షియోమీ ఫోన్ల అమ్మకాల నిలిపివేత
న్యూఢిల్లీ: చైనాకి చెందిన షియోమీ మొబైల్స్ విక్రయాలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్ వేసింది. భారత్‌లో వీటి విక్రయాలను నిలిపివేయాలంటూ షియోమీతో పాటు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశిస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎరిక్సన్ సంస్థకి చెందిన టెక్నాలజీ పేటెంట్ హక్కులను షియోమీ ఉల్లంఘిస్తోందన్న అభియోగాలు ఇందుకు కారణం. దీంతో, షియోమీ ఫోన్ల దిగుమతులను నిరోధించాలని కస్టమ్స్ అధికారులను కూడా హైకోర్టు ఆదేశించింది.
ఇప్పటిదాకా భారత్‌లో విక్రయించిన ఫోన్ల సంఖ్య తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా షియోమీ, ఫ్లిప్‌కార్ట్‌లను ఆదేశించింది. షియోమీ, ఫ్లిప్‌కార్ట్ కార్యాలయాలను పరిశీలించేందుకు ముగ్గురు స్థానిక కమిషనర్లను సైతం కోర్టు నియమించింది. వీరి ఖర్చులకయ్యే దాదాపు రూ. 3.5 లక్షల మొత్తాన్ని ఎరిక్సన్ భరించాలి. నాలుగు వారాల్లోగా కమిషనర్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.