టెన్త్ పరీక్షల్లో యాక్ట్ 97 అమలు
విద్యార్థి కాపీ కొడితే.. అధికారులు జైలుకే
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పటిష్ట చర్యలు
పరీక్ష, అధికారులు, పదో తరగతి
ఏలూరు సిటీ :
పదో తరగతి పరీక్షలు అధికారులకు కత్తిమీద సాములా మారనున్నాయి. ఈసారి పబ్లిక్ పరీక్షల నిర్వహణ కఠినతరంగా కానుంది. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల నడుమ పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులెవరైనా కాపీ కొడితే వారితోపాటు, ఇన్విజిలేటర్, అధికారులను సైతం జైలుకు పంపేలా చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పరీక్షలను నల్లేరు మీద బండి నడకలా భావించే విద్యార్థులకు, విద్యాసంస్థలకు సర్కారు షాక్ ఇవ్వనుంది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో..
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చూచిరాత నిరోధక చట్టం1997ను ఏవిధంగా అమలు చేయబోతున్నారో స్పష్టంఽగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను 2016 నవంబర్ 23న హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని ఫిబ్రవరి 3వ తేదీలోగా తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏలూరు సమీపంలోని ఆశ్రం వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గత ఏడాది ఏప్రిల్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో కాపీయింగ్‌కు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. రెండు దఫాలుగా డాక్టర్ శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. పరీక్షల్లో విద్యార్థులతో కాపీయింగ్ చేయించడం వల్ల వారిలో సహజమైన ప్రతిభ బయటకు రావటం లేదని, యాక్ట్ 97ను సమర్థవంతంగా అమలు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పరీక్షల అమలు తీరుపై నివేదిక ఇవ్వాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.
కాపీ కొడితే జైలుకే..
చూచిరాత నిరోధక చట్టం 97 ప్రకారం ఏ పరీక్ష కేంద్రంలో అయినా విద్యార్థి కాపీ కొడితే అందుకు ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులే ప్రధాన బాధ్యులవుతారు. విద్యార్థితోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతోంది. విద్యార్థి కాపీ కొడితే 3 నుంచి 6నెలల జైలు శిక్షతోపాటు, జరిమానా కూడా విధించాలని యాక్ట్97 చెబుతోంది.
అప్పట్లో తూతూమంత్రమే
2016 మార్చిలో నిర్వహించిన టెన్త్ పరీక్షల సందర్భంగా ఐదు పరీక్షా కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఈ జాబితాలో నరసాపురం మిషన్ హైస్కూల్, ఆచంట మండలం కొడమంచిలిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ఉండి మండలం చెరుకువాడలోని ఇన్‌ఫాంట్ జీసస్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, చింతలపూడి మండలం ప్రగడవరం జెడ్పీ హైస్కూల్, పెంటపాడు మండలం అలంపురంలో జెడ్పీ హైస్కూల్ ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను ఇద్దరు ఉపాధ్యాయులకు అప్పగించారు. అయితే, పర్యవేక్షణ తూతూమంత్రంగానే సాగిందనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఉన్నాయి. ఈ విధానం మంచిదే అయినా.. మెరుగైన పద్ధతిలో పర్యవేక్షణ ఉంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విద్యార్థి ప్రతిభ నిర్వీర్యం
చూచిరాత నిరోధక చట్టం 97ను అమలు చేయలేకపోవటంతో విద్యార్థుల్లో అలసత్వం పెరిగి.. తమ ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోతున్నారు. పరీక్షల్లో చూచిరాతకు అనువైన పరిస్థితులు ఉండటంతో దానిని విద్యార్థి అవకాశంగా తీసుకుంటున్నాడు. గుజరాత్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే నిర్వహిస్తున్నారు. ఈ విధానం వల్ల అక్కడి విద్యార్థులు కష్టపడి చదవటం అలవాటు చేసుకుంటున్నారు. ఇన్విజిలేటర్లు, అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విధిగా అమలు చేయాల్సి ఉంది.
డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆశ్రం కళాశాల