఏళ్ల స్వాతి రెండు రోజుల కిందట మహిళా కమిషన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, ఎల్జీ కార్యాలయం తాజాగా ఆమె నియామకాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఆమె అపాయింట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 29లోగా పంపాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిని ఎల్జీ కార్యాలయం ఆదేశించింది. అయితే, కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగానే స్పందించింది. ఈ నిర్ణయంపై పునరాలోచన ఉండదని, సీఎం కేజ్రీవాల్ రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఆమెను నియమించారని రవాణా మంత్రి గోపాల్ రాయ్ స్పష్టంచేశారు. ఆఫీసుకు తాళం వేస్తామన్నారు ఎల్జీ నజీబ్‌జంగ్ బుధవారం తనకు ఫోన్ చేసి రేపటి నుంచి ఆఫీసుకు రావొద్దని చెప్పారని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీనిపై వివరణ కోరగా... ఎల్జీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందని మాటమార్చారు. మరోవైపు జంగ్ కార్యాలయం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అయితే ఎల్జీ కార్యాలయం రాజ్యాంగబద్ధతను తాను గౌరవిస్తానని స్వాతి చెప్పారు. అయితే, ఇదేమంత పెద్దవిషయమేం కాదని, చాలా చిన్నదన్నారు. త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఢిల్లీపై కేంద్రం దాదాగిరి
న్యూఢిల్లీ: ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామన్న ఎన్నికల హామీపై బీజేపీ సారథ్యంలోని మోదీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కేజ్రీవాల్ సర్కారు ఆరోపించింది. కేంద్రం తమను భయపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆదివారం ‘ట్వీటర్’ ద్వారా స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డంపెట్టుకొని ఢిల్లీని నయానో భయానో పాలించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల హామీని నిలబెట్టుకోకుండా తమ ప్రభుత్వంపై దాదాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తమ సర్కారు చూస్తూ ఊరుకోబోదన్నారు. ఢిల్లీ దేశ రాజధాని అయినందున ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం వ్యక్తమైతే తప్ప పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించలేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పేర్కొన్న నేపథ్యంలో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీవాసులు సంతోషంగా ఉన్నారని సిసోడియా పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇష్టారీతిన ప్రభుత్వాన్ని నడుపుతున్న కేజ్రీవాల్: బీజేపీ సీఎం కేజ్రీవాల్ తన ఇష్టారీతిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని బీజేపీ ఢిల్లీశాఖ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. ఆప్ సర్కారు వంద రోజుల పాలనలో కేంద్రంతో సమన్వయంకన్నా ఎదురుదాడే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ సారథిగా తనను తాను కీర్తించుకునేందుకు కేజ్రీవాల్ ఇప్పటివరకూ రూ. 100 కోట్లకుపైగా ప్రచారానికి ప్రజాధనాన్ని ఖర్చు చేశారన్నారు. ఢిల్లీవాసులకు ఉచిత మంచినీరు, వైఫై సౌకర్యాలు కల్పిస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదని సతీశ్ గుర్తుచేశారు. -
పొగాకు ఉత్పత్తుల నిషేధంపై సంజాయిషీ ఇవ్వండి
- పభుత్వాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు - మే 20 తదుపరి విచారణ - అంతవరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై - చర్యలు చేపట్టొద్దని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: నమిలే పొగాకు ఉత్పత్తులపై మార్చి 30 నుంచి విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ పొగాకు ఉత్పత్తుల తయారీదారులు దాఖలుచేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తి రాజీవ్ శక్దర్ ఢిల్లీ ఆహార భద్రతా కమిషనర్‌కు నోటీసు జారీ చేశారు. మే20న పిటిషన్‌పై తదుపరి విచారణ జరిపేంతవరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై ఎలాంటి చర్య చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాజధానిలో గుట్కా, ఖైనీ, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తుల అమ్మకం, నిల్వ, కొనుగోలుపై కేజ్రీవాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టివేయాలని కోరుతూ ఎస్కే టొబాకో ఇండస్ట్రీస్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ ఆదేశాన్ని ఇచ్చింది. ఆహారభద్రత, ప్రమాణాలు చట్టం కింద పొగాకు ఉత్పత్తులను నిషేధించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కనుక నిషేధాన్ని కొట్టివేయాలని పిటిషనర్ తరపున వాదించిన ప్రార్థనా సంపత్ పేర్కొన్నారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం వాటిని నిషేధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని పిటిషనర్ వాదించారు. కంపెనీ తయారుచేసిన లక్షల రూపాయల విలువైన ఉత్పత్తులు గోదాముల్లో, రిటైలర్ల వద్ద ఉన్నాయని, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిల్వలను విక్రయించే అవకాశాన్ని ఇవ్వకుండా నిషేధాన్ని అమల్లోకి తెచ్చిందని మరో న్యాయవాది కేవల్ సింగ్ అహూజా కోర్టుకు తెలిపారు. పొగవచ్చే ఉత్పత్తులను నిషేధించకుండా కేవలం పొగరాని ఉత్పత్తులనే నిషేధించడం వివక్ష పూరితమన్నారు. ప్రభుత్వం ప్రతీకారేచ్చతో, నిరంకుశంగా నమిలే పొగాకు ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని కొట్టివేయాలని ఆహూజా వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, మే20న తదుపరి విచారణ జరిగేంత వరకు పొగాకు ఉత్పత్తుల విక్రేతలపై ఎలాంటి చర్య చేపట్టరాదని తెలిపింది. -
కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: కిరణ్ బేడీ
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ డిమాండ్ చేశారు. ఎన్నికైన ప్రభుత్వం అరాచకాన్ని పోత్సహిస్తోందని కేజ్రీవాల్ చర్యలను ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు సంపూర్ణ మద్దతు పలికిన కిరణ్ బేడీ ఇటీవల ప్రధాని పదవికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. అన్నా హజారే, కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె పాలు పంచుకున్న విషయం తెలిసిందే. ఆప్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఆమె మాట్లాడుతూ కుంభకోణాలను అంతం పలకాలని భావించే ఎవరు కూడా మరోసారి కాంగ్రెసు పార్టీకి ఓటేయరన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆయన జట్టును దేవుడు రక్షించాలని కూడా ఆమె అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో విలువలను మార్చిందని, ఇది దేశానికంతటికీ మంచిదని కిరణ్ బేడీ పేర్కొన్నారు.