కిరణ్ బేడీ
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ డిమాండ్ చేశారు. ఎన్నికైన ప్రభుత్వం అరాచకాన్ని పోత్సహిస్తోందని కేజ్రీవాల్ చర్యలను ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు.
ఒకప్పుడు కేజ్రీవాల్‌కు సంపూర్ణ మద్దతు పలికిన కిరణ్ బేడీ ఇటీవల ప్రధాని పదవికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. అన్నా హజారే, కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె పాలు పంచుకున్న విషయం తెలిసిందే. ఆప్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఆమె మాట్లాడుతూ కుంభకోణాలను అంతం పలకాలని భావించే ఎవరు కూడా మరోసారి కాంగ్రెసు పార్టీకి ఓటేయరన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆయన జట్టును దేవుడు రక్షించాలని కూడా ఆమె అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో విలువలను మార్చిందని, ఇది దేశానికంతటికీ మంచిదని కిరణ్ బేడీ పేర్కొన్నారు.