భీమవరం టౌన్: ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతున్న తీరు మనస్సును హత్తుకోవడంతో వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నాగులపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె.లక్ష్మీరెడ్డి తెలిపారు. భీమవరంలో డాక్టర్ ఎం.బాపిరాజు నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని, ఇక్కడ స్నేహితులు, ఆత్మీయులు ఎందరో ఉన్నారన్నారు.
1995–98లో జిల్లాలో పనిచేశానని, 2012లో సీనియర్ ఎస్పీగా మహబూబ్‌నగర్‌లో పదవీ విరమణ చేశానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నాడని, ఆయన ఆత్మస్థైర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. ఆదివారం వైఎస్ జగన్ సమక్షంలో తానుపార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కారాలు చూపుతున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల హృదయాల్ని గెలుచుకుంటున్నారన్నారు. తాను పార్టీలో ఏ పదవి ఆశించి చేరడం లేదన్నారు.
విశ్రాంత జీవితం గడుపుతున్న తనకు జగన్ పాదయాత్ర స్ఫూర్తి కలిగించిందన్నారు. తన సేవలను పార్టీ ఏ విధంగా వినియోగించుకుంటే ఆ విధంగా సహకరిస్తామన్నారు. రిటైర్డ్ రిజిస్ట్రార్, నెల్లూరు వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, ఏలూరు సీనియర్ న్యాయవాది బీవీ కృష్ణారెడ్డి, కడప జిల్లా రాజంపేటకు చెందిన గురుప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment