చెప్పింది చెయ్యకపోతే తన్నమన్నాడు | Officer Pre Release Event | Sakshi
Sakshi News home page

చెప్పింది చెయ్యకపోతే తన్నమన్నాడు

Published Tue, May 29 2018 1:20 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Officer Pre Release Event - Sakshi

రామ్‌గోపాల్‌వర్మ, నాగార్జున, కావ్య, అమల, అఖిల్, మైరా సరీన్,

‘‘రాము (వర్మ) నీ కళ్లల్లో నీళ్లు కూడా తిరుగుతాయా? నాకు కనపడ్డాయి. తెలుగు ఇండస్ట్రీ బిఫోర్‌ అండ్‌ ఆఫర్ట్‌ ‘శివ’ అంటారు. ‘శివ’ నీకు(వర్మ) బ్రేక్‌ ఇస్తే నాకు అమలని ఇచ్చింది. ఇంత ఏజ్‌ వచ్చినా అంత యంగ్‌గా కనిపిస్తున్నాడని అంటున్నారు. ఏజ్‌ గురించి మాట్లాడటం మానేండయ్యా బాబూ. ఐ యామ్‌ స్టిల్‌ యంగ్‌. ఇందాకే చైతన్య అన్నాడు కదా బ్రదర్‌ అని (నవ్వుతూ)’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, మైరా సరీన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్‌’. కంపెనీ ప్రొడక్షన్‌ హౌస్‌పై రామ్‌గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జూన్‌ 1న విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగార్జున మాట్లాడుతూ – ‘‘ఆఫీసర్‌’ టీమ్‌ అంతా యంగ్‌ బ్లడ్‌. వారితో పనిచేస్తుంటే చాలా ముచ్చటేసింది. రాము ‘ఆఫీసర్‌’ కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్‌ అయ్యా. దేశానికి సేవ చేసే ఓ పోలీసాఫీసర్‌ని మనం ఎలా చూడాలనుకుంటామన్నదే కథ. ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రాము ఓ పెద్ద ప్రామిస్‌ చేస్తూ లెటర్‌ రాశాడు. నేను చెప్పింది చెయ్యకపోతే నన్ను తన్నమన్నాడు. రాము నిన్ను తన్నాల్సిన అవసరం లేదు. తన్నను.. డోంట్‌వర్రీ(నవ్వుతూ).

ఈ సినిమాకి చిత్తశుద్ధితో పనిచేశాడు. ‘ఆఫీసర్‌’ చూశా. ఈ సినిమా నీకు(వర్మ) హిట్‌ ఇస్తుంది. గుండెల్ని టచ్‌ చేస్తుంది. నీ మాట నిలబెట్టుకున్నందుకు థ్యాంక్యూ వెరీమచ్‌ రాము. యాక్షన్‌ సీన్స్‌ రియల్‌గా ఉంటాయి. చివరి 20నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ ఔట్‌స్టాండింగ్‌.  చాలా రోజుల తర్వాత ఒక రియల్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌ ఫిలిం ఈజ్‌ కమింగ్‌ ఫర్‌ ఆల్‌ ఆఫ్‌ యు. జూన్‌ 1 పిడికిలి బిగించండి. ’’ అన్నారు. ‘‘ఆఫీసర్‌’ ట్రైలర్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జూన్‌ 1న థియేటర్లలో సినిమా చూస్తాం’’ అన్నారు అమల. ‘‘ఆఫీసర్‌’ సినిమాని నాన్న ఎంత ఎంజాయ్‌ చేస్తూ చేసేవారో చెప్పేవారు.

సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. అక్కినేని అభిమానులకు ఈ ఏడాది చాలా బాగుంటుంది. మీరు ఇచ్చిన ప్రతి సౌండ్‌కి కచ్చితంగా ఒక రీసౌండ్‌ ఉంటుంది’’ అన్నారు హీరో నాగచైతన్య. ‘‘ఆఫీసర్‌’ సినిమా గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ కొంచెం ఫుటేజ్‌ చూశా. 25–30 ఏళ్ల కిందట నాన్నగారు –రాముగారు ఎంత ఎనర్జీతో పనిచేశారో ‘ఆఫీసర్‌’ సినిమాకీ అంతే ఎనర్జీతో, అదే ప్యాషన్‌తో పనిచేశారు. మిమ్మల్ని మా యంగ్‌స్టర్స్‌ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి’’ అన్నారు అఖిల్‌. ‘‘నాగ్‌సార్‌తో స్క్రీన్‌ పంచుకోవడం, ఆర్జీవీగారితో పనిచేయడం అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు మైరా సరీన్‌.


రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘నేను క్రైం డ్రామాస్‌.. రౌడీయిజం, యాక్షన్‌ ఫిల్మ్స్‌ ఇష్టపడటానికి మెయిన్‌ రీజన్‌.. చిన్నప్పుడు క్లాస్‌రూంలో వెనుకబెంచీలోనుంచి చాక్‌పీస్‌లు విసిరేవాళ్లని,  ï ముందు బెంచీల్లోని వారి జుట్టు లాగే వాళ్లని హీరోల్లా చూసేవాణ్ని. ఓ దశలో వీధి రౌడీల్లో, గ్యాంగ్‌స్టర్స్, ఫ్యాక్షనిష్టుల్లో హీరోలని చూశా. అందరు క్రిమినల్స్‌ అయిపోయాక ఆఫీసర్స్‌ని క్రిమినల్స్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. క్రిమినల్స్‌ నుంచి సొసైటీని కాపాడటం పోలీసాఫీసర్స్‌ బాధ్యత.

ఈ సినిమాలో హీరో యూనిఫాం లేకుండా ఎందుకు అంత యాక్షన్‌ చేయాల్సి వచ్చిందంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. బాంబేలో రియల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ చెప్పిన దాంట్లో నుంచి ఓ పాయింట్‌తో కథని రెడీ చేసుకోగానే నా మైండ్‌లో ఫస్ట్‌ నాగార్జున గుర్తొచ్చాడు. నేనెప్పుడూ పుణ్యాలు చేయలేదు.. పెద్దల్ని గౌరవించలేదు.. దేవుణ్ని పూజించలేదు. ఏ మంచీ నేను చేయకపోయినా నా లైఫ్‌లో నాకు నాగార్జున అనే మంచోడు దొరికాడు. నా గత జన్మలో ఏవైనా మంచి పనులు చేశానేమో.

నా తొలి సినిమా ‘శివ’తో నాకు బ్రేక్‌ ఇచ్చింది నాగార్జునే అని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నేను అటూ ఇటూ వెళ్లిపోయి ట్వీట్లు చేసేసి కాంట్రివర్సీలకి వెళ్లిపోయి.. అంటే పూర్తీగా బయటకి వచ్చేశానని కాదు.. నేనొక అడవి గుర్రంలాంటోణ్ని. అటూ ఇటూ పరిగెడుతుంటాను. ఒక్కసారి పట్టుకుని ఆపితే మళ్లీ ఆ గుర్రం అలా పరిగెత్తదు. నాగార్జున నాకు స్టీరింగ్‌ వీల్‌లా అయిపోయారు. ‘ఆఫీసర్‌’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. 100 పర్సెంట్‌ కమిట్‌మెంట్‌తో పనిచేశా.

అది మీరు ఈ చిత్రంలో చూస్తారు. ఒక హిట్‌ ఫిల్మ్‌కి చాలా రీజన్స్‌ ఉంటాయి. ఫ్లాప్‌ అయితే దానికి కారకుడు డైరెక్టరే. ‘ఆఫీసర్‌’ చిత్రంలో హీరో నటన చాలా ముఖ్యమైంది. నా ఊహల్లోని శివాజీ క్యారెక్టర్‌కి నాగ్‌ తన నటనతో రియాలిటీ తీసుకొచ్చారు. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్‌ అంతా నాగార్జునదే’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు రవిశంకర్, హీరో సుమంత్, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటుడు తనికెళ్ల భరణి  పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement