సాక్షి, రంగారెడ్డి జిల్లా: రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. న్యాయం చేయండయ్యా మహాప్రభో అని పోలీసు స్టేషన్ మెట్లెక్కిన పాపానికి అందినకాడికి దోచుకుంటున్నారు. దొంగల నుంచి సొత్తు రికవరీ చేసి చట్ట ప్రకారం బాధితులకు అందించాల్సిన వారే కొంత వాటా నొక్కేస్తున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వాళ్లపై చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఉల్టా(అక్రమ)కేసులు బనాయిస్తున్నారు. అంతేకాదు స్టేషన్‌లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు సైతం రక్షణ లేకుండా పోయింది. సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి డివిజన్‌లోని ఓ పోలీసు స్టేషన్ అధికారి తీరుకు ఇదీ నిదర్శనం.
అక్రమ కేసులు బనాయిస్తూ..
సదరు స్టేషన్ అధికారి సివిల్ తగాదాల్లో తల దూర్చుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఠాణా పరిధిలోని ఓ గ్రామంలో కొన్నేళ్ల క్రితం కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఈ స్థలం వెనకాల ఉన్న వారికి రహదారి లేకపోవటంతో..స్థానిక పోలీసు అధికారిని సంప్రదించి విషయాన్ని వివరించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు పోలీసు..భూ యజమానిని పిలిపించి రోడ్డు ఇవ్వాలని ఆదేశించాడు. ససేమిరా అని చెప్పిన ఓనర్.. తన వద్ద అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు అందించిన సర్వే రిపోర్టును సైతం చూపించాడు. తన స్థలాన్ని ఆక్రమించకుండా రేకుల షెడ్డును నిర్మించుకున్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న సదరు పోలీసు.. భూ యజమాని, అతని ముగ్గురు అనుచరులపై అక్ర మంగా కేసు నమోదు చేశాడు. బాధితులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గ్రామంలో చోటు చేసుకున్న ఓ చిన్నపాటి తగాదాలో పెద్ద మనిషిగా వెళ్లిన పాపానికి ఓ సర్పంచ్‌పై ఏకంగా మూడు కేసులు బనాయించడం గమనార్హం.
రాజీకొస్తే కేసులు నమోదు
ఇటీవల పక్క జిల్లాకు చెందిన కొందరు స్నేహితులు కలిసి మండలంలోని ఓ గ్రామంలో పార్టీ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు దోబిపేట వద్ద ప్రమాదానికి గురైంది. కేసు ఎందుకులే అని భావించిన ఇరు కార్ల యజమానులు రాజీ కుదుర్చుకొని వెళ్లిపోయారు. తన ప్రమేయం లేకుండా రాజీ కుదు ర్చుకుంటారా అని ఆగ్రహించిన సదరు పోలీసు..ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఇరువురి యజమానులను స్టేషన్‌కు పిలిపించి కేసు నమోదు చేయడం గమనార్హం. మరో ఘటనలో స్థానికంగా ఇద్దరు యువకుల మధ్య తగాదా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకొని స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి సమక్షం లో రాజీ కుదిర్చారు. ఘటనతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి మాటలు విని ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.
దొరికింది ఎంతో.. ఇచ్చింది అంతంతే..
ఇటీవల ఓ కుటుంబం తిరుపతికి వెళ్లింది. తిరిగొచ్చేసరికి దొంగలుపడ్డారు. 20 తులాల బంగారం, నగదు చోరీ జరిగింది. పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని పూర్తిగా బాధితులకు అందించలేదనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇదే విషయమై బాధితుడిని వాకబు చేయగా.. సదరు స్టేషన్ అధికారి రికవరీ చేసిన సొత్తులో కొంత నొక్కేశారని, మిగిలిన అరకొర బంగారం తనకెందుకంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే రెండు గ్రామాల్లో గొర్రెలు, మేకలు దొంగతనానికి గురికాగా.. కొన్నాళ్లకు దొంగలు దొరికారు.
ఈ కేసులోనూ పోలీసు అధికారి చేతివాటం ప్రదర్శించాడని తెలిసింది. పోలీస్ స్టేషన్‌లో కరెంట్ సమస్య ఉందని, జనరేటర్ ఏర్పాటు చేయాలని భావించిన పోలీసు.. స్థానిక స్థిరాస్తి వ్యాపారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసినట్టు సమాచారం. నేటికీ స్టేషన్‌లో జనరేటర్ మాత్రం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
మహిళా కానిస్టేబుల్‌తో అసభ్య ప్రవర్తన
స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుళ్లతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం క్రితం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు వచ్చిన సదరు పోలీసు.. అప్పుడే డ్యూటీ ముగించుకొని బయటకు వచ్చిన ఓ లేడీ కానిస్టేబుల్‌ను తన వాహనంలో ఎక్కాలంటూ ఆదేశించాడు. తాను వెళ్లిపోతానని, వద్దని వారించినా వినకుండా బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నాడు. ఈ తతంగాన్ని గమనిస్తున్న మరో కానిస్టేబుల్ వీడియో చిత్రీకరించాడు. దీంతో ‘నీకిక్కడేం పనంటూ వెళ్లిపో, మెమో జారీ చేస్తానని’ బెదిరించాడు. మరుసటి రోజు సదరు బాధితురాలు తోటి కానిస్టేబుళ్లతో జరిగిన విషయాన్ని వివరించింది. ప్రస్తుతం ఠాణాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
మూడు మెమోలు జారీ..
సదరు పోలీసు అధికారిపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా.. ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమేనని, ఇప్పటికే మూడు మెమోలు జారీ చేశామని తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) అంతర్గత విచారణ జరుగుతోందని, ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment