తలుపులు వేసి లోపలి నుంచి ఆగ్రహంగా చూస్తున్న విచారణాధికారి డీడీ శ్రీనివాసరావు,విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీపీ వరహాలమ్మ, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి
కోటవురట్ల(పాయకరావుపేట): విచారణకు వచ్చిన అధికారి ప్రవర్తన వివాదాస్పదమైంది. నోటి దురుసుతో ఫిర్యాదుదారులపై మండి పడి, బెదిరింపు ధోరణిలో వ్యవహరించడమే కాకుండా వివరణ కోరిన పాత్రికేయులపైనా దురుసుగా మాట్లాడి కాల్ ద పోలీసు అంటూ హడావుడి చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని సమన్వయ అధికారి డాక్టర్ వడ్డి శ్రీధర్‌పై ఎంపీపీ అయ్యపురెడ్డి వరహాలమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి ఏడాది క్రితం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు గతంలో ఒకసారి విచారణకు హాజరు కావాలని ఎంపీపీ వరహాలమ్మకు, జెడ్పీటీసీ వెంకటలక్ష్మికి విచారణాధికారి నోటీసులు పంపించి, విచారణ జరిపేందుకు ఆ అధికారి రాలేదు. మళ్లీ బుధవారం విచారణకు వస్తున్నట్టు నోటీసులు పంపడంతో ఎంపీపీ, జెడ్పీటీసీ హాజరయ్యారు. విచారణాధికారిగా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరై మొదటి నుంచి దురుసుగా ప్రవర్తించారు. సుమారు గంట సేపు ఫిర్యాదుదారులైన ఎంపీపీ వరహాలమ్మ, జెడ్పీటీసీ వెంకటలక్ష్మితో మాట్లాడి వారి వాదన నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పలువురు మండల స్థాయి అధికారులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం గదిలో నుంచి బయటకు రాగానే పాత్రికేయులు వివరణ కోరారు. పాత్రికేయులకు సమాధానమివ్వకుండా పశుసంవర్ధక శాఖ సిబ్బందిపై డీడీ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఒరేయ్ గేటు, తలుపులు వేసేయ్..ఎవడు పడితే వాడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు’ అంటూ మండిపడ్డారు. వివరాలు తెలపాలని పాత్రికేయులు కోరగా అవసరం లేదు, ఇక్కడి నుంచి పోతారా పోలీసులను పిలవాలా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నివేదిక కలెక్టర్‌కు ఇస్తాను..
ఎట్టకేలకు విచారణాధికారి శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడారు. విచారణ పూర్తయిందని, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు.
కోర్టును ఆశ్రయిస్తాం..
విచారణాధికారి శ్రీనివాసరావు మాతో ఆగ్రహంగా మాట్లాడారని, మహిళా ప్రజా ప్రతినిధులమని కూడా చూడకుండా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ మండల సమన్వయ అధికారికి వత్తాసు పలికేలా వ్యవహరించారని ఎంపీపీ వరహాలమ్మ, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి ఆరోపించారు. మీవి తప్పుడు ఆరోపణలఅంటూ మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఫిర్యాదు గురించి వివరిస్తూ మండల సమన్వయ అధికారి వడ్డి శ్రీధర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజకీయ కక్షతో తమకు పథకాల సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా సమావేశాలకు పిలవకుండా అవమానపరుస్తున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు మంజూరయ్యేలా చూస్తున్నారన్నారని, తనిఖీల పేరిట కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నారని, సొంత విధులు నిర్వహిండమానివేసి, మండలంపై పెత్తనం చెలాయించేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. దీంతో ఫిర్యాదు చేశామన్నారు. అయితే విచారణాధికారి శ్రీనివాసరావు తమ శాఖాధికారైన ఏడీని కాపాడే ధోరణిలోనే వ్యవహరించారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment