స్త్రీలోక సంచారం | women empowerment : Delhi effect on Kiran Bedi | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Fri, Jul 6 2018 12:16 AM | Last Updated on Fri, Jul 6 2018 12:16 AM

women empowerment : Delhi effect on Kiran Bedi - Sakshi

పుదుచ్చేరి లñ ఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ నేడో, రేపో.. ఆ కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రి వేలు నారాయణస్వామిపై విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ మధ్య తెలెత్తిన వివాదాల కేసు విషయంలో.. ‘ప్రజాప్రతినిధుల పాలనా వ్యవహారాలకు గవర్నర్‌ అడ్డుతగలడం సరికాదు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ స్వామి ఉటంకిస్తూ, ఇది కిరణ్‌బేడీకి కూడా వర్తిస్తుందనీ, తన పాలనలో ఆమె జోక్యం చేసుకోవడం కోర్టు ధిక్కారం అవుతుందని అసందర్భంగా వ్యాఖ్యానించడంపై బేడీ ఆగ్రహంతో ఉన్నారు ::: కొద్ది రోజుల క్రితమే సోషల్‌ మీడియా నుంచి ‘క్విట్‌’ అయిన  ఉక్రెయిన్‌ సంతతి హాలీవుడ్‌ నటి మిలా క్యునిస్‌ (35) తనెందుకు క్విట్‌ అయిందీ తొలిసారిగా వెల్లడించారు. సోషల్‌ మీడియాను ‘లౌడెస్ట్, యాంగ్రీయస్ట్, మోస్ట్‌ నెగటివ్‌’ అని అభిప్రాయపడిన మిలా, ‘కాస్మోపాలిటన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి వేదికలు..  దారిన పోయే ప్రతి దానయ్య అభిప్రాయానికీ చోటు ఇవ్వడంతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం నరకప్రాయం అవుతోంది’ అని వ్యాఖ్యానించారు.

‘పోటస్‌’ (ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ స్టేట్స్‌) పదవికి జరిగే ఎన్నికల్లో తనెప్పటికీ పోటీ చేసేది లేదనీ, అదేమీ నిష్కళంకమైన వ్యవహారం కాదని అమెరికన్‌ ప్రముఖురాలు, మీడియా మొఘల్‌ ఓప్రా విన్‌ఫ్రే అన్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తను పోటీ చేసే అవకాశాలున్నాయని కొద్దికాలంగా పదే పదే వస్తున్న వార్తల్ని ఖండిస్తూ, ‘నీచమైన, నికృష్టమైన, మోసపూరిత, దగాకోరు, వెన్నుపోటు రాజకీయ వ్యవస్థ.. నాలాంటి వాళ్లను మింగేస్తుంది. అందులో నేను ఇమడలేను’ అని వోగ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు ::: మహిళల డ్రైవింగ్‌పై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని సౌదీ అరేబియా జూన్‌ 24న తొలగించి వారమైనా కాకుండానే, నిషేధం ఎత్తివేతకు నిరసనగా ఒక మహిళ కారును తగలబెట్టి, పారిపోయిన దుండగుల కోసం మక్కా పోలీసులు గాలిస్తున్నారు. ఓ షాపింగ్‌మాల్‌ బయట పార్క్‌ చేసి ఉన్న తన కారును ఎవరో ఆగంతకులు దగ్ధం చేశారని సల్మా అల్‌షెరీఫ్‌ అనే 31 ఏళ్ల ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదుపై గత వారం రోజులుగా నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు ::: దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌ జంగ్‌ సూక్‌.. సియోల్‌లోని ‘ఐవమ్‌ థియేటర్‌’లో చదువుతున్న భారతీయ విద్యార్థుల బృందాన్ని కలుసుకున్నారు.

ఈ నెల 8 నుంచి 11 వరకు భర్త మూన్‌ జే ఇన్‌ (దక్షిణ కొరియా అధ్యక్షుడు) తో పాటు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో విద్యార్థులతో ముచ్చటించిన సూక్‌.. వారితో కలిసి ‘దంగల్‌’ సినిమాను చూసిన సందర్భంలో ఆమిర్‌ ఖాన్‌వే తను గతంలో మరో రెండు సినిమాలు చూసినట్లు కూడా చెప్పారు ::: అన్నా మే బ్లెస్సింగ్‌ అనే 92 ఏళ్ల మహిళను ఆరిజోనా పోలీసులు అరెస్టు చేసి, ఐదులక్షల డాలర్ల పూచీకత్తుపై మాత్రమే ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడానికి వీలవుతుందని చెప్పడంతో తనను కారుణ్య మరణానికి అనుమతించమని ఆ వృద్ధ మహిళ విజ్ఞప్తి చేస్తున్నారు. తనను అనాథాశ్రమంలో చేర్చడానికి తన కొడుకు (72) చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకున్న అన్నా.. ఆ క్షణికావేశంలో అతడిని తుపాకీతో కాల్చి చంపడంతో ఆమెకీ పరిస్థితి దాపురించింది :::  బోన్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకుంటున్న మూడేళ్ల కాలిఫోర్నియా బాలిక స్కయ్‌ సర్వీన్‌ మెకార్మిక్‌.. అంతకుముందు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం తన ఎముకల్లోని మూలుగ (బోన్‌ మ్యారో)ను దానం చేసిన హేడన్‌ ర్యాల్స్‌ అనే యువతి పెళ్లికి ‘ఫ్లవర్‌ గర్ల్‌’గా వెళ్లింది. పూలగుత్తి పట్టుకుని పెళ్లి కూతురు పక్కన తోడుగా ఉండేందుకు రమ్మని.. సరిగ్గా ఆ చిన్నారి బర్త్‌డే రోజే పిలుపు రావడంతో స్కయ్‌ తల్లిదండ్రులు కృతజ్ఞతాపూర్వకమైన సమ్మతిని తెలియజేస్తూ, తమ కూతురికి పునర్జన్మనిచ్చిన హేడర్‌ ర్యాల్స్‌ పెళ్లికి వెళ్లి వచ్చారు ::: వజ్రాల ఆభరణాలను విక్రయించే ప్రముఖ ఆస్ట్రేలియన్‌–బ్రిటిష్‌ కంపెనీ ‘రియో టింటో’.. తమ భారతీయ వాణిజ్య రాయబారిగా ఇండియన్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ని ప్రకటించింది. ‘ఒకప్పుడు రాజులకు, రాణులకు మాత్రమే అందుబాటులో ఉన్న వజ్రాల ఆభరణాలు ఇప్పుడు సామాన్య పౌరులు కూడా కొనగలిగే ధరల్లో లభ్యం అవుతున్నాయని’.. ముంబైలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో మిథాలీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement