
‘‘రాజుగారింట్లో పెళ్లి.. ప్రజలంతా వెళ్లి కానుకలు సమర్పించాలి’’ అంటూ అప్పట్లో రాజ్యంలో దండోరా వేయించేవారు. ఒకప్పుడు రాజరికంలో ఇవన్నీ చెల్లుబాటు అయ్యాయి. కానీ.. ఇదే పద్ధతి ఇప్పుడూ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీంనగర్ కలెక్టరేట్‌లోని ఓ ప్రభుత్వ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్న అధికారి కూడా తన ఇంట్లో జరిగే పెళ్లికి కానుకల సేకరణకు ఇలాగే దాదాపుగా దండోరా వేయించినంత పనిచేశారు. అసలే జిల్లాలో ఓ శాఖకు విభాగాధిపతి.. పైగా అతని ఇంట్లో పెళ్లి.. సిబ్బంది కానుకలు సమర్పించి స్వామి భక్తి చాటుకునేందుకు.. ఇదే అద్భుత అవకాశమని ప్రచారం చేయించారు. ఈ వార్త వినగానే.. 15 మండలాలు, 313 గ్రామపంచాయతీల్లో కలకలం రేగింది. దీనిపై సిబ్బందిలో మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఇదే మంచి తరుణమని తమ స్వామి భక్తి ప్రదర్శించేందుకు సమాయత్తమవగా.. మరికొందరు ఇదెక్కడి తలనొప్పిరా బాబూ అంటూ తల పట్టుకున్నారు.
తగ్గేదేలే..!
► సదరు అధికారి ఇంట్లో పెళ్లి వేడుకకు ముందే.. కొందరు ఉద్యోగులు వసూలు చేసే బరువు బాధ్యతలను తమ భుజాలకు ఎత్తుకున్నారు.
► తొలుత జిల్లా కేంద్రంలో లిస్టు రెడీ చేసి ఆ మేరకు నగదు కానుకలను వసూలు చేశారు.
► ఆ తరువాత జిల్లాలోని ఆ విభాగానికి సంబంధించిన 15 మండలాల అధికారులకు, 313 గ్రామపంచాయతీ స్థాయిలో పనిచేసే తమ సిబ్బందికి తలా ఇంత అన్న టార్గెట్ విధించారు.
► కొందరు ససేమీరా అని ఇవ్వలేదు. మండలస్థాయి అధికారుల్లో కొందరు తలా తులం బంగారం ఇచ్చుకోగా.. మిగిలిన గ్రామస్థాయిలో నాలుగుదశల్లో పనిచేసే సిబ్బంది ప్రతీ మనిషి రూ.1000 నుంచి రూ.5000 వరకు సమర్పించుకున్నారు.
► కొందరు గ్రామీణ నేతలు, ప్రజాప్రతినిధులు, చోటా కాంట్రాక్టర్లు సైతం ఈ చదివింపుల మేళాలో పాలుపంచుకోవడం విశేషం.
► కొందరైతే విందుకోసం మేకలు, గొర్రెలు కూడా ఉడతాభక్తి కింద ఇచ్చినట్లు తెలిసింది.
► ఈ క్రమంలోనే కొన్నిచోట్ల సిబ్బంది నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు తెలిసింది. ఎవరో ఇంట్లో పెళ్లికి తామెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ఎదురు తిరగడంతో వసూల్ రాజాలు వెనుదిరిగినట్లు సమాచారం.
వేధింపులు మొదలు..!
ఈ వేడుకకు సహకరించని వారిపై సదరు విభాగాధిపతి కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. వారి సర్వీసు రికార్డులు తీసి మరీ వేధింపుల పర్వానికి తెరతీసినట్లు సిబ్బంది వాపోతున్నారు. సదరు అధికారి వాస్తవానికి ఈ పాటికే రిటైర్డ్ కావాల్సి ఉంది. కానీ.. ఇటీవల ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం పెంచడంతో మూడేళ్ల సర్వీసు కలిసి వచ్చింది. దీంతో అదనంగా కలిసి వచ్చిన అవకాశాన్ని ఇలా అక్రమార్జనలకు వాడుతున్నారని సిబ్బంది మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పలువురు సిబ్బందిని సంప్రదించగా.. చాలామంది వెల్లడించేందుకు జంకి వెనకడుగువేశారు. కొందరు మాత్రం నిజమేనని ధ్రువీకరించారు.
అయినా.. సదరు అధికారికి వ్యతిరేకంగా తాము ఎలాంటి ప్రకటనా చేయలేమని వాపోయారు. వాస్తవానికి కరీంనగర్ పట్టణంలో ఇలాంటి తంతు కొత్తదేం కాదు, గతేడాది కూడా ఓ నాయకుడి ఇంట్లో పెళ్లి సమయంలోనూ దాదాపుగా ఇదే జరిగింది. ప్రతీ సిబ్బంది తాము నిర్ణయించినంత మొత్తాన్ని వెంటనే అందజేయాలని కొందరు గ్రూపులీడర్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన ఆడియో సందేశం అప్పట్లో వైరల్‌గామారిన సంగతి తెలిసిందే.
చదవండి: అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి! కారణం ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment