భోపాల్: మధ్యప్రదేశ్‌లో పోలీసు ఉన్నతాధికారి భార్యపై దాడిచేసి దారుణంగా కొట్టిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్త వివాహేతర సంబంధాన్నిరెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్యపై ఎదురు దాడి చేసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన డీజీ స్థాయి అధికారి పురుషోత్తం శర్మ మరో మహిళతో ఇంట్లో అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నప్పుడు భార్య చూశారు. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన పురుషోత్తం భార్యపై తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో పురుషోత్తం కుమారుడు పార్థ్ గౌతమ్ (ఐఆర్ఎస్) ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై హోంమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రిపై కేసు నమోదు చేయాలని కోరారు.
మరోవైపు సోషల్ మీడియాలోఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పురుషోత్తంను తక్షణమే విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీడియో తాను చూశానని పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా హామీ ఇచ్చారు. అటు ఈ సంఘటనపై రాష్ట్రమహిళా కమిషన్కూడా స్పందించింది. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని కమిషన్ ప్రతినిధి సంగీత శర్మ తెలిపారు.
32ఏళ్ల క్రితం తమ వివాహం జరిగిందని, 2008లో తనపై భార్య ఫిర్యాదు చేసిందంటూ పురుషోత్తం చెప్పుకొచ్చారు. అప్పటినుంచి తన ఇంట్లోనే ఉంటూ అన్ని సౌకర్యాలను అనుభవిస్తోందనీ, తాను దుర్మార్గుడినే అయితే ఇప్పటివరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. తాను నేరస్తుడి కాదని ఇది కుటుంబ వ్యవహారమనీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఇంట్లో సీసీ టీవీలతో భార్య తనపై నిఘా పెట్టిందనీ, తాను రక్షించుకునే క్రమంలో దురదృష్టవశాత్తూ ఈ సంఘటన చోటు చేసుకుందని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment