ఏసీబీకి పట్టుబడ్డ గచ్చిబౌలి ఏడీఈ రాము
గచ్చిబౌలి: లంచం తీసుకుంటూ గచ్చిబౌలి సబ్ ఇంజనీర్, ఏడీఈ ఏసీబీకి చిక్కారు. ఏడీఈ అందె రాముతో పాటు సబ్ ఇంజనీర్ వీరమల్ల సోమనాథ్‌ను ఈ మేరకు అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్‌పీ భద్రయ్య తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నానక్‌రాంగూడకు చెందిన రాకేష్ సింగ్ రెండు విద్యుత్ మీటర్లు బిగించేందుకు రూ.70 వేలకు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ బి.సందీప్ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పారు.
సందీప్ కుమార్ రెండు మీటర్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేశారన్నారు. ధరఖాస్తును గచ్చిబౌలి ఏఈకి పంపగా ఎస్టిమేట్ వేసి తిరిగి ఏడీఈకి పంపారని పేర్కొన్నారు. ఏఈకి ఫైల్ పంపాలని కాంట్రాక్టర్ సందీప్ ఏడీఈని కలువగా రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.
చివరకు రూ.20 వేలు ఇస్తాననడంతో ఒప్పుకున్నాడు. కాంట్రాక్టర్ మంగళవారం సాయంత్రం ఏడీఈ ఆఫీస్‌లో సబ్ ఇంజనీర్ సోమనాథ్‌కు రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడీఈ రాము వద్ద రూ.1,51,380 లెక్కలేని నగదు లభించిందన్నారు. కార్యాలయంతో పాటు హబ్సిగూడలోని ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment