తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆర్‌ఐ శోభను అదుపులో తీసుకుంటున్న ఏసీబీ అధికారులు
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం..మండల పరిధిలోని అంజంపూర ప్రాంతానికి చెందిన దూదువాయి వెంకటేశ్వరరావు తన తండ్రి మరణించడంతో ఉన్న ఆస్తిని తన తల్లి పేరుపై మార్చేందుకు అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ లలితను సంప్రదించారు. దీనిని ఆమె ఇదే కార్యాలయంలో పనిచేసే స్పెషల్ ఆర్‌ఐ శోభ దృష్టికి తీసుకువెళ్లింది. వీరిద్దరు కలిసి స్థలానికి మొత్తం ఖరీదు రూ.60 నుంచి 80 లక్షల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు.
ఈ స్థలంపై ఎలాంటి చిక్కులు లేవని పైఅధికారులకు రిపోర్టు పంపించేందుకు కనీసం రూ.20 లక్షలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ డ్రైవర్ ఏం.బాపుయాదవ్‌ను రంగంలోకి దింపారు. బాపుయాదవ్ మధ్యవర్తిగా వ్యవహరించి వెంకటేశ్వరరావుతో రూ.10 లక్షలు ఇస్తే పని అవుతుందని చెప్పారు. దీంతో వెంకటేశ్వరరావు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారులు రంగు పూసిన రూ.1.50 లక్షలను వెంకటేశ్వరరావుకు అందించి బాపుయాదవ్‌కు ఇవ్వాల్సిందిగా సూచించారు.
వారి ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ టీ కొట్టులోకి బాపుయాదవ్‌ను పిలిచి రూ.1.50 లక్షలు అందించారు. వెంటనే మఫ్టీలో ఉన్నా ఏసీబీ అధికారులు బాపుయాదవ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చేతులు కడుగగా రంగు మారాయి. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా సర్వేయర్ లలిత, స్పెషల్ ఆర్‌ఐ శోభ ఆదేశాల మేరకు తీసుకున్నట్లు వెల్లడించారు. అక్కడే ఉన్న సర్వేయర్ లలిత , శోభ, బాపుయాదవ్‌లను అరెస్ట్ చేశారు. ఈ దాడులను ఏసీబీ జేడీ సుధేందర్ పర్యవేక్షించారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రఘునందన్, రాజేష్‌లు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment