వివరాలు వెల్లడిస్తున్న శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి
శంషాబాద్: డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడు విలాసవంతమైన జీవితం కోసం నేరాల బాట పట్టాడు.. చైన్‌స్నాచింగ్‌లతో మొదలు పెట్టి ప్రభుత్వాధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ నేరగాడిగా మరాడు.. కేవలం 28 ఏళ్ల వయస్సులోనే అతడిపై 34 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఓ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నకిలీ ఏసీబీ అధికారి అవతారంలో తిరుగుతున్న అతడిని అరెస్ట్ చేశారు. గురువారం శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు...
అనంతపురం జిల్లా, కోటలపల్లి గ్రామానికి చెందిన నూతేటి జయకృష్ణ(28) 2016లో బీకాం పూర్తి చేశాడు. అనంతరం ఓ టెక్స్‌టైల్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎస్సై పరీక్షలకు సిద్ధమవుతున్న అతను అనంతపురం పట్టణంలో రెండు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లిన అతడికి అక్కడ అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనిల్ ద్వారా బెంగళూరులోని శ్రీనాథ్‌రెడ్డి పరిచయమయ్యాడు.
‘గ్యాంగ్’ స్ఫూర్తిగా తీసుకుని ..
తమిళ హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాను చూసిన వీరు దానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాధికారులను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ పక్క చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూనే మరోవైపు నకిలీ ఏసీబీ ప్రభుత్వాధికారులను బెదిరించి వసూళ్లు చేయడం మొదలుపెట్టారు. 2019లో నకిలీ ఏసీబీగా అవతారమెత్తిన జయకృష్ణ, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, అనంతపురం విశాఖపట్నం, విజయనగరం, తదితర ప్రాంతాల్లోని మున్సిపల్, రెవెన్యూ, రవాణా తదితర రంగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి మీపై ఆరోపణలున్నాయి సెటిల్ చేసుకోవాలంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. గత మార్చి, జూన్, జులైలో సిద్దిపేటలో ఇద్దరు ఉద్యోగులు, సైబరాబాద్ పరిధిలో ఒకరికి ఇదే తరహాలో ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసులు నమోదయ్యాయి.
బస్సుల్లో తిరుగుతూనే..
గుగూల్ ద్వారా ప్రభుత్వ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించడంతో పాటు విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల ఆధార్ కార్డుల ద్వారా సుమారు 200 నకిలీ సిమ్‌కార్డులు తీసుకుని వాడినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకున్న అనంతరం వారు పథకం ప్రకారం ఉదయం ఆర్టీసీ బస్సు ఎక్కేవారు. రాత్రి వరకు బస్సులో ప్రయాణం చేస్తూనే అధికారులకు ఫోన్ చేసి బెదిరించేవారు. పని పూర్తి కాగానే సిమ్‌ను అక్కడే పారేసేవారు. గత రెండేళ్లలో మొత్తం 9 బ్యాంకు ఖాతాల్లో రూ. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ.1.2 కోట్లు వేయించుకున్నట్లు గుర్తించారు.
డబ్బులు వచ్చిన వెంటనే గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేయడం జయకృష్ణకు అలవాటు. వరస నేరాలతో అప్రమత్తమైన శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నకిలీ సిమ్‌కార్డుల ఆధారంగా బెంగళూరులో జయకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.85 వేల నగదు, ఖాతాల్లో ఉన్న రూ.2.24లక్షలు, 8 ఫోన్‌లు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ అధికారులు ఎవరూ కూడా నేరుగా అధికారులకు ఫోన్లు చేయరని ప్రభుత్వాధికారులు దీనిని గుర్తించాలని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థులు కూడా గుర్తుతెలియని వ్యక్తులకు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వకూడదని సూచించారు. కేసును చేధించిన శంషాబాద్ ఎస్‌ఓటీ, శంషాబాద్ పోలీసులకు డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment