పట్టుబడిన శ్రీకాంత్‌ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ విల్సన్
ఏలూరు టౌన్ : మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. దెందులూరు మండలం దోసపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో సహజ సిద్ధంగా చేపలవేట చేసుకుంటున్న రైతులను సొమ్ములు డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతోన్న వైల్డ్‌లైఫ్ బీట్ ఆఫీసర్ (అభయారణ్య బీట్ అధికారి) కాటుబోయిన శ్రీకాంత్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా ప్లాన్ వేసి పట్టుకున్నారు. ఏలూరు ఆర్‌ఆర్ పేట విజయమెస్ పక్కనే ఉన్న సాయిబాబా స్టీల్స్ షాపులో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఉండగా గురువారం ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏలూరు అమీనాపేటలోని డీఎఫ్‌వో కార్యాలయానికి సంబంధించి దోసపాడు గ్రామ కేంద్రంగా ఐదు గ్రామాలకు వైల్డ్‌లైఫ్ అధికారిగా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. దోసపాడుకు చెందిన మేడూరి వెంకటేశ్వరరావును చేపల వేట చేసుకునేందుకు కొంతకాలంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. రూ.50 వేలు సొమ్ము ఇవ్వకుంటే కేసులు పెడతానని వేధింపులకు పాల్పడడంతో వెంకటేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు వలపన్ని సొమ్ము తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో హెచ్‌సీ రత్నారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
కారుణ్య నియామకంలో ఉద్యోగం
ఏలూరు అమీనాపేట జిల్లా అటవీశాఖ కార్యాలయానికి సంబంధించి దెందులూరు మండలం దోసపాడు గ్రామం కేంద్రంగా వైల్డ్‌లైఫ్ బీట్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ పనిచేస్తున్నారు. శ్రీకాంత్ తండ్రి లేటు సత్యం అటవీశాఖలోనే పని చేస్తూ మరణించటంతో కారుణ్య నియామకాల్లో బాగంగా శ్రీకాంత్‌కు ఉద్యోగం వచ్చింది. స్వగ్రామం కొయ్యలగూడెం మండలం కన్నాపురం. గతంలో కన్నాపురం, పోలవరంలో పనిచేయగా, 2016 నుంచీ ఏలూరులో పనిచేస్తున్నాడు. సహజ సిద్ధ చేపలవేట చేస్తున్న మత్స్యకారులను బెదిరిస్తూ సొమ్ములు డిమాండ్ చేస్తున్నాడు.
రెండేళ్ల నుంచి వసూళ్లు
దోసపాడు గ్రామం పరిధిలో సహజసిద్ధ చేపలవేట చేసుకోవాలంటే భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇలా చాలాసార్లు కొంత మొత్తంలో సొమ్ములు తీసుకున్నాడు. ఇటీవల రూ.50 వేలు కావాలని డిమాండ్ చేశాడు. మా దగ్గర అంత సొమ్ములేకపోవటంతో ఇవ్వలేకపోయాం. ఇవ్వకపోతే కేసులు పెడతానని బెదిరించటంతో చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.
– మేడూరి వెంకటేశ్వరరావు, ఫిర్యాదుదారుడు
Comments
Please login to add a commentAdd a comment