హైదరాబాద్: నకిలీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారి ఎన్.జయకృష్ణ లీలలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వందలాది ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి, అవినీతి ఫిర్యాదులు వచ్చాయని, కేసులు నమోదు చేస్తానని బెదిరించి, బలవంతపు వసూళ్లకు పాల్పడిన జయకృష్ణను శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పట్టుమని మూడు పదుల వయస్సు కూడా లేని ఈ నిందితుడు పక్కా పథకం ప్రకారమే మోసాలకు పాల్పడేవాడు. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును బదిలీ చేసేందుకు తొమ్మిది వేర్వేరు బ్యాంకు ఖాతాలు, 200 సిమ్ కార్డులను వినియోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పేర్లు, గొంతు మార్చి, ఏమార్చి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాల వెబ్‌సైట్ల నుంచి 500 మంది అధికారుల ఫోన్ నంబర్లు సేకరించిన తర్వాత జయకృష్ణ..వీటిల్లో వంద మంది అధికారులకు ఫోన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తొలుత తనని తాను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌గా పరిచయం చేసుకొని, మీ మీద అవినీతి ఫిర్యాదులు వచ్చాయని, దీనికి సంబంధించి తన పైఅధికారి డీఎస్పీ మాట్లాడాలనుకుంటున్నారని బాధితులకు చెప్పేవాడు. ఆ తర్వాత కొంత సేపటికి మరొక ఫోన్ నంబరు నుంచి పేరు, హోదా, గొంతు మార్చి తనను తాను డీఎస్పీగా పరిచయం చేసుకునేవాడు. అవినీతి కేసులు లేకుండా చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. జయకృష్ణ డిమాండ్‌ను పట్టించుకోకుండా వ్యక్తిగతంగా కలవాలని ఎవరైనా అధికారి కోరితే.. వెంటనే ఫోన్ కట్ చేసేవాడని, డబ్బు వచ్చిన తర్వాత బాధితులకు మళ్లీ ఫోన్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేసేవాడు కాదని దర్యాప్తులో పోలీసులకు జయకృష్ణ వివరించినట్లు తెలిసింది.
ఆ అవినీతి అధికారులు ఎవరు?
ఏడాది కాలంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడు తెలంగాణకు చెందిన ప్రభుత్వ అధికారుల నుంచి రూ.70 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారుల నుంచి రూ.30 లక్షలు.. మొత్తంగా రూ.కోటి వసూలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇలా వసూలు చేసిన సొమ్ముతో జయకృష్ణ కేసినో ఆడటం, గోవాలో పార్టీలు, లగ్జరీ పబ్‌లలో మద్యం తాగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఈ నకిలీ ఏసీబీ వలలో చిక్కిన ఏ అవినీతి అధికారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం, డబ్బు బదిలీ అయ్యిందో లేదో నిర్ధారించుకునే సాహసం కూడా చేయకపోవటం గమనార్హం. ఏ అధికారి నుంచి ఎంత మేర సొమ్ము వసూలు చేశాడు, ఆయా ఆఫీసర్లను గుర్తించేందుకు పోలీసులు జయకృష్ణను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్‌ను దాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment