
వేణుమాధవరావు
ఒకే అధికారి.. ఆరు బాధ్యతలు అప్పగించారు.
రంగారెడ్డి, తాండూరు టౌన్ : ఒకే అధికారి.. ఆరు బాధ్యతలు అప్పగించారు. ఉన్న ఒకే ఒక్క ఉద్యోగానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తేనే అనేక సమస్యలు మిగిలిపోతుంటాయి. మరి ఓ అధికారి ఆరు ఉద్యోగాలు ఒకేసారి చేయాలంటే ఎంత ఇబ్బందో ఆలోచించండి. ఈ విచిత్ర పరిస్థితి తాండూరు ఆర్డీఓ వేణుమాధవరావుకు ఎదురైంది. ఇప్పటికే ఆయన తాండూరు ఆర్డీఓగా, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దీనికి తోడుగా వికారాబాద్ ఇన్‌చార్జి ఆర్డీఓగా, పరిగి, కొడంగల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. మొత్తం ఆరు ఉద్యోగాలను నిర్వర్తించడానికి వేణుమాధవరావు ఉన్నారు. ఈ బాధ్యతలతో వేణుమాధవరావు ఏ ఒక్క దానిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం లేదు. ఈయన ఒక్కరే పలు శాఖల అధికారులు కూడా తమ విధులతో పాటు అదనపు విధులు చేస్తున్నారు. ఒక అధికారి రిటైర్డ్ అవుతారని గానీ, ఒకరిని బదిలీ చేసినపుడు మరొకరిని నియమించకుండా ప్రభుత్వం ఉన్నవారికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒక అధికారికి ఇన్నేసి బాధ్యతలు అప్పగిస్తే దేనిపై దృష్టి సారిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.