కెరీర్, కుటుంబం...
వీటిలో విలువైనది ఏమిటి? అనే ప్రశ్నకు –
విలువైన జవాబు...
‘రెండిటినీ సమన్వయం
చేసుకొని ముందుకు వెళ్లడం’
కుటుంబ బాధ్యతల్లో పడి విలువైన కెరీర్‌ను కోల్పోతున్న ప్రతిభావంతులైన మహిళలలో ‘మామ్‌పవర్ 360’తో
స్ఫూర్తి నింపుతున్న లక్ష్మీ శేషాద్రి గురించి...
బిడ్డకు తల్లి అయిన తరువాత ‘కెరీరా?’ ‘కుటుంబమా?’ అనే డోలాయమాన స్థితి ఎంతోమంది మహిళలకు ఎదురవుతుంది. చాలామంది కుటుంబాన్నే ఎంపిక చేసుకుంటారు. కెరీర్‌కు గుడ్‌బై చెబుతారు. నిజానికి వారు తమ రంగాలలో ప్రతిభావంతులు, ఎన్నో విజయాలు సాధించాల్సిన వారు.
ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత జయశ్రీ ఉల్లాల్ ముందుకు ‘కుటుంబమా? కెరీరా?’ అనే ప్రశ్నలు వచ్చి నిలుచున్నాయి. కుటుంబం వైపే మొగ్గు చూపింది ఆమె మనసు. అయితే, ఆమె శక్తిసామర్థ్యాల గురించి తెలిసిన కుటుంబసభ్యులు ఇది సరికాదన్నారు. తన ప్రతిభ వృథా పోకూడదు అనుకున్నారు. జయశ్రీ మనసు మార్చుకుంది. కుటుంబ జీవితాన్ని, కెరీర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
జయశ్రీ ఉల్లాల్ కుటుంబ జీవితానికే పరిమితమై ఉంటే ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్’ జాబితాలో ఆమె చోటు సంపాదించేది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్ల తాను వదులుకున్న కెరీర్‌లోకి మళ్లీ వచ్చి దూసుకుపోయింది.
అయితే ఆ అదృష్టం చాలామందికి లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమైపోతున్నారు.
అలాంటి వారికి ‘మామ్‌పవర్ 360’ కొత్తశక్తిని ఇవ్వనుంది. లక్ష్మీశేషాద్రి ఈ సంస్థకు శ్రీకారం చుట్టింది. బెంగళూరుకు చెందిన లక్ష్మి ఇంజనీర్, సోషల్–ఎంటర్‌ప్రెన్యూర్, మిసెస్ ఇండియా యూనివర్స్–2016
మాతృత్వం తరువాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి ట్రాక్‌పై తీసుకురావడానికి ‘మామ్‌పవర్ 360’ ద్వారా కృషి చేస్తోంది లక్ష్మీ శేషాద్రి.
‘ఎంపవర్ మామ్స్ ఆన్ ఏ 360 లెవెల్’ అనేది ఆమె నినాదం.మాతృత్వం తరువాత కెరీర్‌ను వదులుకున్న ప్రతిభావంతులైన మహిళలను ఒకే వేదికపై తీసుకురావడానికి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ‘మామ్‌పవర్ 360’ క్రియాశీల పాత్ర పోషించనుంది.
‘మామ్ పవర్ కాన్ఫరెన్స్’ పేరుతో సదస్సులు నిర్వహిస్తారు. వీటికి ముఖ్య అతిథులుగా వివిధ రంగాలకు చెందిన మామ్–ఎచీవర్స్, మామ్–ఎంటర్‌ప్రెన్యూర్స్ హాజరవుతారు. తమ అనుభవాలను పంచుకుంటారు.
‘ఒకరితో ఒకరికి ఆత్మీయ సంభాషణకు వీలయ్యే అర్థవంతమైన వేదికకు రూపకల్పన చేయాలనేది నా లక్ష్యం. ఈ వేదికలో హోమ్‌మేకర్ మామ్, వర్కింగ్ మామ్, ఎంటర్‌ప్రైజింగ్ మామ్...ఉంటారు. మామ్‌పవర్ 360 ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో టాక్ టు ఇన్‌స్పైరింగ్ ఉమెన్ కార్యక్రమాలు నిర్వహిస్తాం.
కొత్త ఆలోచనలతో ముందడుగు వేయడానికి ఇవి ఉపకరిస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్‌కు నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా మామ్‌పవర్ ఉపయోగపడుతుంది’ అంటుంది లక్ష్మీ శేషాద్రి.
ప్యానల్‌లో కిరణ్ బేడి, రూప డి, నిరూప శంకర్, సిమ్రాన్ చోప్రా, గౌరీ కపూర్, డా.చైత్ర ఆనంద్, అను ప్రభాకర్, బిందు సుబ్రహ్మణ్యం... మొదలైన వారు ఉన్నారు. వృత్తి–వ్యకిగత జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అనే విషయంలో విలువైన సలహాలు ఇస్తారు. వీరితోపాటు ‘మదర్‌హుడ్ హాస్పిటల్స్’ టాప్ డాక్టర్స్, చైల్డ్ సైకాలజిస్ట్‌లు, ఫిట్‌నెస్, న్యూట్రిషన్, పేరెంటింగ్, రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్‌లు తమ సలహాలు అందిస్తారు.
‘గత రెండు సంవత్సరాలు...మహిళలకు కఠిన సమయం. ఇంటిపని, కుటుంబబాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో తమ శక్తిసామర్థ్యాల గురించి ఆలోచించే సమయం చిక్కడం లేదు. మామ్‌పవర్ 360 వేదిక ద్వారా తమను తాము పునరావిష్కరించుకునే అవకాశం మహిళలకు వస్తుంది’ అంటున్నారు మదర్‌హుడ్ హాస్పిటల్స్ సీయివో విజరత్న.
Comments
Please login to add a commentAdd a comment