ఢిల్లీపై కేంద్రం దాదాగిరి
న్యూఢిల్లీ: ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామన్న ఎన్నికల హామీపై బీజేపీ సారథ్యంలోని మోదీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కేజ్రీవాల్ సర్కారు ఆరోపించింది. కేంద్రం తమను భయపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆదివారం ‘ట్వీటర్’ ద్వారా స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డంపెట్టుకొని ఢిల్లీని నయానో భయానో పాలించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
ఎన్నికల హామీని నిలబెట్టుకోకుండా తమ ప్రభుత్వంపై దాదాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తమ సర్కారు చూస్తూ ఊరుకోబోదన్నారు. ఢిల్లీ దేశ రాజధాని అయినందున ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం వ్యక్తమైతే తప్ప పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించలేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పేర్కొన్న నేపథ్యంలో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీవాసులు సంతోషంగా ఉన్నారని సిసోడియా పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఇష్టారీతిన ప్రభుత్వాన్ని నడుపుతున్న కేజ్రీవాల్: బీజేపీ
సీఎం కేజ్రీవాల్ తన ఇష్టారీతిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని బీజేపీ ఢిల్లీశాఖ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. ఆప్ సర్కారు వంద రోజుల పాలనలో కేంద్రంతో సమన్వయంకన్నా ఎదురుదాడే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ సారథిగా తనను తాను కీర్తించుకునేందుకు కేజ్రీవాల్ ఇప్పటివరకూ రూ. 100 కోట్లకుపైగా ప్రచారానికి ప్రజాధనాన్ని ఖర్చు చేశారన్నారు. ఢిల్లీవాసులకు ఉచిత మంచినీరు, వైఫై సౌకర్యాలు కల్పిస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదని సతీశ్ గుర్తుచేశారు.