జేమ్స్ బాండ్ ఛేదిస్తాడు. రింకీ సేథీ బ్లాక్ చేస్తారు. బాండ్ కూపీకి వెళ్తాడు. రింకీ లోపలికే రానివ్వరు. ట్విట్టర్‌కి ఇప్పుడామె.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. నువ్వుగింజ సామెతల్ని తీసి పడేయండి. ఆవలిస్తే హ్యాకర్స్ పేగులు అంతే సంగతులు!మెడలో వేస్కుంటారు రింకీ. ఎంత పెద్ద బాండ్ హ్యాకర్స్ అయినా.
బయటికి వెళ్తుంటే ఆడవాళ్లకు మగవాళ్లు సెక్యూరిటీగా ఉండటం ఇప్పటికీ ఉంది. తండ్రి, అన్న, తమ్ముడు, భర్త ఎవరో ఒకరు భద్రంగా వెంట ఉంటారు. అయితే బయటి వెళ్లకూడని అత్యంత గోప్యమైన సమాచారానికి భద్రత కోసం మాత్రం ఈ డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కంపెనీలు మహిళల్నే చీఫ్‌లుగా ఎంపిక చేసుకుంటున్నాయి! కీలకమైన విషయాలను బయటికి పొక్కనివ్వకుండా కాపాడటంలో మహిళలే పురుషులకన్నా సమర్థులని, విశ్వసనీయులని మల్టీనేషనల్ సంస్థలు భావిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా జెయింట్ అయిన ‘ట్విట్టర్’ తన చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉండేందుకు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్న భారతీయురాలు రింకీ సేథీని ఆహ్వానించింది! ఒక మామూలు కంపెనీకి సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉండటం వేరు.
హ్యాకర్‌ల కళ్లన్నీ పాస్‌వర్డ్‌ల కోసం నిరంతరం బొరియలు తవ్వుతుండే ట్విట్టర్ వంటి కంపెనీకి భద్రతగా చేతులు అడ్డుపెట్టడం వేరు. ‘ఆడవాళ్ల నోట్లో ఆవగింజ నానదు’ అనే సామెత ఉంది. దాన్నిక పక్కన పెట్టేయొచ్చు. ఆవలిస్తే హ్యాకర్స్ పేగులు లెక్కపెట్టి మెడలో వేసుకుంటారు రింకీ. మునుపు ఆమె ఐబీఎం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్‌గా, కాలిఫోర్నియాలోని కంప్యూటర్ స్టోరేజ్ కంపెనీ ‘రూబ్రిక్’లో సీనియర్ ఆఫీసర్‌గా పని చేశారు.
రింకీ సేథీని తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ఎంతో ఉత్తేజపూర్వకంగా ప్రకటించింది. ‘‘రింకీ మా ఇన్‌ఫో సెక్షన్ టీమ్‌ని లీడ్ చేస్తారు. మా కస్టమర్‌ల డేటాకు, వ్యక్తిగత సమాచారానికి పూర్తి రక్షణగా ఉంటారు’’ అని రెండంటే రెండే లైన్‌లలో ఆమె సామర్థ్యాల పట్ల తమ నమ్మకాన్ని వెలిబుచ్చింది. ఐ.బి.ఎం., రూబ్రిక్‌లకు మాత్రమే కాదు, మిగతా ఫార్చూన్ 500 కంపెనీలైన పి.జి. అండ్ ఇ, వాల్‌మార్ట్ డాట్ కామ్, ఈబే సంస్థల కోసం కూడా గతంలో వినూత్నమైన ఆన్‌లైన్ సెక్యూరిటీ విధాలను అభివృద్ధిపరచి ఇచ్చారు రింకీ. 2010లో ప్రతిష్టాత్మకమైన ‘సీఎస్‌ఓ మ్యాగజీన్ అండ్ ఎగ్జికూటివ్ ఉమెన్స్ ఫోరమ్’ రింకీని ‘వన్ టు వాచ్’ అవార్డుతో సత్కరించింది.
ఈబేలో ఆమె నాయకత్వం వహించిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ బృందాన్ని మరో ప్రసిద్ధ మీడియా మ్యాగజీన్ ఎస్.సి.. టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేసింది. ఈ గుర్తింపులను అలా ఉంచితే, ఉత్తర అమెరికాలోని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘సెక్యూర్ వరల్డ్’ సలహా మండలిలో కూడా రింకీ సభ్యురాలిగా ఉండి వచ్చారు. ఆమె పని చేసిన సంస్థల్లానే, ఆమె చదివొచ్చిన యూనివర్శిటీలు అన్నీ కూడా అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగినవే. కాపెల్లా, స్టాన్‌ఫోర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు ఇష్టమైన పూర్వపు విద్యార్థులలో రింకీ సేథీ కూడా ఒకరు!
2019 డిసెంబర్ నుంచి సెక్యూరిటీ చీఫ్ లేకుండానే ట్విట్టర్ పనిచేస్తోంది. ఆ బాధ్యతకు రింకీ వంటి ప్రజ్ఞ గల టెకీని అన్వేషించే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడన్, అమెరికన్ మిలియనీర్ ఎలాన్ మస్క్, అమెరికన్ సోషలైట్ కిమ్ కర్దేషియన్, ఇంకా 150 మంది ట్విట్టర్ అకౌంట్‌లు హ్యాక్ అయి, వారి ప్రేమయం లేకుండా వారి పేరున డిజిటల్ విరాళాల సేకరణ మొదలైంది! ప్రముఖుల రహస్య సమాచారం ఇంత ఘోరంగా లీక్ అవడం ట్విట్టర్‌కు అప్రతిష్టను తెచ్చిపెట్టింది. మళ్లీ అలాంటివి జరక్కుండా ఉండేందుకు పురుష అభ్యర్థులు ఎందరు ముందుకు వచ్చినా, రింకీని మాత్రమే తన సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఎంపిక చేసుకుంది ట్విట్టర్! పద్నాలుగేళ్ల వయసులో రింకీ తొలిసారి తన పర్సనల్ కంప్యూటర్‌లోని చాట్‌లను తల్లిదండ్రులకు కనిపించకుండా చేసేందుకు ఒక విధానాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత పూర్తిగా ఆమె ఆ లైన్‌లోకే వెళ్లిపోయారు. డేటాను దుర్భేద్యంగా ఉంచే కెరీర్‌లోకి.
న్యూ నార్మల్!
భారతీయ మహిళల నాయకత్వ సామర్థ్యాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం అనేది ఇప్పుడొక సాధారణ విశేషంగా (న్యూ నార్మల్) కనిపిస్తోంది! అనేక రంగాల అత్యున్నత స్థాయులలో మన మహిళల ప్రతిభా సామర్థ్యాలు మన్నన పొందుతున్నాయి. 2019లో ప్రపంచ బ్యాంకు తన ఎండీగా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అన్షులా కాంత్‌ని నియమించుకుంది. గ్యాప్ ఇంక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సోనియా శింగాల్ పదవీబాధ్యతలు చేపట్టారు. 2018లో ‘పులిట్జర్ సెంటర్’కు ఇందిరా లక్ష్మణన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయ్యారు. గతవారమే మనాలీ దేశాయ్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ సోషియాలజీ విభాగం హెడ్‌గా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment